కరోనా లాక్‌డౌన్: మూడు నెలలు ఈఎంఐ వాయిదా వేసుకోవడం మంచిదేనా?

2000నోటు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రూ.2000 నోటు ముద్రణ ఆగిందా?
    • రచయిత, దినేశ్ ఉప్రేతీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రిజర్వ్ బ్యాంక్ సూచనల ప్రకారం చాలా బ్యాంకులు తమ వినియోగదారులకు ఈఎంఐ వాయిదా వేసుకునే ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నాయి.

- మూడు నెలల వరకూ ఈఎంఐ చెల్లించాల్సిన అవసరంలేదు.

- ప్రజలకు భారీ ఉపశమనం, మూడు నెలల ఈఎంఐ నుంచి విముక్తి

టెలివిజన్ తెరలపై పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చిన బ్రేకింగ్ న్యూస్‌ మీ దృష్టిని ఆకర్షించే ఉంటుంది.

మీరు మీ ఇంటి రుణం, కార్ లోన్, లేదా ఇతర సుదీర్ఘ అవసరాల కోసం తీసుకున్న రుణాల నెలవారీ మొత్తం అంటే ఈఎంఐలను మూడు నెలలు చెల్లించాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు.

కరోనావైరస్ మహమ్మారి దృష్ట్యా 2020 మార్చి 1 నుంచి, 2020 మే 31 వరకూ కట్టాల్సిన టర్మ్ లోన్ వాయిదాలు, క్యాష్, క్రెడిట్ ఫెసిలిటీపై వడ్డీ రికవరీని వాయిదా వేయాలని నిర్ణయించారు.

బ్యాంకింగ్ వ్యవస్థ పరిస్థితి

గత వారం భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ ప్రకటన చేయగానే ఈ ప్రకటనకు అర్థమేంటి?, ఇది ఎవరికోసం?, దీనికి ఎవరు అర్హులు? అని చాలా రకాల ప్రశ్నలు మొదలయ్యాయి.

నిపుణులు మాత్రం ఇది బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చిన సూచన మాత్రమే, ఆదేశం కాదు అని చెబుతున్నారు. అంటే వినియోగదారులకు ఈ ప్రయోజనం ఎలా అందించాలి అనేదానిపై మీరే నిర్ణయం తీసుకోవాలని బ్యాంకులకు ప్రత్యామ్నాయం ఇచ్చింది.

బ్యాంకింగ్ సిస్టమ్‌ ఇప్పుడు పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయి ఉంది. ఈ పరిస్థితుల్లో చాలా బ్యాంకులు (ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులు) తమ ఆర్థిక ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తూ రిజర్వ్ బ్యాంకు సలహాను నిర్లక్ష్యం కూడా చేయవచ్చు.

దీనిని ఎలా ఇవ్వాలనేదానిపై, బ్యాంకులు తమ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి అని కూడా రిజర్వ్ బ్యాంక్ చెప్పింది.

ఇప్పుడు దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ స్పందిస్తూ.. తాము రిజర్వ్ బ్యాంక్ ప్రకటనను అమలు చేస్తామని చెప్పింది. ఎస్‌బీఐతోపాటూ లోన్ వాయిదాలపై మారటోరియం అందిస్తామని వేరే చాలా బ్యాంకులు కూడా చెప్పాయి.

వీటిలో ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ ఉన్నాయి.

మూడు నెలల ఈఎంఐ వాయిదా మంచిదేనా?

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మూడు నెలల ఈఎంఐ వాయిదా మంచిదేనా?

అలా చేయడం మంచిదేనా?

కొన్ని బ్యాంకులు మార్చి చివరి తేదీ, అంటే మార్చి 31న ఈ అంశంపై మార్గదర్శకాలు జారీ చేసాయి. అంటే ఇప్పుడు చాలా మంది వినియోగదారులకు రెండు నెలల ఈఎంఐలు(ఏప్రిల్, మే నెలల) వాయిదా వేసుకునే ప్రత్యామ్నాయం మాత్రమే ఉంది.

కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, బ్యాంకులు మీ ఈఎంఐ హోల్డ్ చేసినా, మీ వడ్డీ మీటర్ మాత్రం నడుస్తూనే ఉంటుంది. తర్వాత దానిని మీ ద్వారానే భర్తీ చేస్తారు.

“మీ దగ్గర నిజంగానే డబ్బుల కటకట ఉంటే, ఈఎంఐ వాయిదా వేసుకునే ఈ ప్రత్యామ్నాయం తెలివైనపనే అవుతుంది. లేదంటే దాని ప్రభావం మీ జేబు మీదే పడుతుంది” అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

“పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ విషయంలో ఆ దెబ్బ గట్టిగా ఉంటుంది. నిజానికి, హోంలోన్, ఆటో లోన్‌తో పోలిస్తే పర్సనల్ లోన్ వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. వడ్డీ రూపంలో మీరు చాలా ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది” అని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.

దీని వల్ల వినియోగదారుల మీద రెండు రకాల దెబ్బ పడుతుంది. ఒకటి రుణ కాల పరిమితి మూడు నెలలు ముందుకు వెళ్లడం. రెండోది రుణ మొత్తం కూడా పెరగడం.

ఉదాహరణకు మీ లోన్ 2025 మార్చ్ 1కి ముగుస్తుంది అనుకుంటే, అది ఇప్పుడు 2025 జూన్ 1న ముగుస్తుంది. మార్చి వాయిదాలు ఇప్పటికే కట్టేసినవారికి అది రెండు నెలలు పెరుగుతుంది. అయితే, కొన్ని బ్యాంకులు ఇక్కడ కూడా వినియోగదారులకు ఉపశమనం అందించాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా మార్చి నెల వాయిదాను తమ వినియోగదారులకు తిరిగి చెల్లిస్తామని చెబుతోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

దీనివల్ల ఎంత నష్టం?

రిజర్వ్ బ్యాంక్ నోటిఫికేషన్ ప్రకారం ఈ అవధిలో వడ్డీని వినియోగదారుల నుంచే వసూలు చేస్తామని భారతీయ స్టేట్ బ్యాంక్ స్పష్టం చేసింది.

బ్యాంక్ తమ వెబ్‌సైట్‌లో దానిని ఉదాహరణతో వివరించింది. ఒక వినియోగదారుడి రుణం తర్వాత 15 ఏళ్లలో పూర్తికాబోతుంటే, అతడు 30 లక్షల లోన్ తీసుకుని ఉంటే.. ఈ మూడు నెలల రుణ మొత్తం 2.35 లక్షలు అంటే, సుమారు 8 ఈఎంఐలతో సమానంగా ఉంటుంది. (ఇప్పుడు స్టేట్ బ్యాంక్ హోంలోన్ వడ్డీ రేటు 7.2 శాతం ఉంది)

క్రెడిట్ కార్డ్ విషయంలో ఈఎంఐ వాయిదా వేయడం వల్ల చాలా నష్టం ఉంటుంది. మిగతా అప్పులతో పోలిస్తే క్రెడిట్ కార్డుకు చాలా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు. ఈ రేటు ఏడాదికి 36 శాతం వరకూ ఉంటుంది. అంటే మీ దగ్గర డబ్బు ఉంటే మారటోరియం సౌకర్యం ఉన్నప్పటికీ, మీ క్రెడిట్ కార్డ్ బిల్లును నిర్ణీత తేదీ లోపలే చెల్లించేయడం మంచిది.

క్రెడిట్ కార్డ్ ఆధారిత పేమెంట్ యాప్ CRED కూడా మీరు వాయిదాలు చెల్లించకపోతే, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉండవచ్చు అని తమ యూజర్లకు వివరించింది.

“36 నుంచి 42 శాతం చక్రవడ్డీ నుంచి బయటపడడానికి, వీలైతే మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించేయడం మంచిది అని సీఆర్ఈడీ కోరుతోంది” అని అది తమ సందేశంలో చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)