దిల్లీ హింస: ఈ ఫొటోలోని వ్యక్తి ఎవరు... ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు?

జుబేర్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, దేబలిన్ రాయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెల్లటి కుర్తా-పైజామా మీద రక్తం మరకలతో నిస్సహాయ స్థితిలో నేలపై వంగి ఉన్న ఆ వ్యక్తి రెండు చేతులతో తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తల నుంచి కారిన రక్తం రెండు చేతులనూ తడిపేస్తోంది. చుట్టుముట్టిన అల్లరిమూకలు ఆయన్ను కర్రలు, రాడ్లతో కొడుతున్నాయి.

దిల్లీ అల్లర్ల తీవ్రతకు అద్దం పట్టే ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి 37 ఏళ్ల మొహమ్మద్ జుబేర్. ఆ ముఖం, ఆ గాయాలు ఆయన్ను చాలాకాలం వరకూ వెంటాడుతూనే ఉంటాయి.

ఈశాన్య దిల్లీలో ఉంటున్న జుబేర్ సోమవారం ఇంటికి దగ్గర్లో ఉన్న మసీదులో ఏటా జరిగే ఇజ్తమాలో పాల్గొనడానికి బయల్దేరారు. కానీ, మరికాసేపట్లో తనకు ఏం జరగబోతోందో ఆయనకు తెలీదు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

"సోమవారం నేను ప్రార్థనల్లో పాల్గొనడానికి మసీదుకు వెళ్లాను. అవి పూర్తైన తర్వాత ఇంట్లో వాళ్లకోసం తినడానికి కొన్ని కొన్నాను. నేను ప్రతి ఏటా ఇజ్తమా తర్వాత పిల్లలకు హల్వా, పరాఠా, దహీవడ, బిస్కెట్లు లాంటివి కొంటుంటాను. ఆరోజు కూడా కొన్నా.

మొదట మా చెల్లెలి దగ్గరకు, లేదంటే ఎవరైనా బంధువుల ఇళ్లకు వెళ్లాలనుకున్నా. తర్వాత ఆలోచించా. మొదట ఇంటికి వెళ్తే, నాకోసం ఎదురుచూస్తున్న పిల్లలు సంతోషిస్తారని అనుకున్నా" అంటూ ఆ రోజును గుర్తు చేసుకున్నారు జుబేర్.

ఆరోజు జుబేర్ హడావుడిలో తన ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్లారు.

అడ్డగీత
అడ్డగీత

"నేను మసీదు వైపు వెళ్తున్నా. ఖజూరీ ఖాస్ దగ్గరకు చేరుకోగానే.. అక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతున్నట్టు అనిపించింది. హిందూ-ముస్లిం గొడవ జరుగుతోంది. అది వినగానే నేను భజన్‌పురా మీదుగా సబ్ వే నుంచి చాంద్‌బాగ్ చేరుకుందామని అనుకున్నా. నేను భజన్‌పురా మార్కెట్ చేరుకునేసరికి, అది మూసేసి ఉంది. అక్కడంతా జనం గుమిగూడుతున్నారు. గోలగోలగా ఉంది. నేను అక్కడ్నుంచి బయటపడ్డా. నేను కుర్తా పైజామా టోపీ వేసుకుని ఉన్నా. మొత్తం ఇస్లాం దుస్తుల్లో ఉన్నా.

అక్కడ నుంచి వస్తుంటే.. నన్ను ఎవరూ ఏమీ అనలేదు. నేను సబ్ వే నుంచి కిందికి వెళ్తున్నా. అక్కడున్న ఒకరు నన్ను చూశాడు. మీరు కిందికి వెళ్లకండి అన్నాడు. అక్కడ ప్రమాదం పొంచి ఉండొచ్చు. మీరు ముందు నుంచి వెళ్లిపొండి అన్నాడు’’ అని జుబేర్ చెప్పారు.

జుబేర్

ఫొటో సోర్స్, Reuters

‘జంతువును వేటాడుతున్నట్లుగా చుట్టుముట్టారు’

ఆయన మాట విని జుబేర్ సబ్‌వే నుంచి వెళ్లకుండా ముందు వైపు నుంచి వెళ్తున్నారు. అప్పుడు అక్కడ ఆయనకు రెండు వైపులా తీవ్రంగా రాళ్లు రువ్వుకోవడం కనిపించింది.

‘‘అక్కడ ఒకవైపు వందల మంది ఉన్నారు. ఇంకోవైపు ఎంతమంది ఉన్నారో సరిగా కనిపించలేదు. కానీ రాళ్లు రెండు వైపుల నుంచీ పడుతున్నాయి. అది చూడగానే భయంతో వెనక్కు వెళ్లాలనుకున్నా. అప్పుడే జనంలోని కొందరు నన్ను చూసేశారు. ఆ తర్వాత ఒక యువకుడు కొట్టాలనే ఊపుతో నావైపు వచ్చాడు. నేను అతడితో నేను మిమ్మల్నేం చేశాను అన్నా. మా ఇద్దరి మధ్యా కాస్త మాటామాటా పెరిగింది. ఆ తర్వాత చాలా మంది ఓ జంతువును వేటాడుతున్నామన్నట్లుగా ఒక్కసారిగా నాపైకి దూసుకొచ్చారు’’ అని వివరించారు జుబేర్.

జుబేర్ తలపైన ఒకడు రాడ్‌తో కొట్టాడు. రెండోసారి, మూడోసారి.. అలా దెబ్బలు పడుతూనే ఉన్నాయి.

‘‘నా తలపైన రాడ్‌తో కొట్టగానే ఆ దెబ్బకు మోకాళ్లపై పడిపోయా. నాకు స్పృహ తప్పుతున్నట్టు అనిపించింది. చుట్టుపక్కల మాటలు ఏవీ వినిపించడం లేదు.. అప్పుడే ఎవరో నా తలపై తల్వార్ (కత్తి)తో వేటు వేశాడు. అల్లా దయవల్ల ఆ తల్వార్ మొత్తం నా తలపై పడకుండా సైడ్‌లో పడింది. అది నా తలమీద పడుంటే బతికే అవకాశమే ఉండేది కాదు’’ అని జుబేర్ చెప్పారు.

దాడి చేసిన గుంపు జుబేర్‌ను కొడుతూనే వచ్చారు. తాను ఇక బతకననే జుబేర్ అనుకున్నారు.

జుబేర్

ఫొటో సోర్స్, Reuters

‘అల్లా దగ్గరికే వస్తున్నా అనుకున్నా’

‘‘మనసులో అల్లాను తలుచుకున్నా. ‘నీ దగ్గరికే వస్తున్నా’ అనుకున్నా. ఏ ఆశా లేదు. అక్కడ 20-25 మంది ఉన్నట్టున్నారు. వాళ్ల చేతుల్లో శక్తి ఉన్నంతవరకూ నన్ను కొడుతూనే ఉన్నారు. ఒకటి తర్వాత ఒకటిగా దెబ్బలు పడుతూనే ఉన్నాయి. ఒకసారి కర్రతో, మరోసారి రాడ్‌తో.. అలా ఎన్ని దెబ్బలు పడ్డాయో గుర్తే లేదు’’ అని జుబేర్ చెప్పారు.

తనపై దాడి చేసినవారు ‘జై శ్రీరాం’, ‘వాడ్ని కొట్టండి’ అనడం వినిపించాయని జుబేర్ చెప్పారు. దెబ్బలు తిన్న తర్వాత తనను ఎవరో ఎత్తుకుని తీసుకెళ్లడం గుర్తుందని వివరించారు.

తనను తీసుకెళ్లినవారు ‘‘పల్లీపార్ తీసుకెళ్లండి.. త్వరగా పదండి’’ అని అనడం తాను విన్నానని చెప్పారు.

జుబేర్

ఫొటో సోర్స్, Reuters

ఆ తర్వాత జుబేర్‌కు అంబులెన్సులో, తర్వాత ఆస్పత్రిలో కాస్త తెలివి వచ్చింది. ఆస్పత్రిలో ఆయన దగ్గర కుటుంబ సభ్యులెవరూ లేరు. తన పక్కనున్న వాళ్లకు తమ ఇంటి నంబర్ చెప్పి తన కుటుంబ సభ్యులను పిలిపించాలని ఆయన అడిగారు.

‘‘అప్పుడు బహుశా డాక్టర్లు కూడా నాపై పెద్దగా శ్రద్ధ చూపించలేదు. నాకు తల నొప్పి ఎక్కువగా ఉంది. చాలా రక్తం పోతోంది. నా ఎదురుగా మరో వ్యక్తి ఉన్నాడు. అతడి రెండు చేతులూ తెగిపోయున్నాయి. మీ రెండు చేతులూ తీసేయాల్సుంటుంది అని డాక్టర్ చెప్పడం నేను విన్నా. అదంతా విని నాకు మాట రాలేదు. అక్కడ ఎవరో నాకంటే పెద్ద కష్టంలో ఉన్నారని అనిపించింది’’ అని జుబేర్ చెప్పారు.

జుబేర్ తల్లి
ఫొటో క్యాప్షన్, జుబేర్ తల్లి

‘అమ్మ ఏడుస్తూ ఉండిపోయింది’

తన తలకు కుట్లు ఎప్పుడు వేశారో కూడా జుబేర్‌కు గుర్తులేదు. ఆయనకు తలపై 25-30 కుట్లు పడ్డాయి. ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడం, ఎవరూ అడగడానికి రాకపోవడం ఆయన్ను బాధిస్తోంది.

జుబేర్ ఇప్పటివరకూ ఒక ఎఫ్ఐఆర్ కూడా రాయించలేదు. ఎందుకంటే ఆయన గానీ, ఆయన ఇంట్లోవారు గానీ ఆ పరిస్థితిలో లేరు. ఆయనకు ఇంకా ఆస్పత్రిలోని ఎంఎల్‌సీ కూడా అందలేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఇది కీలకం.

దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత జుబేర్‌ను ఆయన పిల్లలు, కుటుంబ సభ్యులు కలవగలిగారు. ఆయన్ను చూసినపుడు ఇంట్లోవాళ్లందరూ బతకడేమో అనుకున్నారు.

వృద్ధురాలైన జుబేర్ తల్లి కూడా నాలుగు రోజుల తర్వాత కొడుకును చూడగలిగారు. ఆయన పరిస్థితిని చూసి కన్నీరుమున్నీరైన ఆమె మీడియాతో సరిగా మాట్లాడలేకపోయారు.

‘‘నాకు ఎవరూ ఏమీ ఇవ్వనక్కర్లేదు. ప్రభుత్వం నుంచి ఏదీ వద్దు. అల్లా దయ వల్ల నా బిడ్డ బతికాడు అదే చాలు. ఇక మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి’’ అని అన్నారు.

జుబేర్

ఫొటో సోర్స్, Reuters

‘పోలీసులు అక్కడే ఉన్నారు’

‘ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారా?’ అని ప్రశ్నించినప్పుడు... అల్లర్లు ఆపలేకపోయిన ప్రభుత్వం నుంచి ఏం ఆశించగలమని జుబేర్ ఎదురు ప్రశ్నించారు.

‘‘నన్ను కొడుతున్నప్పుడు పోలీసులు దగ్గరలోనే తిరుగుతున్నారు. అయినా కొడుతున్నవారిలో ఎలాంటి భయమూ కనిపించలేదు. జాతర జరుగుతున్నట్లు, వాళ్లను ఏదైనా చేయడానికి పూర్తిగా స్వేచ్ఛగా వదిలేసినట్టుంది. నన్ను కొడుతున్నప్పుడు పోలీసులు అక్కడ నడిచివెళ్లడం నేను చూశాను. అక్కడ జరిగేదానితో తమకేం సంబంధం లేదన్నట్టు ఉండిపోయారు’’ అని జుబేర్ చెప్పారు.

ఇంతకు ముందు తను ఎవరితో గొడవ పెట్టుకోలేదని, వాదనలకు కూడా దిగలేదని జుబేర్ అన్నారు.

జుబేర్ శరీరంలో గాయాలు తగలని చోటే లేదు. మొత్తం శరీరమంతా నల్లగా కమిలిపోయి ఉంది. అన్ని దెబ్బలు తిన్నా, ఆయన స్థానిక డాక్టరు దగ్గరే చికిత్స చేయించుకుంటున్నారు.

పెద్ద డాక్టరు దగ్గరికి కొన్ని రోజుల తర్వాత వెళ్తానని చెప్పారు. పరిస్థితి దారుణంగా మారవచ్చని ఆయనకు ఇప్పటికీ భయమేస్తోంది. మాటల మధ్యలో అప్పుడప్పుడూ ఆయన బాధతో మూలుగుతున్నారు.

జుబేర్

ఫొటో సోర్స్, BBC/Debalin Roy

‘హిందువులు ఇలా చేశారనని అనను’

‘మీకు భయంగా ఉందా, కోపంగా ఉందా’ అని అడిగితే.. అల్లరి మూక కొడుతున్నప్పుడు కూడా తనకు అలా అనిపించలేదని జుబేర్ బదులిచ్చారు.

‘‘మూకలు మహా అయితే మన ప్రాణాలు తీయగలవు. అంతకన్నా ఇంకేం చేయగలవు. నాకు అప్పుడు కూడా భయం వేయలేదు. ఇప్పుడు, ఎప్పుడూ.. నేను భయపడను. నేరాలకు భయపడటం పిరికితనం, చేతగానితనం అవుతుంది. మనం ఏదైనా నేరం చేస్తుంటే, చెడ్డ పని చేస్తుంటే భయమేస్తుంది. నేను అలాంటిదేం చేయనపుడు ఎందుకు భయపడాలి? ఒక మనిషిని కొట్టామన్న భయం వాళ్లకు ఉండాలి’’ అని ఆయన అన్నారు.

దేశ రాజధాని దిల్లీలో ఇలాంటి పరిస్థితి చూడాల్సి వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదని జుబేర్ చెప్పారు.

మాట్లాడుతూ జుబేర్ ఎమోషనల్ అయిపోయారు. కాసేపు ఆగి, తాను ఒక సందేశం ఇవ్వాలని అనుకుంటున్నానని అన్నారు.

‘‘హిందూ, ఇస్లాం, క్రైస్తవం.. మతం ఏదైనా ఏ తప్పూ నేర్పించదు. వాళ్లు నాపై అలా దాడి చేశారు. పిల్లలు తినడానికి సంతోషంగా వస్తువులు కొనుక్కుని తీసుకెళ్తున్న నన్ను.. కత్తితో, రాడ్లతో, కర్రలతో కొట్టారు. అలాంటి వాళ్లను మానవత్వానికి శత్రువులుగానే భావించాలి. వారిని ఒక మతంతో జోడించడం సరి కాదు. హిందువులు నన్ను ఇలా చేశారని నేను చెప్పడం లేదు. అలా చేసేవారు హిందువో, ముస్లిమో కారు. ప్రతి మతమూ ప్రేమ, శాంతి సందేశాలనే ఇస్తుంది’’ అని జుబేర్ చెప్పారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.