హైదరాబాద్: వాట్సాప్, ట్విటర్, టిక్‌టాక్‌లపై క్రిమినల్ కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

వాట్సాప్, టిక్‌టాక్, ట్విటర్

ఫొటో సోర్స్, WhatsApp/TikTok/Twitter

    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రధాన సోషల్ మీడియా యాప్‌లైన వాట్సాప్, ట్విటర్, టిక్‌టాక్‌లపై దేశంలో తొలిసారిగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసు రిజిస్టర్ చేశారు.

కోర్టు ఉత్తర్వుల ప్రకారం, హైదరాబాద్ సీసీయస్‌లోని సైబర్ క్రైం పోలీసులు ఎఫ్ఐఆర్ నెంబర్ 374/2020 కింద వాట్సాప్, ట్విటర్, టిక్‌టాక్‌లపై కేసు నమోదు చేశారు.

జర్నలిస్టు సిల్వేరి శ్రీశైలం చేసిన ఫిర్యాదుపై కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. సీఏఏకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం వల్లనే తాను ఫిర్యాదు చేసినట్లు శ్రీశైలం చెప్పారు.

మతపరమైన సున్నితమైన అంశాలను కూడా రెచ్చగొడుతున్నారని ఆయన అంటున్నారు. అందుకు ఆధారంగా కొన్ని మెసేజీలు, వీడియోలను ఆయన తన ఫిర్యాదుతో జత చేశారు.

వీటిని పరిశీలించిన మేజిస్ట్రేట్ ఈ ఆదేశాలు ఇచ్చారు.

దీంతో దేశంలో మొదటిసారి ఈ సంస్థలపై క్రిమినల్ కేసు నమోదయ్యింది.

ఐపీసీలోని 153A, 121A, 124, 124A, 294, 295A, 505, 120B, ఐటి చట్టంలోని సెక్షన్ 66A క్రింద పోలీసులు ఈ కేసును రిజిస్టర్ చేశారు.

‘‘వాట్సాప్, ట్విటర్, టిక్‌టాక్‌ల్లో చాలా దారుణమైన, చట్టవ్యతిరేకమైన అంశాలు ఉంటున్నాయి. జాతి వ్యతిరేక, అవమానకరమైన విషయాలను వాట్సాప్ గ్రూపుల ద్వారా పంపిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ఏదీ సరిచూసుకోకుండా, తమకు తోచిన పోస్ట్ చేయడానికి అడ్మిన్‌లు అంగీకరిస్తున్నారు. టిక్ టాక్‌లో దేశ నాయకులను, జాతి సమగ్రతను కించపరుస్తూ వీడియోలు పెడుతున్నారు. కేవలం ఒక్క మతం గురించే కాదు, రెండు మతాలపైనా ఇలాంటివి ఉన్నాయి. ఈ కేసుతో ఏదో జరుగుతుందని కాదు. కనీసం ఒక కొత్త చట్టానికి అయినా ఈ కేసు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా'' అని బీబీసీతో చెప్పారు పిటిషనర్ సెల్వేరి శ్రీశైలం.

‘‘మాకు కోర్టు ఉత్తర్వులు అందాయి. దాని ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. దీనిపై న్యాయాభిప్రాయం తీసుకుంటున్నాం. దాని ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం'' అన్నారు విచారాణాధికారి ఎన్ మోహన రావు.

‘‘ఈ ఎఫ్ఐఆర్ వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఒకవేళ ప్రభుత్వం మధ్యంతర బాధ్యతా నిబంధనలు తెస్తే, పరిస్థితిలో మార్పు రావచ్చు. మేం కంటెంట్ తయారు చేయం కాబట్టి, మాకు బాధ్యత ఉండదని సోషల్ మీడియా సంస్థలు చెబుతున్నాయి. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఆ పరిస్థితి మారవచ్చు’’ అని బీబీసీతో తన అభిప్రాయం చెప్పారు కొడాలి శ్రీనివాస్. ఈయన సైబర్ నేరాలపై పోరాడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)