#BBCISWOTY: దీప కర్మాకర్ అడుగుజాడల్లో త్రిపుర నుంచి దూసుకువస్తున్న మరో జిమ్నాస్ట్..

ఫొటో సోర్స్, Khelo India
- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, గువహాటి నుంచి, బీబీసీ కోసం
రియో ఒలింపిక్స్‌లో జిమ్మాస్టిక్స్‌లో మంచి ప్రదర్శనతో క్రీడా ప్రపంచం చూపు తనవైపు తిప్పుకున్న దీప కర్మాకర్ సొంత రాష్ట్రం త్రిపుర నుంచి మరో యువ అథ్లెట్ దూసుకువస్తోంది.
గువహాటిలో జరుగుతున్న మూడో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో 16 ఏళ్ల జిమ్నాస్ట్ ప్రియాంక దాస్ గుప్తా నాలుగు స్వర్ణాలు గెలిచి, భవిష్యత్తుపై ఆశలు రేపుతోంది.
దీపకు శిక్షణ ఇచ్చిన కోచ్ బిశ్వేశ్వర్ నంది ఆధ్వర్యంలోనే ప్రియాంక కూడా తర్ఫీదు పొందుతోంది.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండర్-17 కేటగిరీలో జిమ్నాస్టిక్స్‌లోని వివిధ విభాగాల్లో ప్రియాంకకు ఈ నాలుగు స్వర్ణాలు వచ్చాయి. త్రిపుర లాంటి చిన్న రాష్ట్రం నుంచి వచ్చిన అమ్మాయి ఇలాంటి ప్రదర్శన చేయడాన్ని గొప్ప విజయంగానే చూడాల్సి ఉంటుంది.
ప్రియాంక తప్ప త్రిపురలోని మిగతా క్రీడాకారులెవరూ ఈసారి ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో బంగారు పతకాలు గెలవలేదు.

తన విజయాల ఘనత అంతా తన తొలి కోచ్ సోమా నంది, ద్రోణాచార్య పురస్కార గ్రహీత బిశ్వేశ్వర్ నందిలకు, ప్రత్యేకంగా తన తల్లికి చెందుతుందని ప్రియాంక అంటోంది. గువహాటిలోని భోగేశ్వరి ఫుక్నానీ ఇండోర్ స్టేడియంలో బీబీసీతో ఆమె మాట్లాడింది.
''చిన్నప్పుడు బాగా అల్లరి చేస్తున్నానని, అమ్మ నన్ను జిమ్నాస్టిక్స్ శిక్షణలో చేర్పించింది. ఇప్పుడు నేనో మంచి జిమ్నాస్ట్ అవ్వాలనుకుంటున్నా. ఇందుకోసం రోజూ ఏడు గంటలు శిక్షణ పొందుతున్నా. అంతర్జాతీయ జిమ్నాస్టిక్ పోటీల్లో పతకాలు సాధించాలన్నది నా లక్ష్యం. ఆ తర్వాత ఒలింపిక్స్‌కు కూడా వెళ్లాలి'' అని ప్రియాంక చెప్పింది.
దీప కర్మాకర్ నుంచి స్ఫూర్తి పొందావా అన్న ప్రశ్నకు.. ''దీప అక్క కష్టపడే తీరు మా అందరికీ స్ఫూర్తినిస్తుంది. నాకు తోబుట్టువులు లేరు. దీపను నేను అక్కలా భావిస్తుంటా. ఆమె నాకు స్ఫూర్తి ప్రదాత. ఖేలో ఇండియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచాక, మొదటగా అభినందనలు చెప్పింది దీప అక్కే. నా కోచ్ బిశ్వేశ్వర్ నంది కూడా అభినందించారు'' అని ప్రియాంక జవాబు చెప్పింది.
తన తల్లిదండ్రులు ఎప్పుడూ తన వెన్నంటే ఉన్నారని.. మగపిల్లలు, ఆడ పిల్లలను వేరు చేసి చూసే వివక్ష తమ కుటుంబంలో లేదని ప్రియాంక చెప్పింది.
''మాది పేద కుటుంబమే. మా నాన్న ట్యాక్సీ నడుపుతారు. చాలా సార్లు పొద్దున్నే ఐదు గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లారంటే, అర్ధ రాత్రికి గానీ ఇంటికి రారు. కొన్ని సార్లు ఆయనతో మాట్లాడే అవకాశం కూడా చిక్కదు. ఆ సమయానికి నేను నిద్రపోతుంటా. మా అమ్మ, నాన్న సహకారం వల్లే నేను నా క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతున్నా. ఇకపైనా కష్టపడాలనుకుంటున్నా. చదువు కూడా కొనసాగిస్తా. క్రీడల వల్ల నా చదువు పాడైందని ఎవరూ మా నాన్నతో అనకూడదు'' అని ఆమె అంది.

ఫొటో సోర్స్, Khelo India
పోటీల్లో ప్రదర్శించే విన్యాసాన్ని ముందుగా వెయ్యి సార్లు ప్రాక్టీస్ చేస్తేనే దానిపై పట్టు వస్తుందని తన కోచ్ చెబుతుంటారని, ఆయన ఎంత సేపు ప్రాక్టీస్ చేయమంటే అంతసేపూ చేస్తానని ప్రియాంక చెప్పింది.
కొత్త విన్యాసాలు నేర్చుకునేటప్పుడు గాయాలు అవ్వొచ్చన్న భయం ఉంటుందని, అయితే వాటిని అలవోకగా నేర్చుకునేలా కోచ్ చేస్తారని ఆమె అంది.
''క్రితం సారి ఖేలో ఇండియా గేమ్స్‌లో మూడు రజతాలు సాధించా. ఈసారి ఎలాగైనా స్వర్ణ పతకాలు గెలవాలని చాలా కష్టపడ్డా'' అని చెప్పింది.
జిమ్మాస్టిక్స్‌తోపాటు తనకు క్రికెట్ ఆట కూడా నచ్చుతుందని ప్రియాంక అంటోంది.
''ఎక్కువగా అంతర్జాతీయ జిమ్నాస్ట్‌ల వీడియోలు చూస్తుంటా. క్రికెట్ కూడా ఇష్టమే. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చాలా ఇష్టం. దీప అక్క ఒలింపిక్స్‌కు అర్హత సాధించినప్పుడు సచిన్ తెందుల్కర్ అభినందించారు. అది చాలా గొప్ప విషయం'' అని వ్యాఖ్యానించింది.
తనకూ అలా విరాట్ కోహ్లీ నుంచి అభినందనలు వస్తే సంతోషమేనని.. కానీ, ఇంకా తాను పెద్ద విజయాలు సాధించలేదని ప్రియాంక చెప్పింది.

ఆర్థికంగా బలహీనంగా ఉన్న చిన్నారులకు ప్రభుత్వం నుంచి మరింత సహాయ సహకారాలు అందాలని ప్రియాంక తొలి కోచ్ సోమా నంది అంటున్నారు.
''ఇక్కడ చాలా మంది పిల్లలు పేద కుటుంబాల నుంచి వచ్చినవారే. వారిలో నైపుణ్యానికి కొదువ లేదు. కానీ, కుటుంబ పరిస్థితుల వల్ల వాళ్లు అలాగే శిక్షణను కొనసాగించలేకపోతున్నారు. పిల్లల కోసం ఓవైపు చదువుకు, మరోవైపు క్రీడా శిక్షణకు డబ్బు ఖర్చు చేయడం పేద కుటుంబాలకు పెద్ద ఇబ్బంది. నేను, నా భర్త కలిసి కొంతమంది చిన్నారులకు సాయం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో త్రిపుర నుంచి ఇలా చాలా మంది జిమ్నాస్ట్‌లు వస్తారు'' అని ఆమె అన్నారు.
దీప కర్మాకర్‌తో ప్రియాంకను పోల్చడం గురించి స్పందిస్తూ.. ''జిమ్నాస్టిక్స్‌పై దీపకు ఉన్న ప్యాషన్ పూర్తిగా వేరు. ఆమె జగమొండి. ఏ విన్యాసమైనా, పూర్తిగా పట్టు సాధించేవరకూ విడిచిపెట్టేది కాదు. ప్రియాంకకు మంచి నైపుణ్యం ఉంది. కానీ, ఆమె మరింత అంకితభావంతో అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే చాలా కష్టపడాలి. వయసులోనూ ప్రియాంక చాలా చిన్నది'' అని సోమా నంది అన్నారు.
''అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన చేయాలంటే, ప్రియాంకకు ఆర్థికంగా మద్దతు అవసరం. జిమ్నాస్ట్‌కు ఒక్క దుస్తులే కాదు.. సరైన ఆహారం, సామగ్రి లాంటివి ఎన్నో అవసరమవుతాయి. కుటుంబ పరిస్థితుల కారణంగా ఆమె ఇక్కడితోనే ఆగిపోకూడదు'' అని సోమా నంది అన్నారు.

ఇవి కూడా చదవండి:
- Indian Sports Woman Of The Year అవార్డును ప్రారంభించిన బీబీసీ న్యూస్ ఇండియా
- సానియా మీర్జా: క్రీడల్లో సత్తా చాటిన మరో అమ్మ
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్-2019 పురస్కారం: భారత మహిళా క్రీడాకారులు సాధించిన విజయాలకు గౌరవం
- కుస్తీలో సాక్షీ మలిక్‌నే ఓడించిన ఒక అమ్మాయి కథ
- సెక్స్ కోరికలు ఎక్కువైన ఈ తాబేలు 800 తాబేళ్లను పుట్టించింది.. తన జాతి అంతరించిపోకుండా కాపాడింది
- ఈ అమ్మాయిలు మాట్లాడటానికే భయపడేవారు.. కానీ ఒలింపిక్స్‌కు ఎలా అర్హత సాధించారంటే..
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- ఒక యువతి ఆత్మాహుతి, ఇరాన్ దిగివచ్చేలా చేసింది
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
- ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్‌ను బాధించే విషయం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








