'ఆర్టికల్ 370 సవరణ': 'ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు'

ఫొటో సోర్స్, BBC/MOHIT KANDHAR
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
జమ్ము, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని సవరించాలని బీజేపీ ఎప్పటి నుంచో అంటోంది. తాజాగా అందుకు సంబంధించిన బిల్లులను హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
అయితే, ఈ బిల్లులు ప్రవేశపెట్టేముందు 'సృష్టించిన పరిస్థితులను' గతంలో ఎన్నడూ చూడలేదని జర్నలిస్టులతో పాటు, ప్రభుత్వం నియమించిన మధ్యవర్తులు (ఇంటర్‌లోక్యూటర్లు) కూడా అంటున్నారు. వారిలో రాధా కుమార్ ఒకరు.
ఆమె బీబీసీతో మాట్లాడుతూ... గత కొన్నేళ్లుగా రాజకీయంగా, సామాజికంగా కశ్మీర్‌లో ప్రశాంతత అన్నదే లేదని అన్నారు.
ఆ పరిస్థితులు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయని, దీనిని పరిష్కరించకపోతే అది త్వరలోనే మరో విధమైన నిరాశా నిస్పృహలకు దారితీస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.
బీజేపీ విషయానికొస్తే, గత కొన్ని ఎన్నికల నుంచీ తాము అధికారంలోకి వస్తే జమ్ము, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని సవరిస్తామని ఆ పార్టీ తన మేనిఫెస్టోలలో పేర్కొంటూ వచ్చింది.

ఫొటో సోర్స్, EPA
జమ్ము, కశ్మీర్‌లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)తో కూడా బీజేపీ చేతులు కలిపింది.
అయితే, ఆ పార్టీల పొత్తు పూర్తికాలం నిలబడలేదు. మొదట్లో బాగానే కలిసి పనిచేశారు. కానీ, తర్వాత పొత్తు వికటించి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు దారితీసింది. అప్పటి నుంచి గవర్నర్ ద్వారా రాష్ట్రాన్ని బీజేపీ నడుపుతోంది.
రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ, ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి.
జనసంఘ్ కాలం నుంచే జమ్ము, కశ్మీర్ రాజకీయాల్లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీనియర్ జర్నలిస్టు రాహుల్ పండితా చెప్పారు. కేడర్‌ను బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు కూడా కశ్మీర్ లోయలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు.
"బీజేపీకి రాష్ట్ర రాజకీయ వ్యవహారాల్లో ప్రత్యక్ష జోక్యం కావాలి. అందుకోసమే, కింది స్థాయిలో కేడర్‌ను బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఆ విషయంలో విజయవంతం అవుతోంది కూడా. క్రమంగా, చాలా వేగంగా ఆ పార్టీ కేడర్ బలోపేతం అవుతోందనడంలో ఏమాత్రం అనుమానం లేదు" అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Reuters
కశ్మీర్‌లో భారీగా సాయుధ బలగాలను మోహరించి, కర్ఫ్యూ విధించారు. నాయకులను గృహాలలో నిర్బంధించడం, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం 'అనవసర చర్య' అని గతంలో ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా వ్యవహరించిన (ఇంటర్లోక్యూటర్) రాధా కుమార్ అభిప్రాయపడ్డారు.
"పార్లమెంటులో బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ ఉంది కాబట్టి, సభలో ఏ తీర్మానమైనా ప్రవేశపెట్టొచ్చు. కానీ, ఇలాంటి చర్యలు ఎందుకు?" అని ఆమె ప్రశ్నించారు.
జమ్ము, కశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టక ముందు అమర్‌నాథ్ యాత్రను మధ్యలోనే ఆపేశారు. పర్యటకులంతా వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించారు. పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలను మూసివేశారు. అన్ని రకాల పరీక్షలను రద్దు చేశారు.
అయితే, ప్రభుత్వ తాజా నిర్ణయంతో ముఖ్యంగా జమ్ము, కశ్మీర్ విభజన వల్ల శాంతికి బదులుగా మరింత అనిశ్చిత పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ లోయ ఉద్రిక్తం: భారత్ క్లస్టర్ బాంబు ప్రయోగించిందన్న పాకిస్తాన్
- ఆర్టికల్ 35-A అంటే ఏంటి? కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ట్రాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- కశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఎందుకు ఉంది? ఆ జెండా ప్రత్యేకత ఏమిటి?
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
- కశ్మీర్ ఉద్రిక్తం: కొత్త సంక్షోభం రావచ్చన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








