పోలీసుల‌కు వీక్లీ ఆఫ్: ఏ విభాగంలో పనిచేస్తున్నవారికి ఎప్పుడు సెలవు వస్తుందంటే

పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పోలీసులకు వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలని నిర్ణ‌యించింది. వెంటనే అమలు చేస్తోంది కూడా. ద‌శాబ్దాలుగా చ‌ర్చ‌ల్లో న‌లుగుతున్న వారానికి ఒకరోజు సెలవు అంశాన్ని ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌డంతో పోలీసు వ‌ర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

రాష్ట్రాలు మారినా అవే చ‌ట్టాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీస్ శాఖ‌లో ద‌శాబ్దాల నాటి చ‌ట్టాలు అమలవుతున్నాయి. బ్రిటిష్ పాల‌న‌లో రూపొందించిన 1859 నాటి మ‌ద్రాస్ పోలీస్ యాక్ట్‌ను ఆ త‌ర్వాత స‌వ‌రించారు. 1861లో ఆ చట్టం అమ‌ల్లోకి వ‌చ్చింది.

ఆ త‌ర్వాత దేశంలో, తెలుగు రాష్ట్రాల‌లో ప‌లు మార్పులు జ‌రిగిన‌ప్ప‌టికీ కీల‌క చ‌ట్టాలు నాటి నుంచి అలానే కొన‌సాగుతున్నాయి. ఉమ్మ‌డి మ‌ద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర‌ రాష్ట్రం, ఆ త‌ర్వాత ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్, అనంత‌రం 2014లో ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్ప‌డినా, చ‌ట్టాల్లో మాత్రం పెద్ద‌గా మార్పులు చేయలేదు.

దాని ఫ‌లితంగానే వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఉన్న సిబ్బంది మాదిరిగా త‌మ‌కు కూడా వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలని పోలీసు అధికారులు, సిబ్బంది కోరిక నెర‌వేర‌ని ప‌రిస్థితి క‌నిపించింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం చేప‌ట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం త‌న ఎన్నిక‌ల హామీలో భాగంగా పోలీసుల‌కు వీక్లీ ఆఫ్‌ను అమ‌ల్లోకి తీసుకొచ్చింది. సుదీర్ఘ‌ కాలంగా చ‌ర్చ‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతూ వ‌స్తున్న ఈ అంశం, ఎట్ట‌కేల‌కు అమ‌లు జ‌రుగుతుండ‌డంతో పోలీసులకు కూడా వారానికి ఒకరోజు సెలవు ద‌క్కింది.

తొలి క్యాబినెట్‌లో నిర్ణ‌యం, క‌మిటీ ఆధ్వ‌ర్యంలో మార్గ‌ద‌ర్శ‌కాలు

వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలోని ఏపీ ప్ర‌భుత్వం తొలి కేబినెట్ స‌మావేశం జూన్ 10న నిర్వ‌హించారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణ‌యాల్లో భాగంగా పోలీసుల‌కు వీక్లీ ఆఫ్ అమ‌లు చేసేందుకు మార్గ‌ద‌ర్శ‌కాలు సిద్ధం చేయాలంటూ అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ రవిశంక‌ర్ అయ్య‌నార్ ఆధ్వ‌ర్యంలో ఒక క‌మిటీ నియ‌మించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీస్ శాఖ‌లో సుమారు 70వేల మంది సిబ్బంది ఉన్నారు. వారిలో కానిస్టేబుల్ నుంచి ఇన్‌స్పెక్ట‌ర్ స్థాయి వ‌ర‌కూ ఉన్న వారికి వీక్లీ ఆఫ్ అమలు చేయాల‌ని క‌మిటీ సూచ‌న‌లు చేసింది.

దానిక‌ి అనుగుణంగా తొలుత విశాఖ‌, క‌డ‌ప‌, ప్ర‌కాశం జిల్లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేశారు. సిబ్బంది కేటాయింపులు, సెల‌వుల మంజూరులో వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిశీలించారు. వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటూ 19 మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేశారు. వాటి ప్రకారం, ఒక విధానం ఎంపిక చేసుకుని ఆయా జిల్లా, క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో వీక్లీ ఆఫ్‌లు అమ‌లు చేయాల్సి ఉంటుంది.

స్థానిక ప‌రిస్థితులు, అందుబాటులో ఉన్న సిబ్బంది సంఖ్య‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఆయా జిల్లాల సూప‌రింటెండెంట్‌, క‌మిష‌న‌ర్ల‌కు అప్ప‌గించారు.

పెరేడ్ చేస్తున్న పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవే..!

  • రోజు విడిచి రోజు ఆన్-ఆఫ్ విధానం

ఇద్దరు ఉద్యోగులను ఒక జట్టుగా బడ్డీ పెయిర్స్‌ ఏర్పాటు చేస్తారు. ఒకరు 24 గంటలు డ్యూటీలో ఉంటే మరొకరు 24 గంటలు చేస్తారు. ఎస్‌హెచ్‌వో రోజు మార్చి రోజు 24 గంటలు ఆఫ్‌ తీసుకోవచ్చు. నెలకు 360 గంటల పాటు డ్యూటీలో ఉన్నా 120 గంటలు అప్రమత్తంగా, 240 గంటలు నామమాత్రంగా ఉండాలి.

  • 4 రోజుల డ్యూటీ త‌ర్వాత ఆఫ్ తీసుకునే విధానం

బ‌డ్డీ పెయిర్స్ ఉంటారు. ఇద్దరు కానిస్టేబుళ్లను జత చేస్తారు. కానిస్టేబుళ్లు స్వాపింగ్‌ పద్దతిలో డ్యూటీ చేసుకోవచ్చు. 4 రోజులు డ్యూటీ త‌ర్వాత సెలవు వ‌స్తుంది. ఒక‌రు సెలవులో ఉంటే రెండో కానిస్టేబుల్ డ్యూటీలో ఉంటారు.

నెలకు 360 గంటల పాటు డ్యూటీలో ఉండాలి. అందులో 120 గంటలు అప్రమత్తంగా, 240 గంటలు నామమాత్రంగా ఉండాలి.

  • 7 రోజుల ఆన్-ఆఫ్ విధానం

ఈ విధానంలో ఒకరు పగలు డ్యూటీ వారం చేస్తే మరొకరు రాత్రి డ్యూటీ చేస్తారు. వారం తర్వాత డ్యూటీలు మార్చుకుంటారు.

7 రోజుల పాటు విధులు నిర్వ‌హిస్తే ఒక సెలవు వ‌స్తుంది.

  • 2 షిఫ్టులు 1:1 ప‌ద్ధతి

ముగ్గురు కానిస్టేబుళ్లు ఒక గ్రూపులో ఉంటారు. పగలు, రాత్రి 2 షిఫ్టులు ఉంటాయి. గ్రూపులో ఒకరు ప‌గ‌లు, మ‌రొకరు రాత్రి షిఫ్టులో ఉంటారు. మూడో వ్యక్తి సెలవులో ఉంటారు. అలా 12 గంట‌ల డ్యూటీ త‌ర్వాత 24 గంట‌ల సెలవు వస్తుంది. నెల‌కు 240 గంట‌ల ప‌ని విధానం అమ‌లు చేస్తారు.

  • 2 షిఫ్టులు 3:1 ప‌ద్ధతి

స్టేషన్లలో సిబ్బందిని ఒక గ్రూపులో 6మంది ఉండేలా విభజిస్తారు. వీరిలో ఉదయం షిప్టులో ముగ్గురు, రాత్రి ఫిఫ్టులో ఒకరు డ్యూటీ చేస్తారు. ఇద్దరు ఉద్యోగులు సెలవులో ఉంటారు. ఆ తర్వాత ప్రతివారం డ్యూటీలు మార్చుకుంటారు.

  • 2 షిఫ్టులు 4:2 ప‌ద్ధతి

తొమ్మిది మంది సిబ్బందికి సంబంధించి బాధ్య‌తలు విభ‌జించారు. నలుగురికి ఉదయం, ఇద్దరికి నైట్‌ షిప్టు డ్యూటీలు, మరో ముగ్గురు సెలవులో ఉంటారు. వీరిని 'ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్,జీ,హెచ్,ఐ గా విభజించి డ్యూటీలు నిర్ణయిస్తారు. మొత్తం తొమ్మిది రోజుల్లో 3 సెలవులు ఉంటాయి.

  • 2 షిఫ్టులు 5:1 ప‌ద్ధతి

9 మంది గ్రూపులో 5 మంది పగటి షిఫ్టులో, ఒకరు రాత్రి షిఫ్టులో పని చేస్తారు. ఒకరికి 9 రోజుల్లో 3 సెలవులు ఉంటాయి. నెల‌కు 240 గంట‌ల విధులు నిర్వ‌హించాలి.

  • 2 షిఫ్టులు 5:3 ప‌ద్ధతి

12 మంది సిబ్బంది గ్రూపుగా ఉంటే, 5 మంది పగటి డ్యూటీలో, ముగ్గురు రాత్రి విధుల్లో, తక్కినవారు సెలవులో ఉంటారు. మొత్తం 12 రోజుల్లో ఒక ఉద్యోగికి 5 పగటి షిఫ్టులు, 3 రాత్రి షిఫ్టులు, 4 సెలవులు ఉంటాయి.

  • 2 షిఫ్టులు 7:1 ప‌ద్ధతి

12 మందిని ఒక గ్రూపుగా విభజించి, పగటి డ్యూటీలో 7మంది, రాత్రి డ్యూటీలో ఇద్దరు ఉండేలా చార్ట్‌ తయారు చేస్తారు. ప్రతి ఉద్యోగికి 7 పగటి డ్యూటీలు, 1 రాత్రి షిఫ్ట్ ఉంటుంది. 12 రోజుల్లో ప్రత ఉద్యోగికి 4 సెలవులు ఉంటాయి.

  • 2 షిఫ్టులు 9:1 ప‌ద్ధతి

15 మంది సిబ్బంది గ్రూపుగా ఉంటే, మార్నింగ్‌ షిప్టులు ఎక్కువగా, రాత్రి డ్యూటీలు తక్కువగా ఉంటాయి. ప్ర‌తి 15 రోజుల్లో 5 సెలవులు ఉంటాయి.

9 పగటి డ్యూటీలు, 1 రాత్రి డ్యూటీ చేయాల్సి ఉంటుంది.

  • రెండు షిఫ్టులు 8:2 ప‌ద్ధతి

ఈ విధానంలో ఒక గ్రూపులో మొత్తం 15 మంది ఉంటారు. వీరిలో 8 మంది పగటి షిఫ్టులో, ఇద్దరు రాత్రి షిఫ్టులో విధులు నిర్వర్తిస్తారు. 15 రోజుల్లో ఒక ఉద్యోగికి 8 డే షిఫ్టులు, 2 రాత్రి షిఫ్టులు, 5 సెలవులు ఉంటాయి.

  • రెండు షిఫ్టులు 7:3 ప‌ద్ధతి

ఈ విధానంలో ఒక గ్రూపులో మొత్తం 15 మంది ఉంటారు. రోజులో పగటి షిఫ్టులో 7 మంది పగటి షిఫ్టులో, ముగ్గురు రాత్రి షిఫ్టులో పని చేస్తారు. ఒక ఉద్యోగికి 15 రోజుల్లో ఏడు పగటి షిఫ్టులు, 3 రాత్రి షిఫ్టులు, 5 సెలవులు ఉంటాయి.

  • రెండు షిఫ్టులు 6:4 ప‌ద్ధతి

మొత్తం 15 మందిలో డే డ్యూటీలో 6 మంది, నైట్‌ డ్యూటీలో నలుగురు ఉంటారు. ప్రతి ఉద్యోగికి 15 రోజుల్లో 6 పగలు, 4 రాత్రి డ్యూటీలు, 5 సెలవులు ఉంటాయి.

  • మూడు షిఫ్టుల ప‌ద్ధతి

మొత్తం సిబ్బందిని 3 టీములుగా విభ‌జిస్తారు. వీరు మూడు షిఫ్టుల్లో పని చేస్తారు. ఏ టీమ్ ఉద‌యం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పని చేస్తే, బీ టీమ్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 వరకు పని చేస్తుంది. ఇక సీ టీమ్ రాత్రి 9 నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు పని చేస్తుంది.

మొదటి షిఫ్టులో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పని చేసిన ఏ టీమ్.. మళ్లీ మరుసటి రోజు రాత్రి 9 గంటల డ్యూటీ చేస్తారు. వీరికి మధ్యలో 32 గంటల విరామం ఉంటుంది. అలా.. బీ టీమ్‌కు 10 గంటలు, సీ టీమ్‌కు 6 గంటల విరామం ఉంటుంది. ఈ విరామ సమయాలు ఒక టీమ్ తర్వాత మరొక టీమ్‌కు మారుతూ ఉంటాయి.

  • వీక్లీ ఆఫ్ విధానం

మొత్తం సిబ్బందిలో ప్రతి 7 మందిలో ఒకరికి చొప్పున ప్రతిరోజూ సెలవు - ఈ విధానం.. జనరల్‌, ట్రాఫిక్‌ డ్యూటీలోని కానిస్టేబుల్స్‌కు వర్తింపచేయవచ్చు.

  • ఆదివారం సెల‌వు విధానం

కోర్టు కానిస్టేబుల్‌కు ఆదివారం సెలవు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించవచ్చు.

స్టేషన్‌ రైటర్‌కు కూడా అంతే.

  • 4 రోజుల అనుమ‌తి విధానం

ఏపీఎస్పీ పోలీసుల్లో ఈ విధానం విజయవంతంగా అమలైంది. 11 లేదా 12 మందిని సెక్ష‌న్‌గా నిర్ణ‌యిస్తారు. వీరిలో

ఇద్ద‌రు చొప్పున‌ ప్రతి 4 రోజులకు సెలవు తీసుకోవచ్చు.

  • గార్డు డ్యూటీల విధానం

5 మందిలో ముగ్గురు మూడు రోజులు విధుల్లో ఉంటే, రెండు రోజులు ఆఫ్‌ తీసుకోవచ్చు.

నెల‌కు 288 గంట‌ల విధులు నిర్వ‌హించాలి. అందులో 144 గంట‌లు యాక్టివ్ గా ఉండాలి.

  • ఎస్కార్ట్ సిబ్బంది విధానం

3 రోజులపాటు ఎస్కార్ట్ డ్యూటీలో ఉంటే, మూడు రోజుల డ్యూటీకి ముందు రోజు, తర్వాతి రోజు సెలవు లభిస్తుంది.

ఈ సెలవుల విధానం కోసం ప్ర‌త్యేకంగా సీపీటీఎన్ఎస్ వేదిక‌గా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నారు. ఈ 19 విధానాల్లో ఏదో ఒక విధానాన్ని, ఉద్యోగుల డ్యూటీల వివ‌రాల‌ను స‌ద‌రు ప‌ర్య‌వేక్ష‌ణాధికారులు ప్ర‌తి నెలా 25వ తేదీన సాఫ్ట్‌వేర్‌లో పొందుప‌ర‌చాల్సి ఉంటుంది.

అలా సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేశాక, రానున్న నెల రోజులకు సంబంధించిన ఉద్యోగుల డ్యూటీ చార్ట్‌లను, వారి సెలవులను ఆ సాఫ్ట్‌వేర్.. జనరేట్ చేస్తుంది. ప్రతి నెల 25వ తారీఖున నోటీస్ బోర్డులో ఈ డ్యూటీ చార్ట్‌ను ఉంచుతారు.

వీక్లీ ఆఫ్ చార్ట్‌లో ఎట్టిపరిస్థితిలోనూ మార్పులు ఉండవు. 'అడిష‌న‌ల్ ఎస్పీ అడ్మినిస్ట్రేషన్' అధికారిని నోడ‌ల్ ఆఫీస‌ర్ గా నియ‌మించారు.

ఏపీ పోలీస్

ఫొటో సోర్స్, Getty Images

'ఫ్రెండ్లీ పోలీసింగ్ కోస‌మే..'

పోలీసుల‌కు వీక్లీ ఆఫ్ అమ‌లు చేయాల‌ని తీసుకున్న నిర్ణ‌యం వెనుక కార‌ణాల‌ను ఆంధ్రప్ర‌దేశ్ హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత బీబీసీకి వివ‌రించారు.

''పోలీసుల‌కు కూడా భార్యాపిల్ల‌లు, కుటుంబం ఉంటుంది. అయినా వారికి సెల‌వులు లేక‌పోవ‌డం వ‌ల్ల వారిలో ఒత్తిడి పెరుగుతోంది. విధి నిర్వ‌హ‌ణ‌లో సామాన్యుల మీద దాని ప్ర‌భావం పడుతోంది. అందుకు తోడుగా అనారోగ్యం, ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా ఎదుర్కొంటున్నారు. ప్ర‌భుత్వ ల‌క్ష్యం నెర‌వేరాలంటూ మానసికంగా మంచి వాతావ‌ర‌ణం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించాము. పాద‌యాత్ర‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ వీక్లీ ఆఫ్ నిర్ణ‌యం తీసుకున్నాం. దాని ద్వారా పోలీసులు స్నేహ‌పూరిత వాతావ‌ర‌ణంలో ప‌నిచేయాల్సి ఉంటుంది. విధి నిర్వ‌హ‌ణ త‌ర్వాత కుటుంబం, వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు అనుగుణంగా స‌మ‌యం కేటాయిస్తున్నందున మ‌రింత శ్ర‌ద్ధాస‌క్తుల‌తో పోలీసు సిబ్బంది ప‌ని చేస్తుంది. త‌ద్వారా ఫ్రెండ్లీ పోలీసింగ్ అస‌లు ల‌క్ష్యం నెర‌వేరుతుంద‌నే ధీమాతో ఉన్నాం'' అని హోం మంత్రి బీబీసీతో అన్నారు.

త్వ‌ర‌లో ఖాళీ పోస్టుల భ‌ర్తీ

శాంతిభ‌ద్ర‌త‌లు, ట్రాఫిక్, సీసీఎస్ వంటి విభాగాలలో ప‌నిచేస్తున్న పోలీస్ సిబ్బందికి ఈ సెల‌వుల నిర్ణ‌యం ఆశావాహ ప‌రిస్థితిని క‌ల్పిస్తోంద‌ని అడిష‌న‌ల్ డీజీపీ ర‌విశంక‌ర్ అయ్య‌నార్ వెల్ల‌డించారు.

‘‘డీజీపీ ఆదేశాల‌తో ఏర్ప‌డిన 21 మంది క‌మిటీ రూపొందించిన 19 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను త‌మ‌కు అనుకూలంగా ఉన్న విధానం అమ‌లు చేసుకునే అవ‌కాశం యూనిట్ ఆఫీస‌ర్ల‌కు ఇచ్చాం. అన్ని యూనిట్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం. దానికి అనుగుణంగా మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న విధానాల రూప‌క‌ల్ప‌నకు ఈ ప్ర‌య‌త్నం దోహ‌ద‌ప‌డుతుంది. వీక్లీ ఆఫ్‌ల కార‌ణంగా సిబ్బంది కొర‌త ఏర్ప‌డుతోంది. దానికి అనుగుణంగా పోలీస్ శాఖలో 12,300 ఖాళీ పోస్టులు భ‌ర్తీ చేయడానికి ఏర్పాట్లు చేస్తాం’’ అని ఆయన అన్నారు.

‘సెల‌వు అమ‌ల‌వుతుంద‌ని అనుకోలేదు’

త‌మ శాఖ‌లో చాలాకాలంగా చెబుతున్న వీక్లీ ఆఫ్ అమ‌లులోకి వ‌స్తుంద‌నే ఆశ చాలాకాలంగా ఉన్న‌ప్ప‌టికీ అది జ‌ర‌గ‌క‌పోవ‌డంతో చాలా నిరాశ చెందామ‌ని విశాఖ‌ప‌ట్ట‌ణానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస‌రావు బీబీసీకి తెలిపారు.

‘‘వారానికి ఒక రోజు సెల‌వు అమ‌ల‌వుతుంద‌ని అనుకోలేదు. కానీ మాకు కూడా అధికారికంగా సెల‌వు వ‌చ్చింది. ఇంత‌కు ముందు పిల్ల‌లని ఎక్క‌డికి తీసుకెళ్లాల‌న్నా, ఇంట్లో ఎవ‌రికి బాగోలేక‌పోయినా ఎంతో స‌త‌మ‌తం అయ్యేవాళ్ల‌ము. ఇప్పుడు వీక్లీ ఆఫ్ అవ‌కాశం ఉండ‌డంతో చాలా స‌మ‌స్య‌లు తీర‌ుతాయ‌ని భావిస్తున్నాం’’ అని అన్నారు.

త‌మ కుటుంబీకుల‌కు వీక్లీ ఆఫ్ అమ‌లు కావ‌డంతో పోలీస్ కుటుంబాల్లో కూడా ఆనందం క‌నిపిస్తోంది. త‌మ త‌ల్లిదండ్రుల‌కు సెల‌వులు ద‌క్కినందుకు పిల్ల‌లు, భ‌ర్త‌లు వారానికి ఒక‌రోజ‌యినా ఇంటి ద‌గ్గ‌ర ఉంటార‌ని పోలీస్ సిబ్బంది భార్య‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

హోమ్ గార్డ్స్ పరిస్థితి?

పోలీస్ శాఖలో హోమ్ గార్డ్స్ కూడా కీలకంగా పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ తాజాగా ప్రభుత్వం ప్రకటించిన వీక్లీ ఆఫ్ విషయంలో వారికి వర్తించే రీతిలో నిర్ణయాలు లేకపోవడంతో వారు నిరాశ చెందారు.

‘‘మేము కూడా కానిస్టేబుల్‌తో సమానంగా పని చేస్తున్నాం. కానీ మా గురించి ప్రస్తావన లేదు. హోమ్ గార్డ్స్ గురించి కూడా ఆలోచించాలి. సెలవులు అందరికీ వర్తింపజేయాలి’’ అని విజయవాడకి చెందిన హోమ్ గార్డ్ పి.అశోక్ కోరుతున్నారు.

సెలవుల అమలు విషయంలో ఇంకా అనేక అంశాల్లో స్పష్టత రావాల్సి ఉందని కొందరు పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)