తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు: 'స్వామీజీ సీఎంతో ఓ మాట చెప్పండి' - ప్రెస్‌రివ్యూ:

ఫొటో సోర్స్, facebook/chinnajeeyar
‘స్వామీజీ సీఎంతో ఓ మాట చెప్పండి’
తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు తమ శాఖను కేసీఆర్ రద్దు చేస్తామంటున్నారంటూ చిన్నజీయర్ స్వామికి మొరపెట్టుకోగా ఆయన వారికి అభయం ఇచ్చారని ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది.
''మా శాఖకు మంత్రి లేరు.. ముఖ్యమంత్రిని కలవలేం... అధికారులను కలుద్దామంటే సమయం ఇవ్వడం లేదు.. మా గోడును ఎవరికి చెప్పుకొనేది.. మీరే మా బాధను అర్థం చేసుకుని.. మా శాఖను కాపాడాలి అని చిన్న జీయర్ స్వామిని రెవెన్యూ ఉద్యోగులు వేడుకున్నారు.
తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు గోల్కొండ సతీశ్ నేతృత్వంలోని ప్రతినిధులు శంషాబాద్‌లోని ఆశ్రమంలో శనివారం చినజీయర్ స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
రెవెన్యూను ఇతర శాఖల్లో విలీనం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా పది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయని, ఈ ప్రచారంతో తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని చెప్పారు.
200 ఏళ్ల చరిత్ర ఉన్న రెవెన్యూ శాఖను రద్దు చేస్తామని, 'కలెక్టర్' పేరునూ మారుస్తామంటున్నారని ప్రస్తావించారు.
ప్రజలకు ఏ కష్టమొచ్చినా స్పందించేది తామేనని, నాలుగున్నరేళ్లుగా రేయింబవళ్లు పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నామని గుర్తు చేశారు. కొత్తగా ఏ పథకం ప్రకటించినా.. ప్రజలకు చేరవేస్తూ ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచుతున్నామని నివేదించారు.
దీనిపై స్వామిజీ స్పందిస్తూ, ''మీకు ఎలాంటి ఇబ్బందులు రావు''అని అభయమిచ్చినట్లు గోల్కొండ సతీష్ తెలిపార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఏపీలో ఈవీఎంలను హ్యాక్ చేశారా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాతా రాజకీయ వేడి కొనసాగుతోంది. ఎలక్షన్ కమిషన్ కేంద్రం గుప్పిట్లో చిక్కుకుని వారు చెప్పినట్లు ఆడుతోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపిస్తుండగా, ఓటేసిన మూడు కోట్ల మందిలో ఒక్కరు కూడా తాము బటన్ నొక్కిన గుర్తు కాకుండా మరో గుర్తు వీవీ ప్యాట్‌లో కనిపించిందని ఫిర్యాదు చేయలేదని, అలాంటప్పుడు ఈవీఎంలపై అనుమానం ఎందుకని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు వాదనలకు సంబంధించి కథనాలను పత్రికలు ప్రచురించాయి.

ఫొటో సోర్స్, facebook/tdp
ఎన్నికల ప్రక్రియపై సామాన్యుడికి నమ్మకం కలిగించండి: చంద్రబాబు
ప్రభుత్వ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రత్యర్థులను ఆడించాలని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, తాజాగా ఎన్నికల సంఘం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారంటూ 'ఈనాడు' పత్రిక ఒక కథనం ప్రచురించింది.
''శనివారం తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనరు సునీల్ అరోడా, కమిషనర్లు అశోక్ లవాసా, సుశీల్ చంద్రలతో ఆయన భేటీ అయ్యారు.
ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించడంతో అర్ధరాత్రి వరకూ పోలింగ్ నిర్వహించాల్సి రావటంపై ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణ విషయంలో సంఘం వ్యవహరించిన తీరును నిరసిస్తూ 15 పేజీల వినతిపత్రం సమర్పించారు.
'వీవీప్యాట్‌లలో ఎందుకిన్ని సమస్యలు వచ్చాయి? ఎవరైనా మోసం చేశారా? లేదంటే హ్యాకింగ్‌కు పాల్పడ్డారా? 50% వీవీప్యాట్‌లు లెక్కించడానికి మీకున్న సమస్య ఏంటి?' అని ప్రశ్నించారు.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచీ అధికారులను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేస్తూ ప్రతిపక్షానికి సహకరించేలా వ్యవహరించిన ఎన్నికల సంఘం పోలింగ్ రోజున అస్తవ్యస్త నిర్వహణతో ప్రజాస్వామ్యాన్ని బలిపశువును చేసిందని ధ్వజమెత్తారు.
ఎన్నికల విధులతో సంబంధం లేని అధికారుల బదిలీలు, ఏకపక్ష నియామకాలన్నీ ఎన్నికల సంఘం స్వతంత్రతను, విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా 50% వీవీప్యాట్‌లను లెక్కించి ఎన్నికల ప్రక్రియపై సామాన్యుడిలో నమ్మకం కల్గించాలని డిమాండు చేశారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook/ysrcp
ట్యాంపరింగ్ దొంగ బాబు సన్నిహితుడే
‘‘ఆంధ్రప్రదేశ్‌లో మూడు కోట్ల మందికి పైగా ఓటేశారు. వారంతా వీవీ ప్యాట్‌లో తమ ఓటు పడిన గుర్తును నిర్ధరణ చేసుకున్నారు. ఆ తర్వాత సంతృప్తితో బయటకు వచ్చారు. తాము బటన్ నొక్కిన గుర్తు కాకుండా మరో గుర్తు వీవీ ప్యాట్‌లో కనిపించి ఉంటే అక్కడే ఫిర్యాదు చేసేవారు. కానీ మూడు కోట్లకు పైగా ఓటర్లలో ఒక్కరి నుంచి కూడా ఒక్క ఫిర్యాదు రాలేదు.
ఎన్నికల కమిషన్ వైఫల్యంతో రాష్ట్ర ప్రజలంతా తెల్లవారుజాము దాకా ఓటేయడానికి నిరీక్షించాల్సి వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. కానీ రాష్ట్రంలోని 46 వేల పోలింగ్ బూత్‌లలో రాత్రి 8 గంటల తర్వాత పోలింగ్ కొనసాగిన బూత్‌ల సంఖ్య 200 పైచిలుకు మాత్రమే’’ అంటూ సాక్షి పత్రిక ఒక కథనం ప్రచురించింది.
‘‘ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడిన వారితో సన్నిహిత సంబంధాలున్నది చంద్రబాబుకే. దశాబ్దం క్రితం ఎన్నికల సంఘం నుంచి ఈవీఎంను దొంగిలించి ట్యాంపరింగ్‌కు పాల్పడిన నేరంంలో వేమూరి హరిప్రసాద్ మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇతను, ఇతని సోదరుడు రవికుమార్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు.
ప్రస్తుతం టీడీపీ సోషల్ మీడియా విభాగం ఇన్‌చార్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. వారి సంస్థకే చంద్రబాబు దాదాపు రూ.2 వేల కోట్ల ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టును కట్టబెట్టారు. ఆ సోదరుల సంస్థకే గన్నవరం వద్ద 100 ఎకరాలను కారుచౌకగా కేటాయించడం గమనార్హం. ఎన్‌ఆర్‌టీ సంస్థ పేరిట రాజధాని అమరావతిలో కూడా 5 ఎకరాల భూమిని కేటాయించారు.
కాగా, ఈవీఎంలపై సందేహాల నివృత్తి కోసం పంపించే బృందం నుంచి హరి ప్రసాద్‌ను తొలగించాలని సీఈసీ ఆదేశిస్తూ ఝలక్ ఇవ్వడం గమనార్హం.
చంద్రబాబు రాష్ట్రంలో తప్పు చేసి దొరికిన ప్రతి సందర్భంలోనూ ఢిల్లీకి వెళ్లి యాగీ చేశారు.
రాష్ట్ర విభజనకు తానే లేఖ ఇచ్చి.. తర్వాత ఆయనే వెళ్లి వద్దంటూ నిరాహార దీక్ష చేశారు.. ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిపోయారు.. వెంటనే ఢిల్లీకి వెళ్లి వ్యవస్థలను మేనేజ్ చేసేపనిలో పడ్డారు. కేంద్రానికి మద్దతు ఉపసంహరించానంటారు.. చీకట్లో వెళ్లి బీజేపీ నాయకులతో మంతనాలు సాగించారు.
ఇప్పుడు కూడా అయిదేళ్లూ అరాచకాలు చేశారు.. చివరి నిమిషంలో ఈవీఎంలమీద, ఈసీ చేసిన ట్రాన్స్‌ఫర్లమీద నేరం నెడుతున్నారు. మరోవైపు తనకు 130 సీట్లు వస్తాయంటున్నారు.
టీచర్లు పోలింగ్ కేంద్రాల్లో ఉంటే తనకు నష్టం అని భావించిన చంద్రబాబు.. ఎన్నికల విధుల్లో ప్రైవేట్, ఇతర ఉద్యోగులను భారీగా నియమించారు. అనుభవం లేని ఉద్యోగులను నియమించడం వల్లే ఈవీఎంలు మొరాయించాయని తెలుస్తోంది. ఈ విషయంపై కూడా విచారణ జరపాలి’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook/trsparty
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చేలోగానే తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి
తెలంగాణలో పరిషత్ పోరుకు రంగం సిద్ధమైందని.. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించిందని.. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం పరిషత్ ఎన్నికలపై అనుమతి తీసుకుందని ‘నమస్తే తెలంగాణ’ పత్రిక కథనం ప్రచురించింది.
‘‘ఈ నెల మూడో తేదీనే రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా నోటిఫికేషన్‌ను ప్రభుత్వానికిచ్చింది. 535 జెడ్పీటీసీ, 5857 ఎంపీటీసీ సభ్యులను 1.56 కోట్ల మంది ఓటర్లు ఎన్నుకోనున్నారు. రాష్ట్రంలో మూడు విడుతల్లో పరిషత్ ఎన్నికలను నిర్వహిస్తామని, 22 రోజుల్లో పూర్తిచేస్తామ ని, ఈ ముసాయిదాను అనుమతించాలని ఎస్‌ఈసీ.. ప్రభుత్వాన్ని కోరింది.
జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 22న తొలివిడుత నోటిఫికేషన్ జారీచేయనున్నామని ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మే 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5వరకు పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
రెండో విడుత నోటిఫికేషన్‌ను ఈ నెల 26న విడుదల చేసి మే 10న రెండో విడుత పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
మూడో విడుత నోటిఫికేషన్‌ను ఈ నెల 30న విడుదల చేసి మే 14న పోలింగ్ నిర్వహించే విధంగా ఏర్పాట్లుచేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం.. ప్రభుత్వానికి ఇచ్చిన ముసాయిదాలో స్పష్టం చేసింది.
మూడు విడతలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మే 18న చేపట్టేందుకు సిద్ధమని ఎస్‌ఈసీపేర్కొన్నప్పటికీ ఈసీ అనుమతించలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వా తే పరిషత్ ఓట్ల లెక్కింపు ఉండాలని సూ చించింది. అంటే మే 23 తరువాత మాత్ర మే చేపట్టాలి. మే 25న లేదా మరుసటి రో జు చేపట్టే అవకాశాలున్నట్టు తెలుస్తున్నద’’ని ఆ కథనంలో వివరాలు అందించారు.
ఇవి కూడా చదవండి:
- ఏపీలో అర్ధరాత్రి దాటాక కూడా పోలింగ్ ఎందుకు జరిగింది...
- లక్ష్మీ పార్వతి ఏ నియోజకవర్గం నుంచి గెలిచారు?- బీబీసీ క్విజ్
- రఫేల్ డీల్: అసలు ఏమిటీ ఒప్పందం... ఎందుకీ వివాదం?
- అభిప్రాయం: రాజీవ్‌కు బోఫోర్స్.. మోదీకి రఫేల్?
- Reality Check: రుణ మాఫీ పథకాలతో రైతుల కష్టాలు తీరుతాయా?
- పెళ్ళి పేరుతో అమ్మాయిలకు వల వేసి... వ్యభిచారంలోకి దింపుతున్నారు
- నిన్న ఒక పార్టీ.. నేడు మరో పార్టీ – ఏపీలో రంగులు మారుతున్న కండువాలు
- సిత్రాలు సూడరో: "జగన్ ఎప్పటికీ సీఎం కాలేరు.. కాబోయే ముఖ్యమంత్రి జగనే"
- ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోండి.. 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








