ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఆ పార్టీలు ఇప్పుడేమయ్యాయ్

ఫొటో సోర్స్, ప్రజారాజ్యంపార్టీ
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రవాహశీలతకు మారుపేరు. నిత్యం కొత్త రాజకీయ శక్తులు, వ్యక్తులు ఇక్కడ అవకాశాలు వెతుక్కునే ప్రయత్నం చేస్తూవచ్చారు. ఆ క్రమంలోనే ఎన్నో రాజకీయ పార్టీలూ ఏర్పాటయ్యాయి. వాటిలో కొన్ని విజయాలు అందుకుంటే మరికొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి.
1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటి నుంచి 1983 వరకు ఇక్కడి రాజకీయాలు దాదాపు ఏకపక్షంగా సాగినప్పటికీ అనంతర కాలంలో ఎన్నో మార్పులను చూశాయి. ముఖ్యంగా 1983 తరువాత తెలుగు నేలన ప్రాంతీయ పార్టీల జోరు మొదలైంది. వాటిలో కొన్ని ఎన్నికల క్షేత్రంలో బలం నిరూపించుకోగా మరికొన్ని ఉనికి కోల్పోయాయి.
నిజానికి ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు కూడా రెండు పార్టీలు బలంగా ఉండేవి. ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఉండేది. కానీ, క్రమంగా ప్రతిపక్షం బలహీనపడి కాంగ్రెస్ ఆధిపత్యం ఏర్పడింది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత మళ్లీ కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం తగ్గింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు..
ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు బలంగా ఉండేవి. ఫిరాయింపులు, చీలికలతో వామపక్షాలు క్రమంగా బలహీనపడ్డాయి.
భారతదేశంలో తొలి ఎన్నికలు జరిగిన 1952 నాటికి ఆంధ్రప్రదేశ్ ఇంకా ఏర్పడలేదు.
సంయుక్త మద్రాస్ రాష్ట్రంలో కొంత భాగం, హైదరాబాద్ రాష్ట్రంలో కొంత తెలుగు ప్రాంతాలు ఉండేవి.
దీంతో తొలి ఎన్నికలు ఈ రెండు ప్రాంతాలకు వేర్వేరుగా జరిగాయి.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన పక్షంగా ఎన్నికలకు వెళ్లగా ఆంధ్రప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఎన్నికల బరిలో నిలిచింది.
హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతంలో మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ అనే పేరుతో ఎన్నికల్లో పోటీ చేసింది.
ఈ పార్టీలతో పాటు టంగుటూరి ప్రకాశం పంతులు నేతృత్వంలోని కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ(కేఎంపీపీ), ఎన్‌జీ రంగా నేతృత్వంలోని కృషికార్ లోక్‌పార్టీ(కేఎల్‌పీ) కూడా ఆ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థానాలు సంపాదించాయి.
ఆ మరుసటి ఏడాది 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాలతో ఏర్పడిన ఈ రాష్ట్రంలో కిసాన్ మజ్దూర్ యూనియన్ నేత టంగుటూరి ప్రకాశం పంతులును కాంగ్రెస్ తమ పార్టీలోకి తీసుకుని ఆయన ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కానీ, కొద్దికాలానికే అవిశ్వాస తీర్మానం కారణంగా టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వం పడిపోయింది. దీంతో కొద్దికాలం రాష్ట్రపతి పాలన సాగింది. 1955లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి.
ఆ ఎన్నికల్లో కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ, కృషికార్ లోక్ పార్టీలతో కలిసి కాంగ్రెస్ 'యునైటెడ్ కాంగ్రెస్' పేరిట పోటీ చేసి అధికారంలోకి వచ్చింది.
అయితే, ఆ తరువాత ఏడాదే(1956లో) ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్ అవతరించింది.
కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ, కృషికార్ లోక్‌పార్టీల కథేంటి?
ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 1951లో ఎన్నికలు జరిగినప్పుడు నీలం సంజీవరెడ్డి వర్గంలో తలెత్తిన విభేదాల కారణంగా టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్జీ రంగాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
వారిద్దరూ కలిసి ప్రజా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పక్షాన్ని స్థాపించారు. జాతీయ స్థాయిలో కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీగా ఇది పనిచేసింది.
అయితే.. ప్రకాశం పంతులు, ఎన్జీరంగా మధ్య కూడా సయోధ్య బెడిసికొట్టడంతో రంగా కృషికార్ లోక్ పార్టీ పేరుతో మరో పార్టీ ఏర్పాటు చేశారు.
ఇక కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ ఆ తరువాత కాలంలో సోషలిస్ట్ పార్టీతో కలిసి ప్రజా సోషలిస్ట్ పార్టీగా ఏర్పడింది.
ఇక కృషికార్ లోక్ పార్టీ స్థాపించిన ఎన్జీ రంగా, ఆయన శిష్యుడు గౌతు లచ్చన్నలు ఆ పార్టీ కార్యకలాపాలకు ముగింపు పలికి స్వతంత్ర పార్టీలో చేరారు.
దీంతో కేఎంపీపీ, కేఎల్‌పీల ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనిక నుంచి కనుమరుగయ్యాయి.
మర్రి చెన్నారెడ్డి డెమొక్రటిక్ పార్టీ.. తెన్నేటి విశ్వనాథం నేషనల్ డెమొక్రటిక్ పార్టీ
50వ దశకం చివరినాళ్లలో మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి డెమొక్రటిక్ పార్టీ ఏర్పాటు చేశారు. కానీ, కొన్నాళ్లలో ఆయన మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు.
ఇక 1962 ఎన్నికల్లో గెలిచిన 51 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 9 మంది కలిసి తెన్నేటి విశ్వనాథం నేతృత్వంలో నేషనల్ డెమొక్రటిక్ పార్టీ అనేది ఏర్పాటు చేశారు. ఆ పార్టీ కూడా క్రమంగా కనుమరుగైపోయింది.

ఫొటో సోర్స్, TDP
తెలుగుదేశం ఆవిర్భావం తరువాత
ఎన్ని పార్టీలు ఏర్పడుతున్నా మళ్లీ నాయకులు కాంగ్రెస్ గూటికే చేరుతుండడంతో ఆంధ్రప్రదేశ్ వరుసగా కాంగ్రెస్ పాలనలోనే ఉండేది.
ఇలాంటి సమయంలో సినీ నటుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు.
తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో 1983లో ఎన్నికలకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ 203 స్థానాలు గెలుచుకుని తొలిసారి ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్టీఆర్ టీడీపీ
1995లో తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబునాయుడు తన చేతుల్లోకి తీసుకున్న తరువాత కొద్దికాలానికి ఎన్టీఆర్ మరణించారు. ఎన్టీఆర్ మరణం తరువాత ఆయన భార్య లక్ష్మీపార్వతి 'ఎన్టీఆర్ టీడీపీ' అనే పార్టీ ఏర్పాటు చేశారు. 1996 ఉప ఎన్నికల్లో ఆమె పాతపట్నం నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
అనంతర కాలంలో ఆమె ప్రభావం చూపలేకపోవడం, చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం బలంగా ఉండడంతో ఎన్టీఆర్ టీడీపీలోని నేతలంతా తెలుగుదేశం సహా వివిధ పార్టీల్లో చేరిపోయారు.
ప్రస్తుతం లక్ష్మీపార్వతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.

ఫొటో సోర్స్, facebook/JrNTR
అన్న టీడీపీ
ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ కూడా 1999లో అన్న తెలుగుదేశం పేరుతో ఒక పార్టీని స్థాపించారు. ఆ ఏడాది ఎన్నికల్లో అన్న టీడీపీ 191 నియోజకవర్గాల్లో పోటీ చేసినా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.12 శాతం ఓట్లు మాత్రమే పొందగలిగింది.
లోక్ సభ నియోజకవర్గాల్లో 20 చోట్ల అభ్యర్థులను నిలిపినా ఆ పార్టీకి 0.73 శాతం ఓట్లే వచ్చాయి.
అనంతరం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో హరికృష్ణ చేరిపోయారు. టీడీపీ నుంచే 2008-13 మధ్య రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
2018 ఆగస్టులో హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రజారాజ్యం
తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా పేరుతెచ్చుకుని భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్న చిరంజీవి 2008 ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు.
నటుడిగా పెద్దసంఖ్యలో అభిమానులున్న వ్యక్తి కావడంతో రాజకీయంగానూ ఆయన ప్రభావం చూపిస్తారన్న అంచనాలతో ప్రధాన పార్టీల నుంచి చాలామంది ప్రజారాజ్యంలో చేరారు.
2009 ఎన్నికల్లో పోటీ చేసిన ప్రజారాజ్యం పార్టీ 18 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది.
తిరుపతి, పాలకొల్లు స్థానాల నుంచి పోటీ చేసి చిరంజీవి తిరుపతిలో గెలిచి, పాలకొల్లులో ఓటమి పాలయ్యారు.
ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం 18 శాతం ఓట్లు సాధించగలిగింది.
అయితే, ఎన్నికల తరువాత రెండేళ్లలోనే చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఆయనకు అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది.
అనంతరం 2014లో రాష్ట్ర విభజన తరువాత చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా ఉండడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
జైసమైక్యాంధ్ర పార్టీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన పార్టీ ఇది. కేంద్రం అడ్డగోలుగా విభజనకు పాల్పడిందన్న కారణంతో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి 2014 ఎన్నికలకు కొద్ది ముందు ఈ పార్టీని స్థాపించారు.
ఆ ఎన్నికల్లో సీమాంధ్రలోని దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్కచోటా విజయం సాధించలేకపోయారు. చాలాచోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు.
అనంతరం చాలాకాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి 2018లో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన పార్టీ కూడా రద్దయిపోయింది.

ఫొటో సోర్స్, AmanchiKrishnamohan
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పలు ఇతర పార్టీలూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. చీరాల నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ కూడా రెండోసారి 2014లో సొంతంగా నవోదయ పార్టీని స్థాపించి పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన తన తెలుగుదేశంలో చేరిపోయారు. ఇటీవల టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సొంతంగా పార్టీలు పెట్టినవారిలో పలువురు ఇతర నేతలూ ఉన్నారు.
అయితే, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నిలదొక్కుకుని అధికారంలోకి రాగా అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆయన కుమారుడు జగన్మోహనరెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తొలి ప్రయత్నంలోనే మంచి ఫలితాలు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.
2019 ఎన్నికల్లోనూ సొంతంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తూ ప్రధాన పార్టీల్లో ఒకటిగా బరిలో ఉంది.
అలాగే నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తొలిసారి ఎన్నికల క్షేత్రంలో అడుగుపెడుతోంది.
ఇవి కూడా చదవండి:
- జనసేన పార్టీ అభ్యర్థులు వీరే
- పవన్ కల్యాణ్: జనసేన మేనిఫెస్టో ఇదే
- నిన్న ఒక పార్టీ.. నేడు మరో పార్టీ – ఏపీలో రంగులు మారుతున్న కండువాలు
- సిత్రాలు సూడరో: "జగన్ ఎప్పటికీ సీఎం కాలేరు.. కాబోయే ముఖ్యమంత్రి జగనే"
- ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోండి.. 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి
- పెళ్లికొడుకు మెడలో తాళి కట్టిన పెళ్లికూతురు.. ఎందుకిలా చేశారు? ఇది ఏమి ఆచారం?
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో...: ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








