మొబైల్ డేటా: ప్రపంచంలో అత్యంత చౌక భారతదేశంలోనే... ఎందుకు? మున్ముందు ధరలు పెరిగిపోతాయా?

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో రోజు రోజుకూ తగ్గిపోతున్న డేటా ధరలు సరికొత్త స్థాయికి పడిపోయాయి. నిజానికి.. బీబీసీ ఇటీవలి కథనం ప్రకారం, ప్రపంచంలో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ధరలు అత్యంత చౌకగా ఉన్నది భారతదేశంలోనే. ఇదెలా జరిగిందనేది టెక్నాలజీ రచయిత ప్రశాంతో కె. రాయ్ వివరిస్తున్నారు.
బ్రిటన్ కేంద్రంగా ఉన్న ఓ ధరల పరిశీలన వెబ్‌సైట్‌ను ఉటంకిస్తూ బీబీసీ తన నివేదికలో.. ఒక గిగాబైట్ (1 జీబీ) మొబైల్ డాటా అమెరికాలో 12.37 డాలర్లు, బ్రిటన్‌లో 6.66 డాలర్లుగా ఉండగా.. ప్రపంచ సగటు ధర 8.53 డాలర్లుగా ఉందని. కానీ ఇండియాలో ఆ ధర కేవలం 0.26 డాలర్లు మాత్రమే ఉందని పేర్కొంది.
అయితే, చాలా మంది భారతీయులు తాము ఒక జీబీ డేటాకు 0.10 డాలర్ల కన్నా తక్కువే చెల్లిస్తున్నామని చెబుతున్నారు. అమెరికా, బ్రిటన్‌ల వినియోగదారులు కూడా ఆ సర్వేలో చెప్పిన దానికన్నా తక్కువ ధరే వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు.
అసలు ధర ఎంతైనా కానీ.. ఇతర ప్రాంతాలకన్నా ఇండియాలో మొబైల్ డాటా చాలా రెట్లు తక్కువ అన్నది స్పష్టం. కానీ ఈ పరిస్థితి ఎంతో కాలం అలాగే ఉండకపోవచ్చు. ఇండియాలో తక్కువ ధరలు ఉండటం ఒక సంధి దశ అని.. కొత్త కస్టమర్ల కోసం పెద్ద ఆపరేటర్ల మధ్య పోరు ఫలితమని చాలా మంది చెప్తున్నారు.
లండన్‌లోని ఒక పెట్టుబడి సంస్థలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న సౌరవ్‌సేన్.. తన మొబైల్ సర్వీస్ కోసం నెలకు 13 డాలర్లు చెల్లిస్తున్నానని.. ఇది మూడు, నాలుగు కప్పుల కాఫీ ధరతో సమానమని చెప్పారు. ఆ మొత్తంతో బ్రిటన్‌లో అపరిమిత్ వాయిస్ కాల్స్, మెసేజెస్‌తో పాటు.. వాయిస్ ఈయూ రోమింగ్, 3జీబీ వరకూ డాటా లభిస్తోందని వివరించారు.
ఆయనకు అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే, ప్రతిచోటా ఉచిత వైఫై అందుబాటులో ఉంది. బ్రిటన్‌లో కొన్ని చౌకైన ప్లాన్లు ఉన్నాయి. అయితే సర్వత్రా విస్తరించివున్న ఉచిత వైఫై వల్ల ఈ ధరలను ఆసియాతో పోల్చిచూడటం కష్టమవుతుంది.
తాను ఇండియాకు వెళ్లినపుడు తనకు ఒక్కో మెగాబైట్ (ఎంబీ)కి 6.62 డాలర్ల ధరకు డాటా అందిస్తున్నారని.. అంటే ఒక జీబీ డాటాకు 6,779 డాలర్లు ఖర్చవుతుందని సేన్ చెప్పారు. అది స్థానికులు డాటా కోసం చెల్లించే మొత్తం కన్నా 70,000 రెట్లు అధికం.
ఇక ఇండియా రాజధాని దిల్లీ శివార్లలో గల గుర్గావ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న రామ్‌నాథ్ మండల్.. అపరిమిత ఉచిత ఫోన్ కాల్స్ కోసం నెలకు మూడు డాలర్ల కన్నా తక్కువే చెల్లిస్తున్నారు. దానితో పాటు రోజుకు 1.5 జీబీ చొప్పున మొత్తం 42 జీబీ 4జీ డాటా కూడా అతడికి లభిస్తోంది. వీడియోలను వీక్షించటానికి, బిహార్‌లోని తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వాట్సాప్ కాల్స్ చేయటానికి ఆ డాటాను ఆయన ఉపయోగిస్తారు.
అంటే, అంటే ఒక్కో జీబీకి 6 సెంట్ల కన్నా తక్కువ. సేన్ లండన్‌లో తన 4జీ డాటా కోసం చెల్లించే మొత్తం కన్నా 70 రెట్లు చౌక.
మండల్‌కు సర్వీసులు అందిస్తున్నది రిలయన్స్ జియో. భారత మార్కెట్‌ను చౌక, హై-స్పీడ్ మొబైల్ డాటాతో పాటు ఉచిత కాల్స్‌తో వణికించిన యువ టెలికాం సంస్థ అది.
2016 సెప్టెంబర్‌లో.. దూకుడుగా ఉచిత ట్రయల్ ఆఫర్‌తో జియోను ప్రారంభించారు. దీంతో కేవలం ఆరు నెలల్లోనే 10 కోట్ల మంది కస్టమర్లను కూడగట్టుకుంది. అది కేవలం 4జీ హై-స్పీడ్ డాటా. వాయిస్ కాల్స్, డాటా రెండిటికీ సరిపడే స్పెక్ట్రమ్‌ను అది ఉపయోగిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
కేవలం రెండేళ్లలోనే.. 2018 నాటికి 28 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో.. ఇండియాలో మూడో అతి పెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది జియో.
ఈ సంస్థ తన 4జీ ఫీచర్ ఫోన్ జియో ఫోన్‌ను (ఇది స్మార్ట్‌ఫోన్ కాదు) కేవలం 21 డాలర్ల రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ (వాపసు తీసుకోగల పూచీకత్తు)తో అందిస్తోంది. ఇక నెలకు అతి తక్కువగా ఒక డాలర్‌కు కూడా ప్లాన్లు అందిస్తోంది.
ఆ జియోఫోన్‌లో ఇండియాలో అత్యంత ప్రజాదరణ గల అప్లికేషన్లు.. వాట్సాప్, ఫేస్‌బుక్‌లు పనిచేస్తాయి. వైఫైని కూడా సపోర్ట్ చేస్తుంది.
భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ లెక్కల ప్రకారం.. 2018 డిసెంబర్ నాటికి ఇండియాలో 50 కోట్లకు పైగా మొబైల్ బ్రాండ్‌బ్యాండ్ సబ్‌స్క్రిప్షన్లు ఉండగా.. వైర్డ్ బ్రాండ్‌బ్యాండ్ సబ్‌స్క్రిప్షన్లు మాత్రం కేవలం 1.8 కోట్లు మాత్రమే ఉన్నాయి.
దేశంలోని 117 కోట్ల మొబైల్ సబ్‌స్క్రిప్షన్లలో 55 శాతం పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. బ్రాండ్‌బ్యాండ్ వినియోగంలో ఆకస్మిక పెరుగుదల మొత్తం మొబైళ్లలోనే ఉంటే.. అది ప్రధానంగా జియో వల్లే వచ్చింది.
దీంతో దేశంలోని పాత టెలికాం సంస్థలు జియోతో పోటీ పడాల్సి వచ్చింది. 4జీ డాటా ధరలను విపరీతంగా తగ్గించటంతో పాటు ఉచిత ఆఫర్లు ఇవ్వటం ఆ పోటీలో భాగం.
దిల్లీలోనే డ్రైవర్‌గా పనిచేస్తున్న కాళీపాద సస్మాల్.. తాను జియోకు మారాలని అనుకున్నారు. కానీ తనకు అప్పటికే ఉన్న మొబైల్ ఆపరేటర్ అయిన ఎయిర్‌టెల్.. నెలకు ఆరు డాలర్ల కన్నా తక్కువ ధరకు 40 జీబీ డాటా అందిస్తానని ఆఫర్ ఇచ్చింది.
అందులోనూ మిగిలిపోయిన డేటాను తర్వాతి నెలకు బదిలీ చేయటమూ ఆ ఆఫర్‌లో భాగం. అంతేకాదు, ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో సర్వీస్ ఉచితంగా అందిస్తామంది. దీంతో ఎయిర్‌టెల్ తోనే కొనసాగాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఇండియాలో డేటా ధరలు అడ్డంగా పడిపోయేలా చేసింది జియో అన్నది స్పష్టం. మరి మార్కెట్‌లో ఇవే ధరలు నిలకడగా ఉంటాయా?
కస్టమర్లను తనవైపు తెచ్చుకోవటానికి, పోటీ సంస్థల నుంచి కస్టమర్లను లాక్కోవటానికి.. జియో తన సర్వీసులకు సబ్సిడీ ఇస్తోందని పరిశ్రమ విశ్లేషకులు అంటున్నారు. జియోను ప్రారంభించినపుడు దేశంలో 10 టెలికాం ఆపరేటర్లు ఉంటే.. ఇప్పుడు కేవలం నాలుగు సంస్థలే ఉన్నాయి.
'డేటా ధరలు పెరుగుతాయి'
డేటా ధరలు ఇంత తక్కువగా ఉండటానికి కారణం కేవలం భారీ పోటీ ఫలితమేనని.. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధినేత రాజన్ మాథ్యూస్ పేర్కొన్నారు. దీని ఫలితంగా వినియోగదారులు తాము చెల్లించదలచుకున్న ధరల కన్నా తక్కువ ధరలు చెల్లించే ''కన్స్యూమర్ సర్‌ప్లస్'' భారీగా ఉంటుందని ఆయన విశ్లేషించారు.
''ఆపరేటర్లు నెట్‌వర్క్ కవరేజీ, నాణ్యత, కొత్త సాంకేతిక పరిజ్ఞానాల కోసం పెట్టుబడులు పెట్టటం కొనసాగించాల్సి వస్తే.. ఈ ధరలు నిలబడవు'' అని చెప్పారు.
''ఈ రంగంలో పెట్టుబడులపై రాబడి అతి తక్కువగా సింగిల్ డిజట్లలోనే ఉంది. పరిస్థితిని సరిచేయటానికి ఆపరేటర్లు తమ ధరలను సమీక్షించాల్సిన అవసరం ఉంటుంది'' అని మాథ్యూస్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే.. జియో నెట్‌వర్క్ వృద్ధి చెందటానికి చాలా వెసులుబాటు ఉందని, తన సామర్థ్యంలో ఇప్పటివరకూ కేవలం ఐదో వంతు మాత్రమే ఉపయోగించిందని.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చెప్పారు.
''మేం అదనపు పెట్టుబడి లేకుండా మా కస్టమర్ల పునాదిని రెట్టింపు చేసుకోగలం'' అని ఆయన గత జూలైలో కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో పేర్కొన్నారు. అప్పటికి జియోకు 21.5 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు.
కానీ డేటా రేట్లు పెరుగుతాయని, ''భారతీయ టెలికాంలో భారీ పోటీ పరిస్థితి'' సుస్థిరంగా ఉండజాలదని డిజిటల్ హక్కుల ఉద్యమకారుడు నిఖిల్ పావా అభిప్రాయపడ్డారు. ఆయనకు చెందిన మీడియానామా (MediaNama) అనే పోర్టల్ దేశంలో డిజిటల్ ఆర్థికవ్యవస్థను విశ్లేషిస్తుంటుంది.
టెలికాం ఆపరేటర్ల లాభాలు ఇప్పుడు అత్యంత తక్కువగా ఉన్నాయి. జియో నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్న టెలికాం కంపెనీల్లో లాభాలు దాదాపు సున్నాకు పడిపోతున్నాయన్న వార్తలు మామూలుగా మారిపోయాయి.
''జియో ప్రారంభించటానికి ముందు ధరలను చాలా అధికంగా కొనసాగించిన ఒక మాఫియా వంటిది ఉండింది'' అని పావా వ్యాఖ్యానించారు. ''ధరలను తగ్గించటమనేది అవి కలిసిపోవటానికి దారితీసింది. ఇప్పుడు కేవలం నాలుగు సంస్థలకు తగ్గిపోయింది. ఇక రేట్లు పెరగటానికి పెద్ద సమయం పట్టదు. ఇది 30 శాతం లాభాలకు అలవాటుపడ్డ పరిశ్రమ. మళ్లీ ఆ లాభాలు పొందే స్థితికి వెళ్లాలని కోరుకుంటుంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, జియో ధరలకు సబ్సిడీలు లేవని అది వాణిజ్యపరంగా లాభదాయకమేనని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఆ సంస్థ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.
''జియో సరికొత్త సాంకేతికతతో మార్కెట్‌ను కొల్లగొట్టింది. ఉపయోగించకుండా పడివున్న అపరిమిత ఫ్రీక్వెన్సీని జియో నమ్ముకుంది. వాయిస్‌ను, డేటాను కలిపింది. ఆ స్పెక్ట్రమ్ బ్యాండ్‌లో కాల్స్‌ను ఉపయోగించటం గురించి అప్పటివరకూ ఎవరూ ఆలోచించలేదు'' అని సదరు వర్గాలు వివరించాయి.
జియో దీర్ఘ కాలం పాటు కొనసాగించిన ఉచిత ట్రయల్ ఆఫర్.. దాదాపు 10 కోట్ల మందిని ఆకర్షించినప్పటికీ, జియో కస్టమర్లు ఇప్పుడు ఇతర ఆపరేటర్ల కస్టమర్ల కన్నా ఎక్కువగానే ఖర్చు పెడుతున్నారు. ఒక్కో వినియోగుదారుడు సగటున ఖర్చు చేస్తున్న 2 డాలర్ల కన్నా 30 శాతం ఎక్కువ ఆదాయం తమకు వస్తోందని జియో అంటోంది.
అలా.. విడియోలు వీక్షిస్తూ, షేర్ చేస్తున్న డ్రైవర్లు, వంటవాళ్లు, వలసలు, విద్యార్థులు, ఎంతో మంది కార్మికులు, ఉద్యోగులు.. భారత సగటు మొబైల్ డాటా వినియోగాన్ని రెండేళ్లలో 10 రెట్లకు పైగా పరుగులుపెట్టించారు. ఒక్కో యూజర్ నెలకు 10 జీబీ కన్నా అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది అమెరికాలో సగటు తలసరి వినియోగంతో దాదాపు సమానం.
గూగుల్, రైల్‌టెల్ కార్పొరేషన్‌ల రైల్‌వైర్ ప్రాజెక్టు.. 400కు పైగా రైల్వే స్టేషన్లలో ఉచిత, హైస్పీడ్ బ్రాండ్‌బ్యాండ్ వైఫైను అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. భారత డాటా వినియోగదారులకు బయట ఉచితంగా లభించే వైఫై పెద్దగా అందుబాటులో లేదు.
ఉచిత వాయిస్ కాల్స్‌తో పాటు.. ప్రస్తుతానికే అయినే ప్రపంచంలో అత్యంత చౌక మొబైల్ డాటా అందించే ప్రీ-పెయిడ్ జియో కనెక్షనే వీరికి ప్రధాన వనరు. ఇది ఎక్కువగా వారి ఫోన్లలో రెండో సిమ్ కార్డుగా ఉంటుంది.
ప్రశాంతో కె. రాయ్ (@prasanto) దిల్లీకి చెందిన టెక్నాలజీ విశ్లేషకుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








