సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావుకు, సీబీఐ లీగల్ అడ్వైజరుకు రూ.లక్ష జరిమానా

ఫొటో సోర్స్, PTI
సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావుకు, సీబీఐ లీగల్ అడ్వైజరుకు సుప్రీంకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు ఆయనకు ఈ జరిమానా విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
ముజఫర్‌పూర్ బాలికల వసతి గృహంలో అత్యాచారాలు, వేధింపుల కేసును విచారణ చేస్తున్న సీబీఐ జాయింట్ డైరెక్టర్ అరుణ్ కుమార్ శర్మను తమ అనుమతి లేకుండా బదిలీచేయడం, ఆ కేసు విచారణ నుంచి తప్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. లక్ష రూపాయల జరిమానా విధిస్తూ, కోర్టు ముగిసే వరకూ తమ అధీనంలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
"ఈరోజు కోర్టు ముగిసేవరకూ వెళ్లి ఓ పక్కన కూర్చోండి, వారం రోజుల్లో జరిమానా సొమ్మును చెల్లించండి" అని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.
అంతకుముందు, కోర్టు ఆదేశాలతో నాగేశ్వరరావు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ముందు హాజరయ్యారు. సీబీఐ తరపున అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై పూర్తి నివేదికను కోర్టుకు అందించడంతోపాటు వారి తరపున క్షమాపణలు చెప్పారు.
ప్రమోషన్ ద్వారా ఉన్నత స్థానానికి పంపించే ఉద్దేశంతోనే అరుణ్ కుమార్ శర్మను బదిలీ చేశారని, ఓ సీనియర్ అధికారిగా ఆ స్థానంలో ఉంటూ కూడా ఆయన ఈ కేసు విచారణను పర్యవేక్షించవచ్చని ఏజీ కోర్టుకు తెలిపారు. అయితే ఈ విషయంలో బేషరతుగా క్షమాపణలు చెబుతున్నామని, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య కాదని కోర్టుకు స్పష్టం చేశారు.
కోర్టు ధిక్కరణ కింద ఆయనపై చర్య తీసుకోవచ్చా అని కోర్టు వేణుగోపాల్‌ను ప్రశ్నించింది. అయితే, వారు ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడలేని, వారిని క్షమించాలని ధర్మాసనాన్ని వేణుగోపాల్ కోరారు. కోర్టు ఏదైనా చర్య తీసుకుంటే.. 32 సంవత్సరాల వారి ఉద్యోగ జీవితంలో ఇదో మచ్చలా మిగిలిపోతుందని, వారి క్షమాపణలను అంగీకరించాలని ఆయన కోర్టుకు తెలిపారు.
కోర్టులకు ఉన్న ఔన్నత్యాన్ని, విలువను, గౌరవాన్ని కాపాడాలని, ధిక్కరించకూడదని సీజేఐ సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
గత సంవత్సరం అక్టోబర్ 23న అప్పటి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను తప్పించిన కేంద్ర ప్రభుత్వం, నాగేశ్వరరావుకు తాత్కాలిక డైరెక్టరుగా బాధ్యతలు అప్పగించింది.
ఆ తర్వాత జనవరి 8, 9 తేదీల్లో సుప్రీంకోర్టు ఆదేశాలతో అలోక్ వర్మ తిరిగి సీబీఐ డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టారు. కానీ, ప్రబుత్వం మళ్లీ ఆయనను బదిలీ చేసి, నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించింది. ఈ సమయంలో నాగేశ్వరరావు చేసిన బదిలీలపై కోర్టు ధిక్కారం కింద సుప్రీం కోర్టు చర్యలకు ఉపక్రమించింది.
ఇవి కూడా చదవండి.
- సీబీఐ వర్సెస్ సీబీఐ: డైరెక్టర్ అలోక్ వర్మ తొలగింపునకు.. రఫేల్ విచారణకు సంబంధముందా?
- సీబీఐ వర్సెస్ సీబీఐ: ఈ కేసులో ఎప్పుడు ఏం జరిగింది?
- సీబీఐ వర్సెస్ మమతా బెనర్జీ: ఎవరీ రాజీవ్ కుమార్....
- 'పంజరంలో చిలక' సీబీఐలో ఏం జరుగుతోంది?
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. ‘అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’
- అరుణాచల్ ప్రదేశ్: భారత్-చైనా మధ్య గొడవ ఎందుకు, దీని చరిత్రేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








