బడ్జెట్ 2019: అయిదు లక్షల వరకు వ్యక్తిగత ఆదాయానికి పన్ను లేదు... కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయెల్

కేంద్ర తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయెల్ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
ఐదు లక్షల లోపు ఆదాయానికి పన్ను లేదు
జాతి నిర్మాణం కోసం తోడ్పాటు అందిస్తున్న పన్ను చెల్లింపుదారులకు కృతజ్ఞతలు. వారి కృషితోనే పేద, అణగారిన వర్గాల ప్రజల జీవితాలు మెరుగవుతున్నాయి.
పన్ను సంస్కరణల లబ్ధిని కొంతైనా మధ్యతరగతి ప్రజలకు అందించాలి.
అలాంటి వారిపై పన్ను భారాన్ని తగ్గిస్తున్నాను.
మధ్యతరగతి, జీతం పొందే, పెన్షన్ పొందే వారికి లాభం చేకూర్చేలా ఆదాయపు పన్ను స్లాబుల్ని సవరిస్తున్నాను.
ఐదు లక్షల లోపు వ్యక్తిగత ఆదాయానికి పన్ను లేదు. వాళ్లు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన పనిలేదు.
6.5 లక్షల రూపాయల గ్రాస్ ఆదాయం పొందే వారికి కూడా ఎలాంటి పన్నూ ఉండదు. అయితే వాళ్లు ఆ మేరకు గర్తింపు పొందిన వాటిపై పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.
రూ.50 వేల లోపు నెలవారీ ఆదాయం పొందే ఉద్యోగుల జీతాల నుంచి పన్ను కోతలు ఇకపై ఉండవు.
బ్యాంకు, పోస్టాఫీసు డిపాజిట్ల ద్వారా లభించే వడ్డీపై పన్ను పరిమితి ఇకపై 40 వేలకు పెంపు. గతంలో ఇది 10 వేలు ఉండేది.
ఇంటి అద్దె ద్వారా లభించే ఆదాయంపై పన్ను ఉపశమనం రూ.1.8 లక్షల నుంచి రూ.2.4 లక్షలకు పెంపు.
క్యాపిటల్ ట్యాక్స్ గెయిన్స్ లబ్ధి ఇకపై రెండు ఇళ్లపై పెట్టే పెట్టుబడికి వర్తింపు. ఇది పన్ను చెల్లింపుదారుడికి జీవిత కాలంలో ఒకసారి రూ.2 కోట్ల వరకు క్యాపిటల్ గెయిన్స్‌పై లభిస్తుంది.
గృహ రుణం, విద్యా రుణం మొదలైన వాటిపైన లభిస్తున్న పన్ను రాయితీలు కూడా కొనసాగుతాయి.
3 కోట్ల మంది మధ్యతరగతి ప్రజలకు దీనివల్ల మేలు జరుగుతుంది.
ఇది కేవలం మధ్యంతర బడ్జెట్ కాదు. ఇది దేశ అభివృద్ధి యాత్ర
ఇది కేవలం మధ్యంతర బడ్జెట్ కాదు. ఇది దేశ అభివృద్ధి యాత్ర. దేశం మారుతోంది. దేశ ప్రజల ఉత్సాహంతోనే మారుతోంది. మా హయాంలో అభివృద్ధి ప్రజా ఉద్యమంగా మారింది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచే 2022 నాటికి కొత్త భారతదేశం దిశగా మేం చర్యలు తీసుకుంటున్నాం.
ప్రతి ఒక్కరూ తమ స్వప్నాలను సాకారం చేసుకునేలా అవకాశాలు కల్పిస్తున్నాం.
గత ఐదేళ్లలో భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న దేశం మనది. ఇప్పుడు మనది ప్రపంచంలోనే 6వ శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ.
ఆర్థిక సంస్కరణలు అమలైన తర్వాత ఏ ప్రభుత్వం సాధించనంత వృద్ధి సాధించాం.
అవినీతి లేని ప్రభుత్వాన్ని మేం నడిపించాం. పాలనలో పారదర్శకత తీసుకొచ్చాం.
అగ్రవర్ణ పేదల కోసం పది శాతం రిజర్వేషన్లు కల్పించాం.
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాన్ని మూడు రెట్లు పెంచాం.
దేశంలో 2014 నుంచి 2018వ సంవత్సరం వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా 1.53 లక్షల ఇళ్లు నిర్మించాం.
దేశంలో దాదాపు 50 కోట్ల మంది ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టాం. ప్రపంచంలోనే అత్యంత భారీ ఆరోగ్య పథకం ఇది. దీనివల్ల పేద ప్రజలకు రూ.3 వేల కోట్ల సొమ్ము ఆదా అవుతుంది.
ప్రారంభించిన కొద్ది సమయంలోనే 10 లక్షల మంది ప్రజలకు దీనివల్ల మేలు జరిగింది.
దేశంలో 21 ఎయిమ్స్ (ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఉండగా.. 22వ ఎయిమ్స్‌ను హరియాణాలో ఏర్పాటు చేయనున్నాం. వీటిలో 14 ఎయిమ్స్‌లను మా హయాంలోనే మొదలు పెట్టాం.
దేశంలో 8 కోట్ల గ్రామీణ కుటుంబాలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు ఉజ్వల పథకాన్ని ప్రారంభించాం. ఇప్పటికే 6 కోట్ల కనెక్షన్లు ఇచ్చాం.
భారతదేశం స్టార్టప్‌లకు ప్రపంచంలోనే అతిపెద్ద హబ్‌గా మారింది.
ఇప్పుడు దేశంలో 59 నిమిషాల్లోపే రూ.కోటి రుణం పొందవచ్చు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారత ప్రజలకు వేగం, సేవలు, భద్రత ఇవ్వటంతో పాటు మేక్ ఇన్ ఇండియాకు కూడా గొప్ప మేలు చేస్తుంది.
దేశంలో రాకపోకలు జరుగుతున్న విమానాశ్రయాలు 100కు పైగా ఉన్నాయి.
దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య గత ఐదేళ్లలో రెట్టింపు అయ్యింది.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా జాతీయ రహదారులను నిర్మిస్తున్నది భారతదేశమే.
భారతదేశం రాబోయే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ కానుంది. రాబోయే ఎనిమిదేళ్లలో 10 ట్రిలియన్ డాలర్ ఎకానమీ కావాలన్నదే మన ధ్యేయం.

డేటా, వాయిస్ కాల్స్ ఛార్జీలు ప్రపంచంలోనే అత్యంత చౌక
గత ఐదేళ్లలో డేటా వినియోగం 50 రెట్లు పెరిగింది.
దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి స్థాపక సామర్థ్యం గత ఐదేళ్లలో 10 రెట్లు పెరిగింది. డేటాకు, వాయిస్ కాల్స్‌కు ఛార్జీలు బహుశా ప్రపంచంలోనే అత్యంత చౌకగా లభిస్తోంది భారత్‌లోనే.
దేశంలో మొబైల్, మొబైల్ విడిభాగాల తయారీ కంపెనీలు 2 నుంచి 268కి పెరిగాయి.
గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా మార్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.
ప్రజలకు ప్రభుత్వ లబ్ధిని నేరుగా అందించేందుకు ఆధార్‌ను వినియోగిస్తున్నాం. ఇప్పుడు ఆధార్ విశ్వవ్యాప్తం అవుతోంది.
కేంద్రం 'రైతు బంధు' పథకం.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
- చిన్న, సన్నకారు రైతులకు కచ్చితమైన ఆదాయం ఉండేందుకు.. ప్రత్యక్షంగా పెట్టుబడిని అందించేందుకు హెక్టారుకు రూ.6 వేలు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తున్నాం.
- ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఈ పథకం అమలవుతుంది. ఈ నిధులను నేరుగా రైతు ఖాతాలోకే పంపిస్తాం.
- మూడు దఫాలుగా ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పంపిస్తాం. 2 హెక్టార్లకన్నా తక్కువ భూమి ఉన్న రైతులకు ఈ పథకం వర్తిస్తుంది.
- దేశంలోని 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం లబ్ధి చేకూరుస్తుంది. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా రూ.75 వేల కోట్ల భారం పడుతుంది.
- దీనివల్ల రైతులు గౌరవంగా జీవించేందుకు అవకాశం లభిస్తుంది.
రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకానికి ఈ ఏడాది రూ.750 కోట్లు కేటాయింపు.
పశు సంవర్థక, మత్స్యకార రైతులకు 2 శాతం వడ్డీ రాయితీ.
రైతులంతా తీవ్రమైన ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయారు. కాబట్టి వారు తీసుకున్న రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ. సకాలంలో సొమ్ము తిరిగి చెల్లిస్తే అదనంగా 3 శాతం వడ్డీ రాయితీ.
గ్రాట్యుటీ రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంపు
ఉద్యోగులకు పదవీ విరమణ, ఉద్యోగం నుంచి తప్పుకునే సమయానికి లభించే గ్రాట్యుటీ రూ.10 లక్షల నుంచి రూ.30 క్షలకు పెంపు.
కార్మికులకు మెగా పెన్షన్
దేశ జీడీపీలో 50 శాతం అసంఘటితరంగం నుంచే వస్తోంది. ఇందులో 42 కోట్ల మంది కార్మికులు పనిచేస్తున్నారు.
వీళ్ల కోసం ప్రాన మంత్రి శ్రమ యోగి మంథన్ పేరిట మెగా పెన్షన్ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం.
దీనికి కార్మికులు ప్రతి నెలా రూ.100 చెల్లించాలి.
దీని ద్వారా కార్మికులకు వారి వయస్సు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా రూ.3 వేలు కచ్చితంగా లభిస్తాయి.
దీనివల్ల అసంఘటిత రంగంలోని 10 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది. ప్రపంచంలో అత్యంత భారీ పెన్షన్ పథకం ఇది అవ్వొచ్చు.
గత ఐదేళ్లలో అన్ని వర్గాల కార్మికులకు కనీస వేతనాలను 42 శాతం పెంచాం. ఇది రికార్డు.
సైనికులకు
దేశ సైనికులే మన గుర్తింపు.. మన గౌరవం. గత 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వన్ ర్యాంక్, వన్ పెన్షన్ పథకాన్ని మేం అమలు చేశాం.
దీనిద్వారా ఇప్పటికే రూ.35 వేల కోట్లు పంపిణీ చేశాం. ఆర్మీలో పనిచేసే వాళ్ల వేతనాలను గణనీయంగా పెంచాం.
రక్షణ బడ్జెట్‌ను రూ.3 లక్షల కోట్లకంటే ఎక్కువ చేశాం.
సినిమా షూటింగ్‌లకు సింగిల్ విండో
సినిమాలు నిర్మించే భారతీయుల కోసం సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. దీని ద్వారా సినిమాల నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులనూ అందిస్తాం. ఇప్పటి వరకూ విదేశీయులకు మాత్రమే ఈ అవకాశం ఉంది. ఇకపై భారతీయులకూ దీన్ని వర్తింపచేస్తాం.
పైరసీపై పోరాడేందుకు గాను సినిమాటోగ్రఫీ యాక్ట్‌లో యాంటీ కామ్ కార్డింగ్ నిబంధనను ప్రవేశపెడతాం.
పన్నులు
2013-14సంవత్సరంలో రూ.6.38 లక్షల కోట్లుగా ఉన్న ప్రత్యక్ష పన్నులు ప్రస్తుతం రూ.12 లక్షల కోట్లకు పెరిగాయి.
99.54 శాతం పన్ను రిటర్నులను ఎలాంటి స్క్రూటినీ లేకుండా ఆమోదించాం.
కేవలం రెండేళ్లలో దాదాపు అన్ని పన్ను రిటర్నులనూ ఎలక్ట్రానిక్ పద్ధతిలో తనిఖీ చేస్తాం. ఈ వ్యవస్థలో పన్ను అధికారుల జోక్యం ఉండదు.
ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించేందుకు, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నాం.
తొలిసారిగా కోటికి మందికి పైగా ప్రజలు పెద్దనోట్ల రద్దు తర్వాత ఐటీ రిటర్నులు దాఖలు చేశారు.
గత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 18 శాతం పెరిగాయి.

జీఎస్టీతో రూ.80 వేల కోట్ల ఉపశమనం
స్వతంత్ర భారతదేశంలో అమలు చేసిన అతి పెద్ద పన్ను సంస్కరణ జీఎస్టీ. దీనివల్ల భారతదేశం కామన్ మార్కెట్ అయ్యింది. అంతర్ రాష్ట్ర సరకు రవాణా సులభం అయ్యింది. దేశంలో వ్యాపారం చేయటం సులభం అయ్యింది.
జీఎస్టీ వల్ల వినియోగదారులకు రూ.80 వేల కోట్ల ఉపశమనం లభించింది. పేదలు, మధ్యతరగతి ప్రజలు వినియోగించే నిత్యావసర సరుకులన్నీ సున్నా నుంచి 5 శాతం పన్ను పరిధిలో ఉన్నాయి.
జీఎస్టీ ద్వారా ఇళ్లు కొనుగోలు చేసే వారికి కూడా మేలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రుల బృందం కసరత్తు చేస్తోంది.
2019 జనవరి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను దాటాయి.
కోటికి లోపు రుణం తీసుకున్న, జీఎస్టీ కింద రిజిస్టర్ అయిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 2 శాతం వడ్డీ రాయితీ.
నల్లధనంపై పోరాటం
నల్లధనానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలతో రూ.1.30 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాం. 3.38 షెల్ కంపెనీల గుట్టు రట్టు చేశాం.
భారతదేశ విజన్ 2030
భారత ప్రభుత్వం విజన్ 2030లో పది ముఖ్యాంశాలు
1. పది ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి అవసరమైన తర్వాతి తరం భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాల నిర్మాణం. సులభతర వాణిజ్య సాధన.
2. ప్రతి పౌరుడినీ చేరుకునేలా డిజిటల్ ఇండియా నిర్మాణం. ఈ దిశగా మనల్ని నడిపించేది మన యువతే. వాళ్లు స్టార్టప్‌లను ఏర్పాటు చేయటంతో పాటు ఉద్యోగాలనూ సృష్టిస్తారు.
3. క్లీన్ అండ్ గ్రీన్ ఇండియా. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, పునరుత్పాదక ఇంథనమే ప్రధాన ఇంథనంగా వినియోగం. ఇంథన దిగుమతులను తగ్గించుకుని, ప్రజల భద్రతను పెంచడమే లక్ష్యం.
4. గ్రామీణ పారిశ్రామికీకరణను పెంచటం. ఇందుకు ఆధునిక పారిశ్రామిక టెక్నాలజీలను పెంచడం, మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడం, క్షేత్రస్థాయిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్‌లను ప్రోత్సహించటం.
5. పరిశుభ్రమైన నదులు. ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు.
6. సముద్రాలు, తీర ప్రాంతాలు.
7. భారతీయ వ్యోమగామిని 2022 నాటికి అంతరిక్షంలోకి పంపించటం.
8. ఆహారంలో స్వయం సమృద్ధి. ఆర్గానిక్ ఫుడ్‌పై దృష్టి సారిస్తూ వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించటం.
9. ఆరోగ్య భారత్. ఒత్తిడిలేని, సమగ్రమైన సంక్షేమ వ్యవస్థ.
10. కనిష్ఠ ప్రభుత్వం.. గరిష్ఠ పాలన. జవాబుదారీ, స్నేహశీల ప్రభుత్వోద్యోగులు, ఎలక్ట్రానిక్ పాలన.
ఇవి కూడా చదవండి:
- బడ్జెట్ 2019: కేంద్రం ‘రైతు బంధు’... ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
- భారత దేశ మొదటి బడ్జెట్ ఎంతో తెలుసా?
- ఈ 6 విషయాలు తెలిస్తేనే ఈ రోజు బడ్జెట్ అర్థమవుతుంది
- ధరల క్యాలికులేటర్: ఇప్పుడు కేజీ 100 - మరి పదేళ్ల కిందట?
- ప్రధాని మోదీకి వచ్చిన గిఫ్టులు మీకు కావాలా?
- Fact Check: కనీస ఆదాయ పథకం ప్రపంచంలో మరెక్కడా లేదా?
- "మా ఊళ్లో పక్కా ఇళ్లు కట్టుకోవద్దని దేవుడు చెప్పాడు.. మట్టి ఇళ్లలోనే ఉంటాం’’
- గర్భనిరోధక పిల్ రోజూ వేసుకోవచ్చా.. ఇది అందరికీ ఎందుకు పని చేయదు
- కోడి గుడ్లతో క్యాన్సర్ చికిత్స
- "అమ్మాయిలు ఐస్‌క్రీమ్‌లను నాకుతూ తినొద్దు"
- ప్రజల ఖాతాల్లోకి డబ్బు: ఈ పథకం ఎలా ఉంటుందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








