రిపబ్లిక్ డే పరేడ్‌లో పురుష దళాన్ని లీడ్ చేసిన హైదరాబాద్ మహిళా ఆఫీసర్... చరిత్రలో తొలిసారి

- రచయిత, మీనా కొత్వాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
లెఫ్టినెంట్ భావనా కస్తూరి భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రిపబ్లిక్ పెరేడ్‌లో 144 మంది ఇండియన్ ఆర్మీ పురుషుల దళాన్ని లీడ్ చేస్తున్న తొలి మహిళా అధికారి అయ్యారు.
26 ఏళ్ల భావనది హైదరాబాద్. ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీ చేశారు. భావన చదువులో చురుగ్గా ఉండేవారు, దానితోపాటు నృత్యం, పాటలు పాడడం కూడా వచ్చు.
ఆమె క్లాసికల్ డ్యాన్స్‌లో డిప్లొమా కూడా అందుకున్నారు.
కానీ 23 ఏళ్ల వరకూ సాధారణ జీవితం గడిపిన ఈ అమ్మాయికి అప్పుడు తను చరిత్ర లిఖించబోతున్నాననే విషయం తెలీదు.
స్వతంత్రం వచ్చిన 71 ఏళ్ల తర్వాత జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ పెరేడ్‌లో భావన 144 మంది పురుషుల సైనిక దళానికి నేతృత్వం వహిస్తున్న తొలి మహిళగా నిలిచారు.
భారత సైన్యంలో సర్వీస్ కార్ప్స్ లెఫ్టినెంట్ భావనా కస్తూరీ బీబీసీతో తనకు ఈ అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
"23 ఏళ్ల తర్వాత ఆర్మీ కార్ప్స్ స్క్వాడ్‌కు పెరేడ్ చేసే అవకాశం లభించింది. అది కూడా నేను దాన్ని లీడ్ చేస్తున్నాను. అందుకే ఇది నాకు చాలా గర్వకారణంగా అనిపిస్తోంది"
కుటుంబ సభ్యుల సహకారంతో భావనకు ఇక్కటివరకూ చేరుకోవడం కష్టం అనిపించలేదు. అయితే కొందరు తను ఒక అమ్మాయి అనే విషయాన్ని అప్పుడప్పుడూ గుర్తు చేసేవారని చెప్పారు.

అమ్మాయినని ఎప్పుడూ గుర్తు చేసేవారు
బీబీసీతో మాట్లాడిన భావన "చాలా మంది బంధువులు ఇంటికొచ్చేవారు. అమ్మాయిని ఇంట్లోనే ఉంచి, పెళ్లి చేసేయండి అనేవారు. కానీ మా అమ్మానాన్న ఎవరి మాటా పట్టించుకోలేదు. నాకు ఆకాశంలో ఎగిరే ఒక పక్షిలా స్వేచ్ఛ ఇచ్చారు" అన్నారు.
"ఈరోజు నేను ఇక్కడివరకూ చేరుకున్నందుకు నాకంటే నా కుటుంబమే సంతోషంగా ఉంది. చాలా రోజులు ఇంట్లో వాళ్లతో మాట్లాడ్డం కుదర్లేదు. కానీ నేను చేస్తున్న పని చూసి వాళ్లకు గర్వంగా ఉంది".
భావన చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు. కానీ ఎప్పుడూ ఆమెకు ఇలా లీడ్ చేసే అవకాశం లభించలేదు. ఆమె కాలేజీ సమయంలో ఎన్‌సీసీలో చేరాలనుకున్నారు.
నేను ఎన్‌సీసీలో జాయిన్ అయిన తర్వాత సైన్యంలో కూడా మహిళలకు చాలా స్కోప్ ఉందని, మహిళలు ప్రతి చోటా తమ ముద్ర చూపిస్తున్నప్పుడు.. ఆర్మీలో కూడా రాణించగలరని తెలిసింది..

పారిపోదాం అనుకున్నాను
"చెన్నై ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ చాలా కఠినంగా ఉంటుంది. అందులో శారీరక శ్రమతోపాటు మానసిక వ్యాయామం కూడా ఉంటుంది".
ట్రైనింగ్ రోజు జరిగిన ఘటనలు గుర్తు చేసుకున్న భావన.."ఆర్మీలో డ్యూటీ, క్రమశిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. అందుకే ఒకసారి నాకు అక్కడ్నుంచి పారిపోదాం అని కూడా అనిపించింది" అన్నారు.
ట్రైనింగ్‌లో అత్యంత కఠినంగా ఏది అనిపించింది అన్నప్పుడు "18 కిలోల బరువున్న ఒక బ్యాగ్‌తో, చేతిలో ఒక రైఫిల్ తీసుకుని 40 కిలోమీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఇక వదిలేద్దాం అనుకున్నా. కానీ మనసులో ఎప్పుడూ ఓటమి ఒప్పుకోకూడదు, ముందుకు వెళ్తూనే ఉండాలి అని గట్టిగా అనుకున్నా" అన్నారు భావన
"అకాడమీ నుంచి బయటికి వచ్చినపుడు చాలా బాగా అనిపించింది. ట్రైనింగ్ అకాడమీలోకి ఒక సామాన్యులుగా వెళ్తాం. 11 నెలలు కష్టపడి శిక్షణ తీసుకున్న తర్వాత ఒక ఆఫీసర్‌గా బయటికొస్తాం. ఆ సమయంలో ఆ అలసట, బాధ అన్నీ మర్చిపోతాం"

ఫొటో సోర్స్, Bhavana Kasturi
పీరియడ్స్ లీవ్ అవసరం అనుకోను
ప్రపంచమంతా రకరకాల కార్యాలయాల్లో పీరియడ్స్ సమయంలో మహిళా ఉద్యోగులకు లీవ్ ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. కానీ భావన అది అవసరం అని అనుకోవడం లేదు.
పీరియడ్ లీవ్ గురించి మాట్లాడిన భావన "అది ఒక జీవిత సత్యం. ఆర్మీలో ఉన్న వారికి అది చాలా మామూలు సమస్య. సైన్యంలో ఉన్న మహిళలందరూ ఒకరికొకరు చాలా సపోర్టుగా ఉంటారు" అన్నారు.
"జీవితం ఒక పోరాటం. ప్రతి ఒక్కరూ యుద్ధం చేస్తారు. కానీ ఈ సమస్యలు, మన డ్యూటీ నుంచి మనం తప్పించుకోలేం. మనం మన కలను నిజం చేసుకోవాలని అని గట్టిగా అనుకుంటే ఇలాంటి సమస్యలన్నీ అడ్డుగా అనిపించవు".

ఫొటో సోర్స్, Bhavana Kasturi
మూడేళ్లలో జీవితం మారిపోయింది
పాత రోజులు గుర్తుచేసుకున్న భావన "23 ఏళ్ల వరకు నేను ఒక మామూలు అమ్మాయిలా ఉండేదాన్ని. ఆడుతూ-పాడుతూ కుటుంబంతో సమయం గడపడం ఇష్టపడేదాన్ని. కానీ మూడేళ్లలో హఠాత్తుగా చాలా పెద్ద మార్పు వచ్చింది. కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది" అన్నారు.
"గత ఆర్నెల్లలో దినచర్య చాలా కఠినంగా ఉంది. కానీ అంతకు ముందు మాత్రం ఎప్పుడు కాస్త ఖాళీ దొరికినా డాన్స్, పాటలు ప్రాక్టీస్ చేసేదాన్ని, అది నా పాషన్"

ఫొటో సోర్స్, Bhavana Kasturi
యూనిఫాం ఒక గుర్తింపు ఇచ్చింది
ఇప్పుడు తన అనుభవాలను షేర్ చేసుకుంటున్న భావన "ఇప్పుడు నా ఆలోచన వెనుక నేను మాత్రమే కాదు నా వెనక నడిచే నా జవాన్లు, వారి కుటుంబం, మొత్తం దేశం, అన్ని బాధ్యతలూ ఉంటాయి" అన్నారు.
ఇవన్నీ చెబుతూ భావన కాస్త ఉద్వేగానికి గురి అయ్యారు. "ఈరోజు నాకు ఈ యూనిఫాం ఒక గుర్తింపు ఇచ్చింది. ఆర్మీలోకి రావడం వల్ల ఎలా ఉందో, ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను".
ఆర్మీలో మహిళలు-పురుషుల మధ్య తేడా ఉంటుంది అని చాలా మంది పొరపడతారు. కానీ అక్కడ ఆఫీసర్ మాత్రమే ఉంటారు. నేను కూడా అక్కడ అందరూ ఎంత కష్టపడ్డారో అంత శ్రమించాను. నేనిప్పుడు కార్గిల్‌లో ఉన్నాను. అక్కడ డ్యూటీ చేయడం అంటే అంత సులభం కాదు.
నా వెనక 144 జవాన్లు నడుస్తారు. వాళ్లంతా నా బలం. వాళ్లు ఎప్పుడూ నా మనోధైర్యాన్ని పెంచారు. వాళ్ల జోష్ చూసి నాక్కూడా జోష్ వస్తుంది. అడుగులు వాటంతట అవే వారితోపాటూ ముందుకు పడతాయి.
ఇవి కూడా చదవండి:
- ఆరోజు సీబీఐ డైరీ, ఈరోజు డైరెక్టర్ తొలగింపు.. అన్నీ రహస్యాలేనా
- Fact Check: రాహుల్ గాంధీని 14 ఏళ్ల అమ్మాయి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టిందా?
- బ్రిటన్ రాణి కంటే సోనియా సంపన్నురాలా...
- సంక్రాంతి ముగ్గుల చరిత్ర: మొదటి ముగ్గు ఎవరు వేశారు? రంగవల్లి ఎలా పుట్టింది?
- రియాలిటీ చెక్: నికితా వీరయ్య నిర్మలా సీతారామన్ కూతురేనా...
- చంద్రుని మీద మొలకెత్తిన చైనా పత్తి విత్తనం
- అమ్మాయిల కన్యత్వానికి, సీసా సీల్‌కు ఏమిటి సంబంధం
- బీబీసీ రియాలిటీ చెక్: అది భార్యాబిడ్డల అమ్మకం కాదు.. ‘ కులాచారం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








