CAT 2018: 17 ఏళ్లకే ర్యాంకు కొట్టిన తెలుగమ్మాయి
- రచయిత, సంగీతం ప్రభాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో ఆమే పండు... నేనే" అంటూ తన అభిమాన నటుడు మహేష్ బాబు సినిమా డైలాగ్ చెప్పి నవ్వుతూ ఆహ్వానించింది సంహిత.
చిన్నప్పటి నుంచీ చదువుల్లో రికార్డులు సృష్టించిన కాశీభట్ట సంహిత, కేవలం 17 ఏళ్ళ వయసులోనే CAT(కామన్ అడ్మిషన్ టెస్ట్) 2018లో 95.95 స్కోర్ సాధించిన దేశంలోనే అతి పిన్న వయస్కురాలు.
అంతేకాదు, 16 ఏళ్ళకే ఇంజినీరింగ్ పూర్తి చేసిన మొదటి భారతీయురాలిగా కూడా గుర్తింపు సాధించింది. మూడేళ్ల వయసులోనే ప్రపంచంలోని దేశాలు, వాటి రాజధానులు, దేశాల జెండాలను గుర్తించిన బాల మేధావి ఈమె.
చదువుతో పాటూ సంగీతం, చిత్రలేఖనం ఇతర రంగాలలోనూ ప్రావీణ్యం సాధించింది ఈ హైదరాబాదీ అమ్మాయి.
తాను ఇంత చిన్న వయసులోనే ఇన్ని విజయాలు ఎలా సాధించిందో బీబీసీ ప్రతినిధి సంగీతం ప్రభాకర్‌తో సవివరంగా చెప్పింది సంహిత.

బాల మేధావి ప్రయాణం
మూడేళ్ళ వయసులో సంహిత వాళ్ళ నాన్న తెచ్చిన పుస్తకంతో 200 దేశాల పేర్లు, వాటి రాజధానులు, దేశాల జెండాలను గుర్తుంచుకొని అడిగినప్పుడు తడబడకుండా చెప్తుండేది. అది చూసి తల్లితండ్రులు, బంధువులు ఆశ్చర్యపోయారు.
"నా కుటుంబ సభ్యులు ప్రోత్సహించడంతో నేను ఎన్నో స్టేజి షోలు ఇచ్చాను" అని చెప్పింది సంహిత.

అబ్దుల్ కలాంని కలవడం
ఐదేళ్ళ వయసు ఉన్నప్పుడు సంహిత ఓ వేదిక మీద ప్రదర్శన ఇచ్చింది. అందుకు ప్రశంసిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆమెకు ఓ పుస్తకం ఇచ్చారు.
ఆ పుస్తకాన్ని చదివిన సంహిత.. సౌర కుటుంబం గురించి 15 పేజీల వ్యాసాన్ని రాసి అప్పటి రాష్ట్రపతి డాక్టర్. ఏపీజే అబ్దుల్ కలాంకి పంపింది.
అది చూసిన కలాం తనను కలిసేందుకు సంహితకు అవకాశం ఇచ్చారు. "కలాంని కలిసినప్పుడు 'యు అర్ ఎ వెరీ గుడ్ గాళ్' అంటూ ప్రశంసించారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను" అని గుర్తు చేసుకుంది సంహిత.
అదే ప్రేరణతో తీవ్రవాదం, దేశ ఆర్ధిక వ్యవస్థపై అనేక వ్యాసాలు, చిత్రాలు వేసి ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు పొందింది.
తాను చదివే పుస్తకాలూ, వార్త పత్రికల నుంచే ప్రేరణ లభిస్తుందని సంహిత చెబుతోంది.

పిన్న వయసులో పెద్ద చదువు
10 సంవత్సరాలకే ప్రభుత్వ అనుమతితో 10వ తరగతి చదివి 8.8 జీపీఏ పొందింది.
12 ఏళ్లకే ఇంటర్మీడియేట్ ఎంపీసీలో 89 % మార్కులు సంధించిన అతి పిన్న వయస్కురాలు.
12వ ఏట ప్రభుత్వ అనుమతితో హైదరాబాద్‌లోని సీబీఐటీ కళాశాలలో ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో సీటు సాధించింది.
చివరి సంవత్సరంలో బంగారు పతకం సాధించింది. అంతేకాదు, దేశoలోనే అతిపిన్న వయసులోనే ఇంజినీరింగ్ పూర్తి చేసిన రికార్డు సొంతం చేసుకుంది.
"నేను 12వ ఏట మొదటిసారి ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్ళినప్పుడు రోజు రెండు జడలు వేసుకునేదాన్ని. నన్ను ఆశ్చర్యంగా చూసిన అక్కడి వారు, మీ అన్నయ్యతోనో, అక్కతోనో వచ్చావా? అని అడిగేవారు. కాదు, నేను కూడా విద్యార్థినే అని చెప్పగానే ఆశ్చర్యపోయేవాళ్లు" అంటూ నవ్వుతూ తన అనుభవాలను గుర్తు చేసుకుంది సంహిత.

క్యాట్ పరీక్షకు సన్నద్ధం ఎలా?
"నేను ఇంజినీరింగ్ చదివేటప్పుడు అక్కడ ఈవెంట్స్, ప్రాజెక్ట్స్ జరిగితే టీం లీడర్‌గా ఉండేదాన్ని. దాంతో నాకు నిర్వహణ నైపుణ్యాలు వచ్చాయి. నాకున్న సాంకేతిక నైపుణ్యానికి, నిర్వహణ నైపుణ్యాలు తోడైతే నేను దేశానికి ఏదో విధంగా ఉపయోగపడగలను అనిపించింది. అందుకే, ఎంబీఏ చేసేందుకు క్యాట్‌ని ఎంచుకున్నాను" అని వివరించారు సంహిత.
"100 రోజులు క్యాట్ పరీక్షకు సిద్ధపడ్డాను. క్యాట్‌లో మూడు భాగాలుంటాయి. ఉదయం ఒక విభాగానికి, మధ్యాహ్నం మరో భాగానికి, సాయంత్రం మూడవ భాగానికి సమయం కేటాయించాను. దీనికి పునాది మాత్రం నేను చిన్నప్పటి నుంచీ చదివిన పుస్తకాలూ, వార్తా పత్రికలలోని వ్యాసాలే. వాటి వల్ల నాకు చదివిన దాన్ని అర్థం చేసుకునే శక్తి పెరిగింది" అని చెప్పారు సంహిత.
చదువుతో పాటూ ఆటలు, సంగీతం వినడం, కామిక్ పుస్తకాలు చదవడం వంటివి కూడా చేస్తుండేది.

సినిమాలు ఫస్ట్ షో చూస్తా
"నన్ను మొట్టమొదటిసారి ఎవరైనా కలిస్తే పుస్తకాల పురుగు, అసలు మాట్లాడుతుందా? అని అనుకుంటారు. కొందరైతే నువ్వు ఎప్పుడూ చదువుతూనే ఉంటావా? అని అడుగుతారు. అలాంటి వాళ్ళు నాతో 10 నిమిషాలు గడిపితే చాలు.. స్నేహితులై పోతారు" అంటోంది సంహిత.
సంహిత సినిమాలు బాగా చూస్తుంది. మహేశ్ బాబుకు ఫ్యాన్. "మహేశ్ సినిమా విడుదల రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే".
"నేను కూడా, నా వయసులో ఉండే అందరిలాంటి దాన్నే. నేనేమీ ప్రత్యేకం కాదు" అంటోంది సంహిత.
తాను ఇంత సాధించడం వెనుక తల్లితండ్రుల పాత్ర ఎంతో ఉందంటూ వారివైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది సంహిత.
"మా కూతురు ఇంత చిన్న వయసులో ఇన్ని విజయాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. మన దేశంలో క్రీడాకారులకు ఇచ్చిన ప్రాధాన్యత చదువులో నైపుణ్యాన్ని చూపే వారికి కూడా లభిస్తే ఇలాంటి సంహితలు ఎంతో మంది వస్తారు" అన్నారు సంహిత తల్లితండ్రులు ఎల్ ఎన్ కాశీభట్ట, గీత.

భవిష్యత్తు ప్రణాళిక
ఐఐఎంలో ఎంబీఏ ఫైనాన్స్ చేయడం తన మొదటి లక్ష్యమని, అమెరికాలోని సీఎఫ్‌ఏ ఇన్స్టిట్యూట్ నుంచి చార్టెడ్ ఫైనాన్సియల్ అనలిస్ట్ అవ్వడం తదుపరి లక్ష్యమని వివరించింది సంహిత. దేశ ఆర్ధికాభివృద్ధికి తనవంతు కృషి చేయడం తన కల అంటోంది.
ఆడ వాళ్లను మగ వాళ్లతో పాటూ సమానంగా చూస్తే మన దేశం "అభివృద్ధి చెందుతున్న దేశం" నుంచి "అభివృద్ధి చెందిన దేశం"గా మారుతుందని సంహిత అభిప్రాయపడ్డారు.

ప్రయత్నం ఆపొద్దు: సంహిత
"నేను క్యాట్‌లో విజయం సాధించిన తర్వాత నా ఇద్దరు స్నేహితులు క్యాట్ పరీక్ష రాసేందుకు సిద్దపడుతున్నారు. అది నాకు చాల సంతోషం కలిగించింది. ఇంకా చాలా మంది కాట్ రాసేందుకు ముందుకు రావాలి. నిరుత్సాహపడకుండా వివేకానంధుడు చెప్పినట్లు విజయం సాధించే వరకూ మన ప్రయత్నం ఆగకూడదు" అని అంటోంది సంహిత.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









