ఈ మహిళలు ఊరికి రోడ్డు వేసుకున్నారు... తమ రాత మార్చుకున్నారు

రోడ్డు

సరైన రోడ్డులేక గర్భ స్రావాలు జరిగాయి. పిల్లల చదువులు ఆగిపోయాయి. రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా అధికారులు స్పందించలేదు. దాంతో ఆ మహిళలు తమ తలరాతను తామే మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని రుజువు చేసి చూపించారు.

బెంగాల్‌లోని కొన్ని గ్రామాల మహిళలు చేయీ చేయీ కలిపి తమ గ్రామాలను అనుసంధానం చేసే రోడ్లను వాళ్లే వేసుకున్నారు. వారికి సాయం చేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. దాంతో 15 రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఆ రోడ్డు 17 గ్రామాల ప్రజల జీవితాలను మారుస్తోంది.

వీడియో క్యాప్షన్, వీడియో: రోడ్డు పడింది... జీవితం మారింది

‘ఒకప్పుడు ఈ దారంతా బురద, గుంతలతో ఉండేది. రోడ్డు దాటాలంటే నేను నా చీర‌ని కాస్త పైకి పట్టుకోవాలి. నా బండి కూడా ఇక్కడ ఇరుక్కుపోయేది. కొన్నిసార్లు నేను రోడ్డుకి దూరంగా ఈ బండిని నిలిపినప్పుడు జనాలు దొంగతనంగా పానీ పూరీ తీసుకెళ్లిపోయేవారు. ఒక్కోసారి జారి పడిపోయేదాన్ని. చివరికి మేమంతా కలిసి సొంతంగా ఇక్కడ రోడ్డు నిర్మించుకున్నాం’ అంటారు మీనా గయెన్ అనే మహిళ. బెంగాల్లోని త్రిడిప్ నగర్ గ్రామంలో పానీ పూరీ అమ్ముకొని ఆమె జీవనం సాగిస్తున్నారు.

‘నేను గర్భిణీగా ఉన్న సమయంలో సరైన రహదారి లేదు. నేను జారిపడిపోవడం వల్ల ఆ సమయంలో చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. తల్చుకుంటేనే నాకు ఏడుపొస్తోంది. ఆ విషయం గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు. కానీ ఇప్పుడు అంతా సవ్యంగా ఉంది’ అంటారు గీత అనే మరో మహిళ.

‘రోడ్డు లేక గర్భిణులు చాలా అవస్థలు పడేవాళ్లు. వాళ్లలో నేను కూడా ఉన్నా. రాత్రి పూట వైద్యుడిని పిలవలేక నన్ను ఓ పల్లకీ లాంటి తాత్కాలిక నిర్మాణంలో కూర్చొబెట్టుకొని భుజాలపై మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ అనుభవమే నన్ను ఈ రోడ్డు నిర్మాణంలో పాల్గొనేందుకు ముందుకు నడిపింది’ అంటారు ఉత్తర.

వివిధ సందర్భాల్లో మహిళలు ఎదుర్కొన్న రకరకాల సమస్యలే రోడ్డు నిర్మాణంలో వారిని ఒక్కటి చేశాయి. ఇప్పుడు ఆ రోడ్డే పిల్లల బంగారు భవిష్యత్తుకూ మార్గం చూపుతోంది.

‘గతం మా స్కూల్ యూనిఫాంలు మురికిగా మారేవి. మట్టిలో ఉండే గాజుపెంకులు మా పాదాలకు గుచ్చుకుపోయేవి. పరీక్షల సమయంలో కూడా చెరువుకు వెళ్లి బురదను శుభ్రం చేసుకుని స్కూలుకి వెళ్లడంతో చాలాసార్లు ఆలస్యమయ్యేది’ అని తమ సమస్యలను గుర్తు చేసుకుంది రెబా అనే విద్యార్థిని.

కానీ, ఓ చిన్న ఇటుకల రోడ్డు ఇప్పుడు రెబా లాంటి వాళ్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. ప్రభుత్వమో, అధికారులో తీసుకొచ్చిన వెలుగు కాదది. మహిళలంతా తమకు తాముగా సాధించుకున్నది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)