తెలంగాణ ఎన్నికలు: 'ఒక కులం వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ కులంలో మొత్తం దరిద్రం పోతదా?' - ఖమ్మం సభలో కేసీఆర్

ఫొటో సోర్స్, TRS PARTY FACEBOOK
ఖమ్మం ప్రజల చైతన్యం ముందు కులాలకు సంబంధించిన కుళ్లు, దొంగ డబ్బు, టక్కు టమార విద్యలు ఏవీ నిలబడలేవని కేసీఆర్ అన్నారు. సోమవారం ఖమ్మంలో జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని మొత్తం 10 స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
స్వార్థంతో కొంతమంది నాయకులు చెప్పే విషయాలను ప్రజలు నమ్మొద్దన్నారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు వంద శాతం అమలు చేస్తున్నామన్నారు. దేశంలో వంద శాతం ఎన్నికల ప్రణాళికను అమలు చేసిన పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమే అని చెప్పారు. దీనిపై ఎవరితోనైనా చర్చించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
తాము కట్టిస్తున్న ఒక్కో డబుల్ బెడ్రూం ఇల్లు... గతంలో కాంగ్రెస్, టీడీపీలు కట్టించిన ఏడు ఇళ్లతో సమానమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,70,000 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు.
ఇంకో ఆరు నెలలు ఆలస్యమైనా, అరవై డెబ్బై ఏళ్ల వరకూ బాధ లేకుండా పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు.
కులం, మతం అన్నం పెట్టదు
ఈ ఎన్నికల్లో కులం, మతం అనే ముసుగులో వచ్చే వారికి బుద్ధి చెప్పాలని కేసీఆర్ అన్నారు. కులం, మతం మనకు అన్నం పెట్టవన్నారు.
ఒక కులానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే, ఆ కులంలో దరిద్రం మొత్తం పోతుందా అని ప్రశ్నించారు.
దీనిపై మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ బీబీసీతో మాట్లాడుతూ, "కులాలను, మతాలను పట్టించుకోవద్దని ఎన్నికల ముందు కేసీఆర్ అంటున్నారు. కానీ కులానికొక పేరుతో భవనాలు కట్టించింది కూడా ఆయనే కదా. ఎన్నికల ముందు అన్నీ పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శలు చేసుకుంటాయి. అది సహజమే. వాటిని అంత ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గతంలో రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని కేసీఆర్ అనడంలోనూ ఆశ్చర్యం లేదు" అని అన్నారు.

ఫొటో సోర్స్, TRS PARTY FACEBOOK
కాంట్రాక్టు ఉద్యోగులు కడుపునిండా తింటున్నారు
తెలంగాణలో అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం, దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేదని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో దాదాపు 411 రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.
భారత దేశంలో జీతాలు తీసుకునే అంగన్‌వాడీ కార్యకర్తలు, అత్యధిక వేతనాలు అందుకుంటున్న ఆశా వర్కర్లు, హోం గార్డులు, కడుపు నిండా తినే కాంట్రాక్టు ఉద్యోగులు తెలంగాణలో మాత్రమే ఉన్నారని కేసీఆర్ చెప్పారు.
ట్రాఫిక్ పోలీసులు కాలుష్యం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని వాళ్లకు మూల వేతనంలో 30 శాతం రిస్క్ అలవెన్సు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తమదేనన్నారు. గత పాలకులు వాళ్లతో వెట్టిచాకిరి చేయించారు, అర్ధాకలితో ఎండబెట్టారు కానీ, వాళ్ల బాధలు పట్టించుకోలేదని విమర్శించారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 43 వేల కోట్లతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేవని చెప్పారు.
తాను చేప్పే విషయాలు అవాస్తవమైతే టీఆర్‌ఎస్‌ను డిపాజిట్లు రాకుండా ఓడగొట్టాలని, నిజమే అయితే అవతలి వాళ్ల డిపాజిట్లు గల్లంతు చేయాలన్నారు.
చంద్రబాబు ఆ లేఖను వెనక్కి తీసుకోవాలి
150 కిలోమీటర్లు పారే గోదావరి నది ఉన్న ఖమ్మం జిల్లాను టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు ఎండబెట్టాయని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ అంటూ భజన తప్ప నీళ్లు రాలేదని ఎద్దేవా చేశారు.
ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును కట్టొద్దంటూ చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని కేసీఆర్ చెప్పారు. దానికి సమాధానం చెప్పిన తర్వాతే చంద్రబాబు ఖమ్మంలో అడుగుపెట్టాలన్నారు.
చంద్రబాబుకు నిజాయితీ ఉంటే సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రాసిన ఆ లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం, భూపాలపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్న పోడు భూముల సమస్యను ఏడాదిన్నరలో పరిష్కరిస్తామన్నారు.

ఫొటో సోర్స్, TRS PARTY FACEBOOK
రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది
ప్రపంచంలోనే మొదటిసారిగా ఎలాంటి దరఖాస్తు లేకుండా, పైరవీలకు ఆస్కారం లేకుండా రైతు బంధు పథకం అమలు చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి ఏటా ఎకరాకు రూ. 10 వేల చొప్పున సాయం చేస్తామని చెప్పారు.
రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి ప్రశంసించి, ఈ పథకం ఎలా అమలు చేస్తున్నారో వివరించాలంటూ తమ ప్రభుత్వాన్ని ఆహ్వానించిందని కేసీఆర్ తెలిపారు.
తమ పథకాలను ఐక్యరాజ్య సమితి పొగుడుతున్నా, ఇక్కడి కాంగ్రెస్, టీడీపీలకు మాత్రం అవి కనిపించడంలేదని విమర్శించారు.
అయితే, పథకాలను మెచ్చుకోవాల్సింది ఐక్యరాజ్య సమితి కాదని, ఆ పథకాలను ప్రశంసించాల్సింది ప్రజలేనని ప్రొఫెసర్. కే. నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో పార్టీలు చేసుకునే విమర్శలను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు.
కేంద్రంలో చక్రం తిప్పుతానని, తోక తిప్పుతానని చెప్పను
జాతీయ రాజకీయాల్లో తెరాస పాత్ర వహించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు.
"కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని నరేంద్రమోదీకి రాజ్యం అప్పగిస్తే ఆయన కూడా చతికిలపడ్డారు తప్పా, ఒరగబెట్టిందేమీ లేదు, ప్రజలకేం చేయలేదు.
ఆ రెండు రాజకీయ పార్టీలు ఈ దేశానికి పనికిరావు. వాళ్లు అధికారాలను కేంద్రీకృతం చేస్తున్నారు. రాష్ట్రాల అధికారాలను హస్తగతం చేసుకుంటున్నారు. నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు.
అందుకే, వాళ్లను ప్రతిఘటించి, నిలువరించి రాష్ట్రాల అధికారాలు పెంపొందించే ఫెడరల్ ఫ్రంట్ రావాలి. నాకు చిల్లర మాటలు రావు. దిల్లీలో చక్రం తిప్పుతా, తోక తిప్పుతా అని చెప్పను. కానీ, దిల్లీని అదుపు చేసే రాజకీయాలు మాత్రం టీఆర్‌ఎస్ తప్పకుండా చేస్తుంది" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి
- చైనా రియల్ ఎస్టేట్: కోట్ల సంఖ్యలో ఖాళీ ఫ్లాట్లు... 'నిర్మానుష్య ఆకాశ హర్మ్యాలు'
- అమరావతిలో అంతర్జాతీయ పవర్ బోట్ రేసింగ్
- గరిమా అరోరా: ఆమె చేతి వంటకు ప్రపంచమే ఫిదా
- శబరిమలలో తృప్తి దేశాయ్: ‘నన్ను చంపేస్తామని 300 మెసేజ్‌లు వచ్చాయ్’
- కిలోరాయి మారుతోంది.. మరి మీ బరువు మారుతుందా? మారదా?
- కోతుల బెడద: నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం
- మధుమేహం అంటే ఏమిటి? రాకుండా జాగ్రత్తపడడం ఎలా?
- సీబీఐకి ఆంధ్రప్రదేశ్‌లో నో ఎంట్రీ... దీని పర్యవసానాలేమిటి?
- ఎంపీలుగా ఓడారు.. ఎమ్మెల్యే టికెట్ పట్టారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)









