మధ్యప్రదేశ్ ఎన్నికలు 2018: మూడుసార్లు వరుస విజయం బీజేపీకి ఎలా సాధ్యమైంది?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా నవంబర్ 28న మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత మూడు దఫాలుగా ఆ రాష్ట్రంలో బీజేపీనే విజయం సాధిస్తోంది. ఆ విజయంలో ఆదివాసీల ఓట్లు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లో ఆదివాసీల జనాభా దాదాపు 23శాతం. అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లకు 47 రిజర్వుడు సీట్లున్నాయి. గత మూడు ఎన్నికల్లోనూ ఆ రిజర్వుడు సీట్లలో మెజారిటీ స్థానాలను బీజేపీనే కైవసం చేసుకుంటూ వస్తోంది.
సమాజ్‌వాదీ జనపరిషత్‌కు చెందిన ఫాగ్‌రామ్ అనే ఆదివాసీ వ్యక్తి గత మూడు ఎన్నికల్లోనూ పోటీ చేశారు. కానీ, ఎప్పుడూ ఆయనకు వచ్చిన ఓట్ల సంఖ్య ఐదు వేలు దాటలేదు. ఈసారి కూడా ఆయన హోషంగాబాద్ జిల్లా సీవనీ మాల్వా నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈసారి కూడా తాను గెలవననేది ఆయన గట్టి నమ్మకం. కానీ, ఆయన పోటీలో నుంచి మాత్రం తప్పుకోవట్లేదు. ఒక మోటార్ సైకిల్ మీదే తన నియోజకవర్గంలో సొంతంగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు.
ఒక పక్క కాంగ్రెస్, బీజేపీల నుంచి కోటీశ్వరులైన అభ్యర్థులు బరిలో దిగుతుంటే, మరోపక్క ఫాగ్‌రామ్ లాంటి సామాన్యులూ పోటీ చేస్తున్నారు. ‘వీళ్లందరికీ వీలైనంత పోటీ ఇవ్వడమే నా లక్ష్యం. ఆదివాసీల్లో చైతన్యం తీసుకురావాలన్నదే నా తపన. అందుకే నేను ఎప్పటికీ గెలవకపోయినా సరే, పోటీ మాత్రం చేస్తుంటా’ అంటారాయన.

ఆదివాసీల బలం
2013 ఎన్నికల్లో ఆదివాసీల కోసం రిజర్వ్ చేసిన 47 సీట్లలో బీజేపీ 31 సీట్లను గెలుచుకుంది.
2008లో కూడా 47 సీట్లలో 31 బీజేపీ ఖాతాలోనే చేరాయి. 2003లో ఆదివాసీలకు రిజర్వ్ చేసిన 41 సీట్లలో 37 సీట్లను బీజేపీ దక్కించుకుంది. గత మూడు ఎన్నికల్లో బీజేపీ ఆదివాసీ సీట్ల సంఖ్య 30కి తగ్గలేదంటనే ఆ వర్గంలో అదెంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
1990లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 320 సీట్లకు గానూ 220 సీట్లను గెలుచుకుంది. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత మాత్రం ఆ రాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది. ఆ మరుసటి ఏడాది, అంటే 1993లో అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 116 స్థానాలకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో ఆదివాసీల కోసం రిజర్వ్ చేసిన స్థానాల్లో బీజేపీ కేవలం మూడు సీట్లను మాత్రమే గెలవగలిగింది.
1993లో ఆదివాసీల రిజర్వుడు స్థానాల్లో బీజేపీ గెలుచుకున్న సీట్లను గమనిస్తే, ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. 2003 తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ మెజారిటీ ఆదివాసీలు బీజేపీవైపే మొగ్గు చూపారు. అంతలా వాళ్లను ఆకర్షించడానికి బీజేపీ ఏం చేసిందన్నది ప్రశ్నార్థకమైంది.
అక్కడ ఆదివాసీలు ఇప్పటికీ అటవీ హక్కుల కోసం పోరాడుతున్నారు. విద్యా, ఉపాధి అవకాశాల్లో వెనకబడే ఉన్నారు. భారీ డ్యాముల కారణంగా ఆవాసాల్నీ కోల్పోతున్నారు. అయినా ఆ ప్రభావం ఎన్నికల్లో పెద్దగా కనిపించట్లేదు.

బీజేపీ ఎందుకు గెలుస్తోంది?
సీవలీ మాల్వాలోని కేసలా గ్రామానికి చెందిన ఇక్బాల్ బాలూ అనే వ్యక్తి జేఎన్‌యూ నుంచి పీహెచ్‌డీ చేస్తున్నారు. ఎన్నికల్లో మూడు దఫాలుగా పోటీ చేస్తున్న ఫాగ్‌రామ్‌ది కూడా ఇదే గ్రామం.
పదిహేనేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ విజయంలో ఆదివాసీలే కీలకపాత్ర పోషిస్తున్నారని ఇక్బాల్ చెబుతున్నారు.
‘గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా ఘోరంగా ఓడిపోతూ వస్తోంది. గోండ్వానా గణతంత్ర పేరుతో ఓ పార్టీ వచ్చింది. కానీ, అది కూడా రాజకీయ క్రీడలో భాగమైపోయింది. పేరును బట్టి చూస్తే అది గోండు ఆదివాసీలకు ప్రాతినిధ్యం వహించేట్లు కనిపిస్తుంది. కానీ, మధ్య ప్రదేశ్‌లో ఇతర ఆదివాసీలు కూడా చాలామంది ఉన్నారు.
ఈసారి ఆరెస్సెస్‌కు అనుబంధంగా ఉన్న వనవాసీ కల్యాణ్ పరిషత్ కూడా ఆదివాసీల మధ్య తన ఎజెండాను విస్తృతంగా వ్యాప్తి చేసింది. ఇటీవలి కాలంలో వనవాసీ కల్యాణ్ పరిషత్ అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించింది. వాటిలో భక్త శబరి పేరు ప్రముఖంగా వినిపించేది. రాముడికి శబరి ఎంగిలి పండ్లను ఎలా తినిపించిందో ఆ కార్యక్రమాల్లో చెప్పేవారు. శబరి కుంభమేళా కార్యక్రమాన్ని నిర్వహించడం మొదలుపెట్టారు. ఆదివాసీలను ఇతర రాష్ట్రాల్లో తీర్ధయాత్రలకు పంపడమూ ప్రారంభించారు.
ఈ వనవాసీ కల్యాణ్ పరిషత్తులు ఆదివాసీల ప్రాంతాల్లో హాస్టళ్లను, గ్రంథాలయాలను ప్రారంభించాయి. గ్రంథాలయాల్లో హిందుత్వ భావనలకు సంబంధించిన పుస్తకాలే ఎక్కువగా కనిపిస్తాయి. హాస్టల్ విద్యార్థులకు ఆరెస్సెస్ తమకు అనుగుణంగా శిక్షణ ఇస్తోంది’ అని అక్కడి పరిస్థితిని ఇక్బాల్ బాలూ వివరిస్తారు.
మధ్యప్రదేశ్‌లో ఆరెస్సెస్‌తో పాటు మీడియా కూడా హిందుత్వను వ్యాప్తి చేయడంలో తన వంతు పాత్ర పోషించిందని ఇక్బాల్ అంటారు. ఆదివాసీల హక్కుల కోసం పనిచేస్తున్న అనురాగ్ మోదీ కూడా ఆ మాటతో ఏకీభవిస్తారు.
ఆరెస్సెస్‌వాళ్లు ఆదివాసీలను వనవాసీలు అని పిలవడానికే ఇష్టపడతారు. 2002లో బిహార్ విభజన జరిగినప్పుడు వాజపేయీ ప్రభుత్వం ఝార్ఖండ్‌కు బదులుగా ఆ రాష్ట్రం పేరును వనాంచల్‌గా పెట్టాలని భావించింది. అడవుల్లో జీవించే వాళ్లంతా వనవాసీలే అని ఆరెస్సెస్ చెబుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆదివాసీలు అని పిలిస్తే ఇబ్బందేంటి?
‘ఆదివాసీలు అంటే స్థానికంగా మొదట్నుంచీ ఉంటున్నవారని అర్థం. అంటే ఆదివాసీలు కాకుండా మిగతావారంతా బయటి నుంచి వచ్చిన వారే. ఆర్యులు కూడా అక్కడివారు కాదు. అలాంటప్పుడు హిందువులు అక్కడివారు, ముస్లింలు బయటివారు అని చెప్పే అవకాశం ఆరెస్సెస్‌కు ఉండదు. అందుకే వాళ్లు ఆదివాసీలను వనవాసీలు అంటారు’ అని అనురాగ్ మోదీ చెబుతారు.
ఇదే విషయం గురించి భోపాల్‌లోని వనవాసీ కల్యాణ్ పరిషత్ కార్యాలయ నిర్వాహకుడు మధు దన్‌కడ్ మాట్లాడుతూ, అడవుల్లో ఉండేవాళ్లంతా వనవాసీలే అని అంటారు. ‘మనమంతా రాముడి వారసులమే. మనమంతా ఆదివాసీలమే. శబరి పెట్టిన పండ్లను రాముడు తిన్నాడు. రాముడితో పాటు శబరి కూడా పూజనీయురాలే’ అని ఆయన చెప్పారు.
మధ్యప్రదేశ్ వనవాసీ కల్యాణ్ పరిషత్ ప్రధాన నిర్వాహకుడు యోగిరాజ్ పర్తే దీని గురించి మాట్లాడుతూ తాము ఆదివాసీల హిందూకరణ చేయడం లేదని, వాళ్లు హిందువుల్లో భాగమే అని అన్నారు. ఈ దేశంలో ముస్లింలతో సహా అందరూ ఆదివాసీలే అని, క్రమంగా హిందువులే ముస్లింలుగా మారారని ఆయన చెప్పారు.
గత కొన్నేళ్లుగా ఆదివాసీలపై ఆరెస్సెస్ దాని అనుబంధ సంస్థల ప్రభావం పెరిగిందని మధ్యప్రదేశ్‌లో ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్మితా గుప్తా చెప్పారు.
‘ఒకప్పుడు ఆదివాసీలు కాంగ్రెస్‌కే ఓటేసేవారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు మారిపోయింది. ప్రభుత్వ పాఠశాలలను సరస్వతీ శిశు మందిర్‌ల తరహాలో మార్చారు. వనవాసీ కల్యాణ్ పరిషత్తులకు నిధులు కేటాయించారు. కార్యకర్తల సంఖ్యనూ పెంచుకున్నారు. వీటన్నింటి ప్రభావం ఆదివాసీల ఓట్లపైనా పడింది’ అని స్మితా గుప్తా తెలిపారు.

కాంగ్రెస్ ఎందుకు ఆదివాసీలను ఆకర్షించలేకపోతోంది?
ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ, కాంగ్రెస్ కూడా ఆదివాసీల కోసం పెద్దగా చేసిందేమీ లేదని స్మితా చెప్పారు.
‘ఆదివాసీల కోసం కాంగ్రెస్ ఏదైనా చేసుంటే, ప్రస్తుతం వారి పరిస్థితి ఇంకాస్త మెరుగ్గానే ఉండేది. నేను 1985లో ఇక్కడికి వచ్చినప్పుడు మహిళలు నుదుటిపై సింధూరం ధరించేవారు కాదు. కానీ, ఇప్పుడు సింధూరం పెట్టుకుంటున్నారు. ఆదివాసీల సంస్కృతిపైన హిందూ సంస్కృతి ప్రభావం విస్తృతంగా పడింది. ఒకప్పుడు ఆదివాసీలు గణపతి ఉత్సవాలు జరిపేవారు కాదు. కానీ, ఇప్పుడు చేస్తున్నారు’, అని స్మితా అన్నారు.
ఆదివాసీల పేదరికాన్ని, నిస్సహాయతను బీజేపీ, ఆరెస్సెస్‌లు తమకు అనుకూలంగా మార్చుకున్నాయని, ధనబలంతో తమ బలాన్ని పెంచుకున్నాయని ఫాగ్‌రామ్ చెప్పారు.
‘మొదట వనవాసీ కల్యాణ్ పరిషత్ సభ్యులు ఆదివాసీల సమస్యల్నే ప్రస్తావిస్తారు. దాంతో ఆదివాసీలు కూడా సులువుగా ఆకర్షితులవుతారు. ఆ తరువాత క్రమంగా తమ ఎజెండాను విస్తరించడం మొదలుపెడతారు’ అని ఆయన అన్నారు.
1992లో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగాక, రామ మందిర నిర్మాణం కోసం అక్కడి నుంచి కూడా ఆదివాసీలు వెళ్లారని ఫాగ్‌రామ్ చెబుతారు. ‘ఇక్కడ మా ఇళ్లు నిర్మించుకోవడానికి ఒక్క ఇటుక కూడా లేదు, అలాంటిది అయోధ్యకు ఎలా వెళ్లామా అని మాకనిపిస్తుంది’ అంటారు ఫాగ్‌రామ్.

ఫొటో సోర్స్, Getty Images
1991లో ప్రత్యేక గోండు రాజ్య నినాదంతో మధ్యప్రదేశ్‌లో గోండ్వానా గణతంత్ర పార్టీ (జీజీపీ) ఏర్పడింది. కానీ అది అన్ని పార్టీల్లానే రాజకీయ లావాదేవీల్లో భాగమైపోయింది. గత ఏడాది కాలంలో జయ్ ఆదివాసీ యువ శక్తి పేరుతో భీల్ ఆదివాసీ యువకులు ఓ సంఘాన్ని స్థాపించారు. కానీ ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి దాని వ్యవస్థాపకుడు హీరా లాల్ కాంగ్రెస్ పంచన చేరారు.
మరోపక్క, రిజర్వేషన్ లేని స్థానాల్లో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్... ఏ పార్టీ కూడా ఆదివాసీలకు సీట్లు ఇచ్చింది లేదు. ‘ఆదివాసీలను రిజర్వుడు సీట్లకే పరిమితం చేయడం సరికాదు. వాళ్ల కోసం ఏదైనా చేయాలని నిజంగా అనుకుంటే, సాధారణ స్థానాల్లో కూడా వారికి పోటీకి అవకాశమివ్వాలి’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది చెప్పారు.
ఇప్పటివరకు ఎందుకు ఆదివాసీలకు సాధారణ సీట్లు ఇవ్వలేదనే ప్రశ్నకు ఆయన దగ్గరా సమాధానం లేదు.
మధ్య ప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి రజనీశ్ అగర్వాల్‌ను దీని గురించి ప్రశ్నిస్తే, గతంలో ఎప్పుడూ ఆదివాసీలకు సాధారణ స్థానాల్లో పోటీకి అవకాశం కల్పించలేదని ఆయన చెప్పారు.
ఇప్పటికే 47 సీట్లు వాళ్లకు కేటాయించినందున, ఇతర స్థానాల్లో ప్రత్యేకంగా మళ్లీ అవకాశం కల్పించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. 36శాతం దళితులు-ఆదివాసీల జనాభా ఉన్న మధ్యప్రదేశ్‌లో ఇప్పటిదాకా బ్రాహ్మణులు, ఠాకూర్‌లు, బనియాలు మాత్రమే ముఖ్యమంత్రులుగా ఎందుకున్నారనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు.
ఏదేమైనా మధ్యప్రదేశ్‌లో నాయకుల ఎన్నికలో మాత్రమే ఆదివాసీలు, దళితులు కీలకపాత్ర పోషిస్తారని, పాలనలో మాత్రం కానేకాదని చరిత్ర చెప్పకనే చెబుతోంది.
ఇవి కూడా చదవండి
- బీజేపీకి ఇది స్వర్ణయుగమా?
- ఇందిరను ఫిరోజ్ మోసం చేశారా? ఇందులో నిజమెంత?
- బీబీసీ బ్లూ ప్లానెట్ చూసిన ఈ అమ్మాయి అడవుల్లోనే బతకాలని ఎందుకు నిర్ణయించుకున్నారు?
- అయోధ్య: ఇది నిజంగానే రామ జన్మస్థలమా? దీని చరిత్ర ఏమిటి?
- నెహ్రూ కాలర్ పట్టుకుని నిలదీసిన మహిళ
- కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌కు సిగరెట్లు, మద్యం అలవాటు లేదు.. మరి ఆయనకు లంగ్ క్యాన్సర్ ఎలా వచ్చింది?
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటీ? చేయకపోతే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








