శబరిమల తీర్పుపై చినజీయర్: ‘సమానత్వం పేరిట పురుషులనూ పిల్లల్ని కనమంటే? - ప్రెస్ రివ్యూ

చినజీయర్ స్వామి

ఫొటో సోర్స్, facebook/China Jeeyar

శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించడం.. శాస్త్రం ప్రకారం తప్పేనని చినజీయర్‌ స్వామి వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది. అందులో..

ఆదివారం ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ... మానవ దేహంలో అన్ని అవయవాలకు సమ ప్రాధాన్యం ఉంటుంది. దేని పని అది సక్రమంగా చేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.

అందుకు విరుద్ధంగా ముక్కుతో అన్నం తినాలనుకోవడం సరికాదు. ప్రతి ఆలయానికీ కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. వాటిని గౌరవించాలి.

నమ్మకం లేకపోతే అస్సలు పట్టించుకోకూడదు. ఆలోచనలు భిన్నంగా ఉండవచ్చుకానీ న్యాయమూర్తులు కూడా సామాన్య ప్రజలే. వారికీ పరిమితులు ఉంటాయి.

రాజ్యాంగం కొన్ని మార్గదర్శకాలను సూచించింది. భగవంతుడి ఆరాధనలో మానవుడికి స్వేచ్ఛ ఉంది. శాస్త్రం ప్రకారం శబరిమల విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు తప్పిదమే.

కొన్ని అంశాలను రాజకీయాలతో ముడిపెట్టకూడదు. అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు మహిళలను అనుమతించడమే సమానత్వం అనుకుంటే పొరబాటే.

ఒకవేళ స్త్రీలాగే పురుషులు కూడా పిల్లల్ని కనాలని డిమాండ్‌ చేస్తే ఏం చేస్తారు? సమానత్వమని అలాగే జరగాలని తీర్పు ఇస్తారా? ప్రకృతికి విరుద్ధంగా ఏమీ చేయకూడదు అని చినజీయర్ స్వామి అన్నట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, Getty Images

సమరానికి సై

కేంద్రంలో బీజేపీని సాగనంపడమే లక్ష్యంగా సాగనున్న సమరానికి అస్త్రశస్త్రాలు సిద్ధమవుతున్నాయని ఆంధ్రజ్యోతి పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

దేశంలో అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో కలిసొచ్చే పార్టీలతో జరిపిన చర్చలు విజయవంతం కావడంతో, పోరులో మలి అంకానికి సోమవారం తెర లేస్తోంది.

ఉమ్మడి వేదిక ఏర్పాటు లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కీలక చర్చలు జరపనున్నారు. సోమవారం ఆయన కోల్‌కతాకు వెళుతున్నారు.

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమవుతారు. మోదీ వ్యతిరేక పోరాటానికి ఒక స్పష్టమైన రూపు తెచ్చే క్రమంలో వీరి భేటీ కీలకంగా మారనుంది.

మోదీపై పోరాటం విషయంలో ఇతర ప్రాంతీయ పార్టీల నేతల అభిప్రాయాలకు, తృణమూల్‌ అధినేత్రి మమత అభిప్రాయానికి మధ్య చాలా తేడా ఉంది.

కాంగ్రెస్‌ ప్రధాన భాగస్వామిగా కలిసి పనిచేసేందుకు మిగతా పార్టీలు దాదాపు సిద్ధంగా ఉన్నాయి. మోదీని గద్దె దించడమే ప్రధాన అజెండా కావాలన్న చంద్రబాబు సూచనకు ఆయా పార్టీల నేతలు సరేనంటున్నారు.

అయితే కాంగ్రెస్‌కు పెద్దన్న పాత్ర ఉండరాదన్నది మమత వాదన. అందుకే ముందుగా ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి, ఆ తర్వాత కాంగ్రెస్‌తో అవగాహనకు రావాలన్నది ఆమె అభిప్రాయంగా చెబుతున్నారు.

అలా చేస్తే ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే కలిసి సాగేందుకు ఏ ఇబ్బందీ ఉండదన్నది ఆమె వాదన.

ఈ నెల 22న దిల్లీలో బీజేపీయేతర పక్షాలు ఇచ్చే విందు సమావేశానికి చంద్రబాబు హాజరవుతారు. అక్కడ ఒక ఉమ్మడి వేదిక ఏర్పాటుచేసి కేంద్రంపై పోరాట కార్యాచరణను ప్రకటించే అవకాశాలున్నాయంటూ ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

హైదరాబాద్‌లో నిరుద్యోగులు

ఫొటో సోర్స్, Getty Images

నిరుద్యోగ గండం

ఏపీలో నిరుద్యోగుల పరిస్థితి దినదిన గండంగా ఉందని సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

ఒక్కోరోజు గడుస్తుంటే వేలాది మంది ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారు. ఇందుకు కారణం ప్రభుత్వం ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు విడుదల చేయించకపోవడమే.

ఏటా ఉద్యోగ నియామకాలంటూ చెప్పి ఈ నాలుగున్నరేళ్లలో 2016లో మాత్రమే 4,275 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి టీడీపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది.

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సందర్భంలో ఈ ఏడాది సెప్టెంబర్‌ 19న 18,450 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

అయితే ఇప్పటివరకు నోటిఫికేషన్లు మాత్రం విడుదల చేయలేదు. దీంతో ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి దాటిపోతున్న నిరుద్యోగులు ఆందోళనతో ఉన్నారు.

గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం 34 ఏళ్లనుంచి 42 ఏళ్లకు పెంచుతూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించింది.

ఇప్పటివరకూ నోటిఫికేషన్లు లేకపోవడంతో ఆ వయో పరిమితిని మించిపోయిన వేలాది మంది ఇప్పుడు నోటిఫికేషన్లు వచ్చినా కనీసం దరఖాస్తు చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతోందని సాక్షి పత్రిక పేర్కొంది.

పోలవరం ప్రాజెక్టు ప్రాంతం

ఫొటో సోర్స్, NAlle sivakumar

పోలవరంపై ప్రశ్నల వర్షం

పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరులశాఖ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉందంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

2017 ఆగస్టులో కేంద్రానికి ఇచ్చిన ‘సవరించిన అంచనాల’ను 14 నెలలుగా నాన్చుతూనే ఉంది. కేంద్ర మంత్రి గడ్కరీ ఈ ఏడాది జులైలో స్వయానా పోలవరం ప్రాజెక్టును సందర్శించి ఇక అంతా తాను చూసుకుంటానని ఇచ్చిన అభయం కార్యరూపం దాల్చలేదు.

ఆంధ్రప్రదేశ్‌ అధికారులు దిల్లీకి వస్తే పది రోజుల్లో అంతా తేల్చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. 2014నాటి ధరల ప్రకారం సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదముద్ర వేస్తేనే ప్రాజెక్టు ముందుకు కదులుతుందన్న వాస్తవం తెలిసీ దిల్లీ పెద్దలు తాత్సారం చేస్తున్నారని ఈనాడు పేర్కొంది.

ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించి త్వరగా నిధులు వచ్చేలా చూడమని రాష్ట్ర ప్రభుత్వం మొరపెట్టుకుంటుంటే, ముందు తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వమని కేంద్రం 20 ప్రశ్నలను సంధించింది.

ఇందులో అత్యధికం భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన సందేహాలే ఉన్నాయి. కేంద్రం అడిగిన ప్రశ్నలకు ఎప్పటికప్పుడు సమాధానం ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నలుగురు ఉన్నతస్థాయి అధికారులను దిల్లీలోనే పెట్టినప్పటికీ సమస్య పరిష్కారం కావడంలేదని ఈనాడు కథనం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)