#BeyondFakeNews: రూ.2000 నోటు ఫేక్‌న్యూస్ కథ

''మన భారతీయులందరికీ కంగ్రాచులేషన్స్. కొన్ని నిమిషాల క్రితమే మన కొత్త 2 వేల రూపాయల నోటును యునెస్కో 'ప్రపంచంలోని అత్యుత్తమ కరెన్సీ' అని ప్రకటించింది. ''
ఇలాంటి వార్తలు తరచుగా వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ అవుతుంటాయి. ఇలాంటివి చాలా వరకు తప్పుడు వార్తలు అయి ఉంటాయి కానీ వాటిని ఫార్వార్డ్ చేసేవారు 'జాతి నిర్మాణం'లో తాము భాగస్వాములం అవుతున్నామని భావిస్తుంటారు.
ఇవి సామాన్యుల ద్వారా ఫేక్ న్యూస్ ఎలా వ్యాప్తి చేస్తున్నారని బీబీసీ నిర్వహించిన పరిశోధనలో వెల్లడైన విషయాలు.
ఈ పరిశోధనలో వ్యక్తుల భావాలు, గుర్తింపునకు సంబంధించిన వార్తల విషయంలో నిజం, అబద్ధం మధ్య గుర్తింపు రేఖ చెరిగిపోతుందని తేలింది. దీని వల్ల నిర్ధారించుకోకుండానే వాటిని షేర్ చేయడం జరుగుతుంది.
బీబీసీ పరిశోధనలో భాగంగా ట్విటర్‌లోని నెట్ వర్క్‌లను పరిశీలించి, వాట్సాప్‌లాంటి యాప్‌లలో ప్రజలు ఆ ఫేక్ న్యూస్‌ను ఎలా షేర్ చేసుకుంటున్నారో పరిశీలించాము. ఈ పరిశోధనలో భాగంగా యూజర్లు సమాచారాన్ని సేకరించేందుకు తమ ఫోన్లు ఇచ్చి బీబీసీకి సహకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫేక్ న్యూస్‌కు 31 మంది బలి
బీసీసీ బియాండ్ ఫేక్ న్యూస్ ప్రాజెక్టులో భాగంగా ఈ లోతైన, బిగ్ డేటా రీసెర్చ్ ప్రాజెక్టును భారతదేశం, కెన్యా, నైజీరియాలలో చేపట్టాము.
ఈ ప్రాజెక్టులో భాగంగా మేం భారతదేశంలోని 10 ప్రధాన నగరాలలోని 40 మందిని వందల గంటల పాటు ఇంటర్వ్యూ చేసి, వాళ్ల మనసుల్లో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించాము. వేల ప్రొఫైల్స్‌ను, పేజీలను, లక్షలాది సోషల్ మీడియా సంబంధాలను పరిశీలించి, మన దేశంలో సోషల్ మీడియా ధోరణి ఎలా ఉందో, ఫేక్ న్యూస్ ఎలా వ్యాప్తి అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశాము.
వాట్సాప్‌లో ఫేక్ న్యూస్ కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు భారతదేశంలో కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. హింసను ప్రేరేపించే మెసేజ్‌లను ఫార్వార్డ్ చేయడానికి కొంచెం సందేహించే వాళ్లు, జాతీయవాద మెసేజ్‌లను ఫార్వర్డ్ చేయడం మాత్రం తమ బాధ్యతగా భావిస్తుంటారు.
భారతదేశం సాధిస్తున్న ప్రగతి గురించి, హిందువుల శక్తి గురించి, హిందువుల పునఃప్రాభవం గురించి.. అవి నిజమా, కాదా అని పరిశీలించకుండానే షేర్ చేయడం జరుగుతోంది.
ఈ పరిశోధనలో భారతదేశంలోని యూజర్లు తమ నమ్మకాలు, విలువలకు అనుగుణంగా ఉన్న సమాచారాన్ని.. దానిలో నిజమెంతో, అబద్ధమెంతో తెలుసుకోకుండానే షేర్ చేసుకుంటారని తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎక్కడ నుంచి వస్తోందన్నది కాదు.. ఎవరు ఫార్వర్డ్ చేశారన్నదే ముఖ్యం
ఈ ఏడాది ప్రారంభంలో వాట్సాప్ టైప్ చేయకుండా కేవలం ఫార్వర్డ్ చేసే మెసేజ్‌లకు 'ఫార్వర్డెడ్' అనే ట్యాగ్ ఉండే ఒక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మెసేజ్‌లను ఫార్వర్డ్ చేసే ముందు యూజర్లు ఒక్కసారి ఆలోచిస్తారనే భావంతో దీనిని ప్రవేశపెట్టారు. అయితే ఇది కూడా ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టలేకపోయిందని తెలుస్తోంది .
సమాచారం మొదట ఎక్కడ నుంచి వస్తోంది అన్న విషయం యూజర్లకు పట్టడం లేదు. దానిని ఎవరు ఫార్వర్డ్ చేశారన్నదే వాళ్లకు ముఖ్యం. సమాజంలో గౌరవప్రదమైన పేరు ఉన్నవాళ్లు పంపే మెసేజ్‌లను వీళ్లు ఫార్వర్డ్ చేస్తున్నారు. వాళ్ల మీద ఉన్న గౌరవం కొద్దీ ఆ సమాచారం నిజమా, అబద్ధమా అని నిర్ధారించుకోవడం లేదు.
షేరింగ్ అనేది తమ పౌర విధులలో ఒకటిగా భావిస్తున్నారు.
ప్రధాన మీడియా కూడా ఇలాంటి ఫేక్ న్యూస్‌ను వ్యాపింపజేయడంలో ఒక దోషిగా నిలుస్తోంది. రాజకీయ, ఆర్థిక పరమైన వత్తిళ్లు కింద పని చేస్తున్న మీడియాలోని వార్తలు కూడా విశ్వసించడానికి వీల్లేదని పరిశోధనలు చెబుతున్నాయి.
ఫేక్ న్యూస్, మోదీకి అనుకూలమైన రాజకీయ కార్యకలాపాలు రెండూ కలగలిసిపోతున్నాయని ఈ నివేదిక సూచిస్తోంది.
ట్విటర్‌లో బిగ్ డేటా విశ్లేషణను ఉపయోగించి, మితవాద వర్గాలన్నీ చాలా దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాయని బీబీసీ గుర్తించింది.

ఫొటో సోర్స్, Getty Images
ట్విటర్‌లో బీజేపీ అనుకూల గొంతుకల నెట్ వర్క్ చాలా పెద్దది. 'హిందూ అనుకూల', 'మోదీ అనుకూల', 'జాతీయవాద అనుకూల' అన్న లక్షణాల వాటి ద్వారా గుర్తించొచ్చు. ఇలాంటి వర్గాలన్నీ ఒకే రకమైన వార్తలను వ్యాప్తి చేస్తున్నాయి.
మరోవైపు వామపక్షం వైపు ఉండే వర్గాలను 'మోదీ వ్యతిరేక', 'హిందుత్వ వ్యతిరేక' అన్న భావాల ద్వారా గుర్తించవచ్చు. అయితే వీరిలో భిన్నరకాల భావజాలం కనిపిస్తుది. వాటి గళాలు కూడా భిన్నంగా ఉంటాయి. వీళ్లు కూడా ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేస్తున్నా, మితవాద వర్గాలతో పోలిస్తే వాటి పరిమాణం చాలా తక్కువ.
వామపక్ష వర్గాలకు రాహుల్ గాంధీలాంటి నేతలతో సంబంధాలు లేవు కానీ, మితవాద వర్గాలు మాత్రం మోదీ సహా అనేక మంది అధికార పార్టీ నాయకులతో సంబంధాలు కలిగి ఉన్నాయి.

ఫొటో సోర్స్, Twitter/Narendra modi
56.2 శాతం వెరిఫై కాని అకౌంట్లు
ఈ సమాచారాన్ని సేకరించడానికి 16 వేల ట్విటర్ ప్రొఫెల్స్‌ను ఉపయోగించాము.
ఈ ట్విటర్ డాటాను విశ్లేషించినపుడు ప్రధాని నరేంద్ర మోదీ ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేసే కొన్ని ట్విటర్ అకౌంట్లను ఫాలో అవుతున్నట్లు తేలింది.
మోదీ ఫాలో అయ్యే అకౌంట్లలో 56.2 శాతం అకౌంట్లను ట్విటర్ వెరిఫై చేయలేదు. మోదీ ఫాలో అయ్యేవాటిలో 61 శాతం అకౌంట్లు బహిరంగంగా బీజేపీని సమర్థిస్తూ, ట్విటర్‌లో పార్టీ ప్రచారాన్ని చేస్తున్నాయి.
మోదీ ట్విటర్‌లో సాధారణ ప్రజలతో కనెక్ట్ కావడానికి ప్రయత్నిస్తాడని బీజేపీ చెబుతోంది. అయితే ఆయన ఫాలో అయ్యే అకౌంట్లు సాధారణంగా కనిపించడం లేదు. వాటి సగటు ఫాలోయర్ల సంఖ్య 25 వేలకు పైగా ఉంటోంది.
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 11 శాతం వెరిఫై కాని అకౌంట్లను ఫాలో అవుతున్నారు. అదే దిల్లీ సీఎం కేజ్రీవాల్ అనుసరించే వెరిఫై కాని అకౌంట్ల శాతం 37.7.
''ఈ పరిశోధన వెనుక.. సాధారణ ప్రజలు ఫేక్ న్యూస్ ఒక పెద్ద సమస్యగా తయారయ్యాయి అంటూనే వాటిని ఎందుకు షేర్ చేసుకుంటున్నారు అన్న ప్రశ్న ఉంది'' అని బీబీసీ వరల్డ్ సర్వీస్ ఆడియన్స్ రీసెర్చ్ అధినేత డాక్టర్ సంతను చక్రబర్తి అన్నారు.
బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్రూప్ డైరెక్టర్ జేమీ ఆంగస్ ఫేక్ న్యూస్‌ను అరికట్టాలన్న తమ లక్ష్యంలో భాగంగా బియాండ్ ఫేక్ న్యూస్ కార్యక్రమం ఒక నిర్ణయాత్మకమైన అడుగు అన్నారు.
''మామూలుగా ఫేక్ న్యూస్‌ను పాశ్చాత్య దేశాల నేపథ్యంలో ఉపయోగిస్తారు. కానీ ఈ పరిశోధన ద్వారా ప్రపంచంలోని మిగతా చోట్ల కూడా జాతి-నిర్మాణం పేరిట సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేస్తున్నారు అన్న విషయం వెల్లడవుతోంది'' అన్నారు.
ఇవాళ దేశంలోని ఏడు నగరాలలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రాజకీయవేత్తలు, నటులు, నిపుణులు, విద్యార్థులు, ఫేస్ బుక్, గూగుల్, ట్విటర్‌లాంటి టెక్ కంపెనీల ప్రతినిధులు ఫేక్ న్యూస్ సమస్యపై తమ అనుభవాలను పంచుకుంటారు.
ఈ పరిశోధనలో వెల్లడైన ముఖ్యాంశాలు:
- మా పరిశోధనలో ఫేక్ న్యూస్ ఎక్కడ సృష్టిస్తున్నారన్న సమాచారం తెలిసిన వారికి రాజకీయాలు, రాజకీయ పార్టీలలో చాలా ఆసక్తి ఉందని తెలిసింది.
- షేర్ అవుతున్న ఫేక్ స్టోరీలలో ఎక్కువ భాగం రాతపూర్వకమైనవి కావు, అవి బొమ్మలు, మీమ్‌ల రూపంలో ఉన్నాయి.
- ప్రజలు అర్థం చేసుకోకుండా షేర్ చేస్తున్నారు - ఎందుకంటే అర్థం చేసుకోవడం కంటే షేర్ చేసుకోవడం సులభం కాబట్టి.
- ఎంత చదువుకున్నవారైనా, ఫేక్ న్యూస్‌ను పసిగట్టడంలో తమకెంతో ప్రావీణ్యం ఉందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









