రామ జన్మభూమి - బాబ్రీ మసీదు: అయోధ్యలో రామమందిర నిర్మాణంపై విచారణ వాయిదాతో బీజేపీకి లాభమా, నష్టమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రదీప్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రామ జన్మభూమి-బాబ్రీ మసీదు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేవలం మూడే మూడు నిమిషాలలో కేసును వచ్చే ఏడాది జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.
2019లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కేసు విచారణ జరగవచ్చని భావించారు. అయితే అది జరగలేదు.
కేసు వాయిదా నేపథ్యంలో, జనవరిలో అయినా విచారణ జరుగుతుందా, విచారణ ఇదే బెంచ్ ముందు జరుగుతుందా, లేక వేరే బెంచ్ ముందా అన్నదానిపై కూడా స్పష్టత లేదు.
2019లో సాధారణ ఎన్నికల నేపథ్యంలో, ఈ కేసు విచారణ వాయిదా బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందా లేక నష్టాన్నా అన్నది ఇప్పుడు కీలక ప్రశ్న.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ సమస్యలు పెరిగాయా?
విచారణ వాయిదా వేయడం బీజేపీ కష్టాలను పెంచిందని సీనియర్ జర్నలిస్ట్ రాధికా రామశేషన్ అభిప్రాయపడుతున్నారు.
''చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నిర్ణయాన్ని బట్టి, వచ్చే సాధారణ ఎన్నికలలోగా ఈ సమస్యకు పరిష్కారం లభించేలా కనిపించడం లేదు. మరోవైపు రామమందిర నిర్మాణం విషయంలో ఆ పార్టీ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది'' అని రాధిక తెలిపారు.
ఆరెస్సెస్ అఖిల భారత ప్రచార ప్రముఖ అరుణ్ కుమార్ ప్రకటనను బట్టి ఆ ఒత్తిడిని అంచనా వేయొచ్చు.
''రామమందిరంపై సుప్రీంకోర్టు త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ఆ దిశగా ఏవైనా అడ్డంకులు ఉంటే ప్రభుత్వం చట్టపరంగా మందిర నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులనూ తొలగించి, ఆ స్థలాన్ని రామ జన్మభూమి ట్రస్ట్‌కు అప్పగించాలి'' అని అరుణ్ కుమార్ అన్నారు.
విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ కూడా, ''ప్రభుత్వం చట్టం ద్వారా రామజన్మభూమిలో ఒక సువిశాలమైన ఆలయాన్ని నిర్మించే దిశగా చర్యలు తీసుకోవాలి. అది ఈ శీతాకాలంలోగా జరిగిపోవాలి'' అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER @RSSORG
ఆర్డినెన్స్ తీసుకువస్తారా?
కొన్నాళ్ల క్రితం విజయదశమి సందర్భంగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ''ప్రభుత్వం చట్టం చేసైనా, మరెలాగైనా సరే.. రామమందిరం కట్టి తీరాల్సిందే. దానిలో ఎవరి జోక్యమూ ఉండకూడదు'' అన్నారు.
రాధికా రామశేషన్, ''వీహెచ్‌పీ కానీ, ఆరెస్సెస్ కానీ మధ్యలో జోక్యం చేసుకోకుంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో మెజారిటీ వచ్చాక కూడా ఎందుకు రామమందిర నిర్మాణం జరగడం లేదని ప్రజలు ప్రశ్నిస్తారు'' అన్నారు.
గతంలో సంత్ సమాజ్, రామమందిర నిర్మాణంతో ముడిపడిన హిందూ సంస్థలు కూడా రామమందిర నిర్మాణం ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి.
హిందుస్తాన్ టైమ్స్ లక్నో రెసిడెంట్ ఎడిటర్ సునీతా అరాన్, ప్రస్తుత పరిస్థితిలో చట్టం చేయడం లేదా ఆర్డినెన్స్ ద్వారా మందిరం నిర్మాణం చేపట్టడమే బీజేపీ ముందున్న దారి అని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
హిందువుల ఓట్లను గెల్చుకోవడానికి దారి ఇదొక్కటేనా?
దీనిపై రాధిక, ''ఇప్పటికే ప్రభుత్వం సీబీఐ విషయంలో చిక్కుల్లో ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మందిర నిర్మాణం కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటుందా?'' అని ప్రశ్నించారు.
అందుకే బీజేపీకి కేంద్రం, రాష్ట్రంలో మెజారిటీ ఉన్నా కూడా రామమందిరం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.
ఆర్డినెన్స్ తీసుకురావడం ఈ సమస్యకు పరిష్కారం కాదు. ఎందుకంటే, బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లేదు. అందువల్ల ఆర్డినెన్సుకు లోక్‌సభలో ఆమోదం లభించినా, రాజ్యసభలో భంగపాటు తప్పదు. ట్రిపుల్ తలాక్ బిల్లు అందుకే ఇప్పటికీ చట్టరూపం దాల్చలేదు.
''బీజేపీ ఆర్డినెన్స్ తీసుకొచ్చినా, దాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తారు. ఈలోగా ఎన్నికలు రానే వస్తాయి'' అని సునీతా అరాన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2019 ఎన్నికలకు ముందు, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగాల్సి ఉన్నాయి.
అందువల్ల సామాన్య ఓటరును ప్రసన్నం చేసుకోవడం కోసం బీజేపీ ఆర్డినెన్సును తీసుకువచ్చే ప్రయత్నాలు చేయవచ్చు. అది చట్టంగా మారడమన్నది మరో విషయం.
దీని వల్ల బీజేపీ హిందుత్వవాద రాజకీయాలు సజీవంగా ఉంటాయి.
తద్వారా ఆ పార్టీ, 'మేం మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నాం కానీ ప్రతిపక్షాలు సమ్మతించడం లేదు' అనే సందేశాన్ని ఓటర్లకు పంపగలుగుతుంది.

‘ఆఫ్ ద రికార్డ్’ ఏమన్నారంటే..
1989 నుంచి బీజేపీ రామమందిర నిర్మాణ అంశాన్ని లేవనెత్తుతోంది. అయితే మొదటిసారిగా యూపీలో, కేంద్రప్రభుత్వంలో మెజారిటీ ఉన్నా, బీజేపీ రామమందిర నిర్మాణంపై ఒక నిర్ణయం తీసుకోలేకపోతోంది.
కొందరు బీజేపీ నేతలు 'ఆఫ్ ద రికార్డ్' మాట్లాడుతూ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తమకు అనుకూలమైన తీర్పు ఇస్తుందనే నమ్మకం ఉండిందని తెలిపారు.
రాబోయే రోజుల్లో సంత్ సమాజ్, వీహెచ్‌పీలు మందిర నిర్మాణంపై తమ ఆందోళనను ఉధృతం చేయనున్నాయి. దాంతోపాటు జనవరి 14 నుంచి అలహాబాద్‌లో కుంభమేళా జరగనుంది. ఈ నేపథ్యంలో, రామమందిర నిర్మాణం అంశంపై అనేక ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. వాటికి సమాధానం ఇవ్వడం బీజేపీకి కష్టం కావచ్చు.

మోదీపైనే బీజేపీ ఆశలు
ప్రస్తుతం బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీపైనే అన్ని ఆశలూ పెట్టుకుంది. ఎందుకంటే రామమందిరం అంశంతో దేశవ్యాప్తంగా విస్తరించిన బీజేపీ, 1993 ఎన్నికల్లో సమాజ్ వాదీ-బహుజన్ సమాజ్‌వాదీ పార్టీల కూటమి చేతిలో ఓడిపోయింది.
ఆ తర్వాత 2014 ఎన్నికల వరకు ఆ పార్టీ ఓటు బ్యాంకు తగ్గిపోతూ వచ్చింది.
''2014 సాధారణ ఎన్నికల్లోను, 2017 అసెంబ్లీ ఎన్నికలలోను ప్రజలు నరేంద్ర మోదీ మొహం చూసే ఓటు వేశారు తప్ప రామమందిరం కోసం కాదు అన్నది వాస్తవం'' అని రాధికా రామశేషన్ అన్నారు.
బీజేపీతో వచ్చిన సమస్య ఏమిటంటే ఎన్నికలు రాగానే ఆ పార్టీకి అయోధ్య, రామమందిరం గుర్తుకు వస్తాయి.
''ఎన్ని చర్చలైనా జరగనీ, 2019 సాధారణ ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దాంట్లో ఎలాంటి మార్పూ ఉండబోదు'' అని సునీతా అరాన్ అన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








