ప్రేమించుకున్నాం... కలిసి బతుకుతున్నాం: కొన్ని జంటల అనుభవాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బీబీసీ
- హోదా, తెలుగు డెస్క్
కలిసి బతకాలనుకోవడం ఇద్దరు మనుషులు పరస్పరం ఇచ్ఛతో తీసుకునే నిర్ణయం. ప్రేమ కులమతాలకు అతీతమైనదని కొన్ని ప్రేమ జంటలు తమ అనుభవాలను బీబీసీ తెలుగుతో పంచుకున్నాయి.
హైదరాబాద్‌కు చెందిన సునీల్ కుమార్ నూతలపాటి ఐటీ ఉద్యోగి. ఆయన భార్య బ్యూటీషియన్. సునీల్ ఆగస్ట్ 31న ప్రేమ వివాహం చేసుకున్నారు.
సునీల్ తన భార్యని ఎలా కలిశారు.. పెద్దలని కులాంతర వివాహానికి ఎలా ఒప్పించిందీ వివరించారు.
"తనను ఒక పెళ్లిలో కలిశాను. మా ఇద్దరివీ వేర్వేరు కులాలు. మాకు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం కలిగింది. ఈ విషయం ఇద్దరి ఇళ్లలో చెప్పాం. అయితే అమ్మాయి వాళ్ళ ఇంటిలో మొదట ఒప్పుకోలేదు. మా ఇంటిలో పెద్దగా అభ్యంతరాలు ఏమి లేవు. మా అన్నయ్య కూడా కులాంతర వివాహమే చేసుకున్నాడు.
ఒక్క సంవత్సరం పాటు మేం పెద్దల అంగీకారం కోసం ఎదురు చూసాం.
అప్పుడే నేను అమ్మాయి ఇంటికి వెళ్లి నా ఉద్యోగం గురించి, నా కుటుంబ నేపథ్యం గురించి చెప్పాను.
తనని బాగా చూసుకుంటానని నమ్మకం కలిగించగలిగాను. దాంతో ఇరుపక్షాల పెద్దలూ మా పెళ్లికి ఒప్పుకున్నారు.
ఇప్పుడు మేము, మా కుటుంబాలు కూడా ఆనందంగా ఉన్నాయి'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Suneel Kumar Nuthalapati/Facebook
"కులాంతర వివాహం అనగానే అనేక ప్రశ్నలు తలెత్తడం సహజం. కులం కన్నా అబ్బాయి వ్యక్తిత్వం, అతని కుటుంబం గురించి ప్రశ్నలు అమ్మాయి తల్లిదండ్రులను ఎక్కువ భయపెడతాయి.
ఏ తల్లి తండ్రులైనా తమ కూతురు సుఖంగా ఉండాలని ఆలోచిస్తారు. అలా కాదని ఏ ఉద్యోగమూ లేని ఎవరినో పెళ్లి చేసుకుంటానంటే ఎవరూ ఒప్పుకోరు, ఒకే కులం అయినా కూడా" అని సునీల్ అన్నారు.
నిజమైన ప్రేమికులు.. కాస్త ఒర్పుతో వ్యవహరిస్తే.. మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు కులం అనేది పెద్ద విషయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తాము అదే చేశామని వివరించారు.
"పెద్దవాళ్ళకి తమ పిల్లలు బాగుంటారు అనే భరోసా కలిగితే పెళ్లి చేయడానికి ఏ కులమైనా సందేహించరు" అని సునీల్ అన్నారు.

ఫొటో సోర్స్, Alamuru Sowmya/Facebook
మా పెళ్లి పద్ధతిని మేమే నిర్ణయించుకున్నాం
ఆలమూరు సౌమ్య బీబీసీలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ విభాగంలో ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు.
ఆమెది మతాంతర వివాహం. తమ పెళ్లికి పెద్దల నుంచి పెద్దగా అభ్యంతరాలు ఏవీ రాలేదని ఆమె తెలిపారు.
"నేను, ఫ్రాన్సిస్ కలిసి జీవించాలనుకుంటున్న విషయం మా ఇళ్లల్లో చెప్పాం. అప్పటికి ఇంకా చదువుకుంటూ ఉన్నాం కనుక ఇంకో యేడాది తరువాత పెళ్లి చేసుకుంటాం అని చెప్పాం.
మా మతాలు వేరు, కులాలు వేరు, రాష్ట్రాలు వేరు, భాష వేరు.
అందువల్ల ఏ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలి? అన్న సమస్య వచ్చింది. కన్యాదానం వంటి తంతులున్న సంప్రదాయ వివాహం వద్దు అనుకున్నాం.
దానం చెయ్యడానికి, పుచ్చుకోవడానికి నేనేమీ వస్తువును కాను.
మతాలు, కులాల మీద మా ఇద్దరికీ నమ్మకం లేదు. నన్ను మతం మార్చుకోమని ఎవరూ అడగలేదు. మా ఇంట్లో పెద్దవాళ్లు కూడా అవేమీ పట్టించుకోలేదు.
మాకు ఏ మతానికీ సంబంధించిన సంప్రదాయ పెళ్లి వద్దు అని ఇరువైపులా చెప్పాం. దానికి వాళ్లూ ఒప్పుకున్నారు. మా పెళ్లి పద్ధతిని మేమే నిర్ణయించుకున్నాం. మాకు నచ్చిన పద్ధతుల్లో పెళ్లి ప్రమాణాలు రాసుకున్నాం.
కుటుంబ సభ్యులు, బంధువులందరి సమక్షంలో మా పెళ్లి ఆనందంగా జరిగింది. తరువాత కూడా ఎప్పుడూ మత, కులపరమైన ఇబ్బందులేమీ మాకు ఎదురవలేదు. మా పాపాయికి బర్త్ సర్టిఫికేట్ లో కులం, మతం, ఇంటి పేరు ఏదీ ఇవ్వలేదు.'' అని సౌమ్య వివరించారు.

ఫొటో సోర్స్, Ramya Mathangi/Facebook
ఒకే కులమైనా పెళ్లికి ఒప్పుకోలేదు
రమ్య మాతంగి విజయవాడలో హోమియో డాక్టర్. తనది కూడా ప్రేమ వివాహమే. వీరిద్దరిది ఒకే కులం. వీరి వివాహం 2010 లో జరిగింది.
తాను తన భర్త ఒకే కులానికి చెందిన వారైనప్పటికీ ఇంటిలో పెద్దవాళ్ళు పెళ్ళికి ఒప్పుకోలేదని ఆమె తెలిపారు.
తమ కుటుంబాల మధ్య ఉన్న ఆర్ధిక వ్యత్యాసాలే ఇందుకు కారణమని వివరించారు.
తర్వాత అబ్బాయి ఉద్యోగం చూసి, చదువుకున్నాడనే భరోసాతో ఒప్పుకుని పెళ్లి చేశారని తెలిపారు.
కుటుంబ నేపథ్యాల పట్ల ఇప్పటికీ అమ్మాయి ఇంటిలో అసంతృప్తి ఉందని చెప్పారు. దీనికి కారణం కులం కాదని, ఆర్ధిక వ్యత్యాసాలే అని చెప్పారు.
రమ్య పెళ్లి తర్వాత తన అత్తింటి వారు క్రైస్తవ మతంలోకి మారారు. అయినా మతం అనేది పెద్దగా అంతరాలు సృష్టించలేదని ఆమె అభిప్రాయపడ్డారు.
తాను భర్తతో సంతోషంగా ఉన్నాను కనుక తన విషయంలో తల్లి తండ్రులకు పెద్దగా భయాలు లేవని చెప్పారు.
"అబ్బాయి గాని అమ్మాయి గాని మంచి ఉద్యోగంలో ఉంటే.. లేదా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అయితే కులం అనే పట్టింపే ఉండదు. బంధువులు కూడా.. కులం వేరే అయితే ఏమైంది, మంచి ఉద్యోగంలో ఉన్నారు కదా అని చెప్పి మరీ పెళ్లి చేయిస్తారు" అని ఆమె తెలిపారు.
ఈ రోజుల్లో పెళ్ళిలో కులం పాత్ర చాలా తక్కువ అని అభిప్రాయపడ్డారు.

పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ జర్నలిస్ట్ ప్రేమ కథ..
అప్పట్లో నేను హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మీడియా సంస్థలో జర్నలిస్టుగా పనిచేసేవాణ్ని.
నేను ప్రేమించిన అమ్మాయి కుటుంబంతో.. నేను, మీ అమ్మాయి అయిదేళ్లుగా ఒకర్నొకరు ఇష్టపడుతున్నాం.
పెళ్లి చేసుకోవాలనకుంటున్నామని చెప్తే, కులం కారణం చూపి వివాహానికి నిరాకరించారు అప్పటి న్యాయవాది, ఇప్పటి మా మామగారు.
నా కుటుంబంలో అంతా విద్యావంతులే. నా గురించి వాకబు చేసుకోండని విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదు.
మొదట బెదిరించి, తర్వాత బతిమాలి ఆ తర్వాత 'తుది' నిర్ణయాన్ని వాయిదాలు వేస్తూ పెళ్లి జరగకుండా వాయిదా వేస్తూ వచ్చారు.
'నువ్వు చదువుకున్నవాడివే, మంచి ఉద్యోగం, తెలివైనవాడివే. కానీ కులం కాని వాడికి నా కూతుర్నిచ్చి నా బంధవులకు ఏం చెప్పను' అని ప్రశ్నించిన మామగారికి నేను చెప్పిన ఏ సమాధానమూ రుచించలేదు.
పెళ్లి చేసుకుంటామని చెప్పి ఐదేళ్లపాటు వేచి చూసిన అనంతరం, ఇద్దరికీ 30 ఏళ్లు దాటేంతవరకు వేచి చూసిన మేం ఇక గత్యంతరం లేక గుళ్లో పెళ్లి చేసుకున్నాం.
పెళ్లి చేసుకున్న మరుక్షణం నేను మా మామగారికే ఫోన్ చేసి విషయం చెప్పాను. అవతలి వైపు ఆయన మౌనమే సమాధానమయ్యింది. ఇప్పుడు పెళ్లై నాలుగేళ్లు దాటిపోయినా మామగారి అలక మాత్రం ఇంకా కొనసాగుతోంది.
ఇంతవరకు మళ్లీ మామగారు నేను ముఖాముఖి ఎదురుపడలేదు. నన్ను పెళ్లి చేసుకొని తన కూతురు ఎంత ఆనందంగా ఉందో పుట్టింటికొచ్చినప్పుడు కూతురు కళ్లలో ఆ తండ్రికి కనబడటం లేదా అన్న ప్రశ్న అప్పుడప్పుడు నన్ను వేధిస్తోంది.
మామగారు ఎప్పటికైనా మాట్లడకపోతారా అని నాకు నేనే సర్ది చెప్పుకుంటున్నాను.

ఫొటో సోర్స్, DV Ramakrishna Rao
‘కుల రహిత, మత రహిత..’ హక్కు కోసం పోరాటం
మతాంతర వివాహం చేసుకున్న డీవీ రామకృష్ణ రావుగారు తమ పిల్లలకు ఎలాంటి కుల, మతపరమైన గుర్తింపు ఉండకూడదంటూ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆయన ప్రేమ, పెళ్లి, న్యాయపోరాటం గురించి ఆయన మాటల్లోనే..
''నేను హైదరబాద్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్నాను. తొలి ఉద్యోగం పురుగుల మందుల కంపెనీలో. పర్యావరణ దృష్టితో నేను ఆ పురుగులమందుల ఉద్యోగం వదిలి 1996 లో సీడబ్యూఎస్ అనే స్వచ్చంద సంస్థలో చేరాను. ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివిన క్లారెన్స్ ఉద్యోగాన్వేషణలో భాగంగా హైదరాబాద్ వచ్చింది. తన కామన్ ఫ్రెండ్ ద్వారా మాకు పరిచయమైంది. ఆ స్నేహం ప్రేమగా పరిణమించి, 17 అక్టోబర్ 2000 న మా పెళ్లికి దారి తీసింది.''
''మా కుల, మత నేపథ్యాలు వేరు కావడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. క్లారెన్స్‌ది దళిత , క్రిస్టియన్ నేపథ్యం. నాది హిందూ బ్రాహ్మణ నేపథ్యం. తనకు మత విశ్వాసాలు ఉన్నాయి. నాకు ఏ మత విశ్వాసాలూ లేవు. వాళ్ళ నాన్నగారు - 'మీ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమతో మెలిగితే అదే సంతోషం' అన్నారు. అయితే మా వాళ్లకు పట్టింపులు ఎక్కువ.''
''నా పెళ్లి విషయం చెప్పినపుడు ఇంటిల్లిపాదీ బాధ పడ్డారు. పెళ్ళి ముందు రోజు వరకు నాకు చెప్పి చూసారు. మా స్టేజ్ మ్యారేజ్ చాలా తక్కువ ఖర్చుతో అంటే, కేవలం 11వేల 500 వందల రూపాయల ఖర్చుతో, ఒక రెండు వందల మంది బంధు మిత్రుల సమక్షంలో, ఎలాంటి కుల, మత పద్ధతులతో సంబంధం లేకుండా జరిగింది. బోలెడు కన్నీళ్లు , బోలెడు బాధ.. ఆ తరవాత అంతా నెమ్మదిగా కలిసిపోయాం. ’’
‘‘మా పిల్లల విషయంలో స్కూల్ , కాలేజ్ అప్లికేషన్‌లలో తల్లిదండ్రులలో ఎవరో ఒకరి మతం రాయాలని అన్నపుడు, మేం 'కుల రహితం, మత రహితం' అని ప్రకటించుకునే హక్కు కోసం, అలా కోరుకునే మాలాంటి వాళ్లందరి హక్కు కోసం కోర్టులో పోరాడుతున్నాం'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Deepthi Bathini
బీబీసీ రిపోర్టర్ దీప్తి బత్తిని కులాంతర వివాహం చేసుకున్నారు.
తాను, తన భర్త ప్రొఫైల్ మాట్రిమోనీ సైట్‌లో చూసి కలిసి మాటలాడుకున్న తర్వాత ఇద్దరి ఇళ్లల్లో చెప్పామని దీప్తి చెప్పారు.
దీనికి ఇరువైపుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాలేదు.
తమ వివాహం 2013 లో అయిందని.. కులం కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని ఆమె వివరించారు.
‘‘నేను వారి నమ్మకాలను విమర్శించను. వారు నా నమ్మకాలకు, అభిప్రాయాలకు విలువ ఇస్తారు. అందువల్ల జీవితం సాఫీగా సాగిపోతోంది’’ అని దీప్తి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








