కొండపల్లి కోటేశ్వరమ్మ: ‘వందేళ్ల విలువల వంతెన’

కొండపల్లి కోటేశ్వరమ్మ

ఫొటో సోర్స్, saarangabooks

    • రచయిత, బీబీసీ తెలుగు డెస్క్
    • హోదా, .

తెలుగునాట అనేక ఉద్యమాలతో సుదీర్ఘ అనుబంధమున్న కొండపల్లి కోటేశ్వరమ్మ మరణించారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటేశ్వరమ్మ ఇవాళ (సెప్టెంబర్ 19) తెల్లవారుజామున విశాఖపట్నంలోని మనుమరాలు అనూరాధ ఇంట తుదిశ్వాస విడిచారు. ఆమె కోరిక మేరకు మృతదేహాన్ని కెజిహెచ్ ఆస్పత్రికి అప్పగిస్తున్నారు.

ఆమె ఇటీవలే శతవసంతాలు పూర్తి చేసుకున్నారు. నూరో జన్మదినానికి కమ్యూనిస్టు ఉద్యమంలోని వివిధ శ్రేణుల వారు హాజరై జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఆమె 92వ ఏట తన జీవితగాథను 'నిర్ఙన వారధి' పేరిట అక్షరబద్ధం చేశారు. 'జ్ఞాపకాలను తట్టి లేపితే కన్నీటి వూట ఉబికి వచ్చే జీవితం నాది' అంటారామె ఆ పుస్తకంలో.

జీవితం పొడవునా కష్టాలతో ఎదురీదిన జీవితం ఆమెది.

కొండపల్లి కోటేశ్వరమ్మ

ఫొటో సోర్స్, Hyderabad Book Trust

జాతీయోద్యమం, సంఘ సంస్కరణోద్యమం, కమ్యూనిస్టు, నక్సల్‌బరీ ఉద్యమాలతో పెనవేసుకున్న జీవితం ఆమెది.

పెళ్ళి అంటే తెలియని వయసులో ఏడేళ్లకే మేనమామతో వివాహమై, రెండేండ్లకే అతను మరణించడంతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువు కొనసాగించారామె.

జాతీయోద్యమంలో భాగంగా యువజన సంఘాలలో తిరిగే కొండపల్లి సీతారామయ్యతో ఆమెకు పునర్వివాహం జరిగింది. క‌మ్యూనిస్ట్ పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి భ‌ర్తతో క‌లిసి కోటేశ్వరమ్మ విశేషంగా కృషి చేశారు.

తెలంగాణ సాయుధ‌ పోరాటంలోనూ ఆమె కీల‌క పాత్ర పోషించారు. అనేక ఏళ్ల పాటు అండ‌ర్ గ్రౌండ్‌లో ఉండి పార్టీ కోసం శ్ర‌మించారు.

అనంతరం నక్సలైట్ ఉద్యమ నాయకుడిగా మారి వైయక్తిక జీవనంలో సీతారామయ్య దూరం కావడంతో ఒడిలో పసిపిల్లాడితోనే ఆమె రహస్య జీవితం గడిపాల్సి వచ్చింది.

తెలంగాణ సాయుధ పోరాటం త‌ర్వాత క‌మ్యూనిస్టు పార్టీ రెండుగా చీలింది. తర్వాత్తర్వాత మళ్లీ చీలికలతో నక్సల్బరీ ఉద్యమం ఆరంభమైంది. కొండపల్లి సీతారామయ్య వేరొకరితో సహజీవనం చేయడం ప్రారంభించారు.

ధైర్యం కోల్పోని కోటేశ్వరమ్మ 35 ఏళ్ల వయసులో ఆంధ్ర మహిళా సభలో మెట్రిక్‌లో చేరారు. చదువుకుంటూనే క‌థ‌లు రాయ‌డం, రేడియోలో కార్య‌క్ర‌మాల ద్వారా వ‌చ్చే కొద్దిపాటి సొమ్ముతో జీవ‌నాన్ని కొన‌సాగించారు. ఆ క‌ష్ట‌కాలంలోనూ ఆమె సీపీఐ, సీపీఎం పార్టీల‌కు నెల‌కు ప‌ది రూపాయ‌ల విరాళాన్ని ఇచ్చేవారు. మెట్రిక్ పూర్తయ్యాక జీవనోపాధి కోసం కాకినాడ బాలికల పాలిటెక్నిక్‌లో మేట్రన్‌గా చేరారు.

కొండపల్లి సీతారామయ్య పార్లమెంటరీ రాజకీయాల నొదిలి సాయుధ పోరాటం చేపట్టి నక్సలైట్ పార్టీ నాయకుడిగా ఉన్నారు. కుమారుడు చంద్రశేఖర ఆజాద్ కూడా అందులోనే నాయకుడిగా ఉన్నారు. అప్పట్లో పోలీసులు నక్సలైట్ నేతలపై పెట్టిన పార్వతీపురం కుట్ర కేసులో తండ్రీ కొడుకులు ఇద్దరూ ముద్దాయిలుగా ఉన్నారు. ఒక దశలో వరుసగా విషాదాలు ఆమె జీవితాన్ని వెంటాడాయి.

కొండపల్లి కోటేశ్వరమ్మ

ఫొటో సోర్స్, saarangabooks

కుమారుడు చంద్రశేఖర్ నక్సలైట్ ఉద్యమంలో మరణించారు. ఢిల్లీలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ పెట్టి సాహిత్య సేవ చేస్తూ అందుకోసం విజయవాడ వచ్చిన అల్లుడు రమేష్ బాబు అనూహ్యంగా జ్వరంతో మరణించారు. విషాదాలను తట్టుకోలేక కూతురు కరుణ కూడా ఇద్దరు పిల్లల్ని వదిలేసి ఆత్మహత్య చేసుకున్నారు. వాటన్నిటినీ తల్చుకుంటూ 'నా పెళ్ళిచేసిన అమ్మలేదు. పెళ్ళికి గుర్తుగా పుట్టిన పిల్లలూ లేరూ. నా పెళ్ళే ఒక కలేమో' అంటారు కోటేశ్వరమ్మ తన ఆత్మకథ ‘నిర్జన వారధి’లో. వారి ఇల్లు కమ్యూనిస్టు కార్యకర్తలకు శిబిరంగా ఉండేది.

ఆమె ఆత్మకథను ఆంగ్లంలోకి 'ద షార్ప్ నైఫ్ ఆఫ్ మెమ‌రీ'గా అనువ‌దించారు. జీవితంలోని అత్యంత సున్నితమైన సంక్లిష్టమైన సన్నివేశాలను చెపుతున్నపుడు ఆమె చూపించిన సంయమనం గొప్పదని విశ్లేషకులనేకులు అభిప్రాయపడ్డారు.

ఇటీవలే శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 'ప్రజాశక్తి'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె.. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావుతో పాటు సహచరులైన మహిళాకార్యకర్తలూ తనకు ఎన్నో విషయాల్లో స్ఫూర్తినిచ్చారని తెలిపారు.

ఆమె శతజయంతి సందర్భంగా ప్రముఖ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్ ఆమెను 'స్వయం విద్యా స్వరూపిణి, జ్ఞాన రూపిణి, వక్రించే సమాజ పరిస్థితుల పట్ల ఉగ్రరూపిణి' అని ప్రస్తుతించారు.

ప్రముఖ విప్లవ కవి వరవరరావు.. ఆమె వందేళ్ల విలువల వంతెన అన్నారు.

''పురుష సంబంధమైన రెండు దుఃఖాలు ఆమెను జీవితమంతా వెంటాడాయి. కోటేశ్వరమ్మ వ్యక్తిత్వం అంతా ఆ రెండింటిని అధిగమించి ఆమె తనదైన ఒక స్వతంత్ర వ్యక్తిత్వాన్ని రూపొందించుకుని తనకు నచ్చిన జీవితాన్ని గడపడంలో ఉంది'’ అని వరవరరావు అన్నారు.

కోటేశ్వరమ్మ మరణంతో ఒక నిబద్ద పోరాట జీవితం ముగిసిందని అనేక కమ్యూనిస్టు స్రవంతులకు చెందిన కార్యకర్తలు ప్రేమగా గౌరవంగా ఆమె జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. జయప్రకాశ్ నారాయణ మృతి సందర్భంగా కాళోజీ రాసిన ‘పుటక నీది, చావు నీది, బతుకంతా దేశానిది’ అనే వాక్యాలకు నిజమైన నిదర్శనం అని అభిమానులు కొండపల్లి కుటుంబం కమ్యూనిస్టు ఉద్యమానికి చేసిన సేవను గుర్తుచేసుకుంటూ ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)