అమ్మాయిల ప్రశ్న: ‘బాయ్స్ హాస్టల్స్‌లో లేని రూల్స్ మాకెందుకు?’

కను ప్రియ, పంజాబ్ యూనివర్సిటీ

ఫొటో సోర్స్, Kanu Priya

    • రచయిత, మీనా కొత్వాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.

ఈ ఎన్నికల్లో అన్ని విద్యార్థి సంఘాలు తమ అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

కానీ ఈ ఏడాది విద్యార్థి ఎన్నికల్లో అత్యంత అసాధారణ ఫలితం చండీగఢ్‌లో వెలువడింది.

చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో, ఆ యూనివర్సిటీ చరిత్రలోనే మొదటిసారిగా ఒక యువతి అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఎస్‌కు చెందిన కను ప్రియ ఏబీవీపీ ప్రత్యర్థిపై 719 ఓట్ల తేడాతో విజయం సాధించి, యూనివర్సిటీ చరిత్రలో మొదటి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

కను ప్రియ పంజాబ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ సెకండియర్‌ చదువుతున్నారు.

22 ఏళ్ల కను ప్రియది పంజాబ్‌లోని తార్న్ తరన్ సాహిబ్ జిల్లాలోని పట్టి గ్రామం. ఆమె 2015లో స్టూడెంట్ ఫర్ సొసైటీ(ఎస్‌ఎఫ్‌ఎస్) విద్యార్థి సంఘంలో చేరారు.

బీజేపీ విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి చెందిన ఆశిష్ రాణాపై ఆమె 719 ఓట్ల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించారు.

బీబీసీతో మాట్లాడుతూ కను.. పంజాబ్ యూనివర్సిటీలో యువతులకు అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం లభించదన్నారు.

''యూనివర్సిటీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులను ఎప్పుడూ దూరంగా పెడుతూ వస్తున్నారు. మొట్టమొదటి ఆ అడ్డుగోడలను బద్దలుకొట్టాం'' అని ఆమె బీబీసీకి తెలిపారు.

కను ప్రియ, పంజాబ్ యూనివర్సిటీ

ఫొటో సోర్స్, Kanu Priya

ఎందుకు ఎస్‌ఎఫ్‌ఎస్‌ను గెలిపించారు?

ఈ నెల 6వ తేదీన పంజాబ్ యూనివర్సిటీలో ఆరు స్థానాలకు (అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులు) ఎన్నికలు జరిగాయి.

ఈ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఎస్‌తో పాటు ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ, పీయూఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌పీయూలు కూడా పాల్గొన్నాయి.

ఎస్‌ఎఫ్‌ఎస్ తప్ప ఏ పార్టీ కూడా అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు యువతులకు సీటు ఇవ్వలేదని కను ప్రియ తెలిపారు. కేవలం ఎస్‌ఎఫ్‌పీయూ మాత్రం ఒక మహిళా అభ్యర్థిని ఉపాధ్యక్ష పదవి పోటీలో నిలిపింది.

ఎస్‌ఎఫ్‌ఎస్‌ కేవలం అధ్యక్ష పదవికి మాత్రం తన అభ్యర్థిని పోటీలో నిలబెట్టింది.

2010 నుంచి యూనివర్సిటీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్న ఎస్‌ఎఫ్‌ఎస్‌, 2014 నుంచి ఎన్నికలలో పాల్గొంటోంది.

కను ప్రియ, పంజాబ్ యూనివర్సిటీ

ఫొటో సోర్స్, Kanu Priya/Facebook

ఎస్‌ఎఫ్‌ఎస్‌ది వామపక్ష భావజాలం అని స్పష్టం చేసిన కను ప్రియ, అయితే తాము ఏఐఎస్‌ఐకు మాత్రం అనుబంధం కాదని స్పష్టం చేశారు.

''ఇప్పటివరకు మేం నాలుగుసార్లు ఎన్నికల్లో పోటీ చేశాం. వాటిలో మూడుసార్లు మహిళా అభ్యర్థులు అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. అందువల్లే మా పార్టీని ఇతర పార్టీలకు భిన్నంగా చూసేవారు. ఎట్టకేలకు మేం మా లక్ష్యాన్ని సాధించాం'' అని కను ప్రియ తెలిపారు.

ఇది కేవలం తన వ్యక్తిగత విజయం కాదని, మొత్తం తమ విద్యార్థి సంఘానిది అన్నారు.

యూనివర్సిటీలో చాలా మంది ఒక యువతి అధ్యక్ష పదవికి ఎన్నిక అవుతుందని ఊహించలేదు. కానీ వాళ్లందరి అంచనాలను కను తలక్రిందులు చేశారు.

''నేను యూనివర్సిటీలో చేరాకే నాకు రాజకీయాల్లో ఆసక్తి పెరిగింది. ఇక్కడ ఎన్నో విద్యార్థి సంఘాలు ఉన్నా, బాగా పని చేసే సంఘంలో చేరాను'' అని తెలిపారు ఆమె.

విద్యార్థి సంఘాల ఎన్నికల్లో కూడా ధనప్రభావం పెరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముందు విద్యార్థులను బయటకు తీసుకెళ్లి సినిమాలు చూపిస్తున్నారని తెలిపారు.

అవన్నీ చేయకపోయినా, తాను విజయం సాధించానన్నారు. ''ప్రచారంలో మేం విద్యార్థులను కలిసి మాట్లాడేవాళ్లం. వాళ్ల సమస్యలను తెలుసుకునే వాళ్లం. మేం డబ్బును కూడా ఎక్కువగా ఖర్చు పెట్టలేదు. ఎన్నికలకు నేను కేవలం రూ.3000 మాత్రమే ఖర్చు పెట్టాను. అది కూడా విద్యార్థుల నుంచే సేకరించాం'' అని తెలిపారు.

కను ప్రియ, పంజాబ్ యూనివర్సిటీ

ఫొటో సోర్స్, Kanu Priya

ఫొటో క్యాప్షన్, ఎన్నికల్లో ఎస్‌ఎఫ్ఎస్ మేనిఫెస్టో

కను ప్రియ విద్యార్థులకు ఏమేం హామీలు ఇచ్చారు?

''విద్యార్థులు కేవలం మేం ఈ ఏడాది చేసిన పనిని మాత్రమే చూడలేదు, 2010 నుంచి మేం చేస్తూ వస్తున్న పనులను చూశారు. మేం సమాజంలో ఉంటూ, విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడుతాం. యూనివర్సిటీ విద్యార్థులకు విద్యార్థుల సమస్యల మీద పోరాడేవాళ్లే అవసరం. వాళ్లకు ఏ మంత్రి కానీ, పార్టీ కానీ అవసరం లేదు'' అని కను ప్రియ వివరించారు.

యూనివర్సిటీలో విద్యార్థినుల భద్రత మీద ప్రధానంగా దృష్టి పెడతానని కనుప్రియ తెలిపారు. ఇప్పటివరకు పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నవాళ్లకే హాస్టల్‌లో సీటు దొరుకుతోంది. ఈ పరిస్థితిని మారుస్తారని ఆమె అన్నారు.

''ఈ హాస్టల్ కేటాయింపు పద్ధతిని మార్చాలనుకుంటున్నాము. దీనిని మొత్తం ఆన్‌లైన్ చేసి.. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో, ఎవరు ఉంటున్నారో అందరికీ తెలిసేలా చేయాలనుకుంటున్నాము. అంతే కాదు, బాయ్స్ హాస్టల్ రాత్రంతా తెరిచే ఉంటుంది. మరి అలాంటప్పుడు మా హాస్టల్ కూడా అలా ఎందుకు తెరిచి ఉంచరు?'' అని ఆమె ప్రశ్నించారు.

విద్యార్థినులు లైబ్రరీకి, ఇతర హాస్టల్స్‌కు వెళ్లడంపై ఉన్న నిర్బంధాలు కూడా ఎత్తేయడానికి ప్రయత్నిస్తామన్నారు.

తన గెలుపును సాధారణ విజయంగానే చూస్తానని కనుప్రియ తెలిపారు.

కానీ పంజాబ్ యూనివర్సిటీ చరిత్రలో మాత్రం ఇది అసాధారణ విజయం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)