BBC EXCLUSIVE: ‘రాహుల్ గాంధీ పరిణతి చెందారు’

- రచయిత, ప్రదీప్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఒకప్పుడు చాలా సన్నిహిత నేత అని భావించేవారు.
రాహుల్ గాంధీకి ఆయనను రాజకీయ మార్గదర్శిగా చెప్పేవారు. కానీ రాహుల్ గాంధీ కొత్త టీంలో ఆయన లేరు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నుంచి బయటకు రావడాన్ని దిగ్విజయ్ సింగ్ పెద్ద విషయంగా భావించడం లేదు.
బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, రాహుల్ గాంధీ రాజకీయాలు, కాంగ్రెస్‌లో తన పాత్రపై అభిప్రాయాలు పంచుకున్నారు.
2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో వ్యక్తుల కేంద్రంగా పోటీ ఉండదన్న దిగ్విజయ్ సింగ్, ఈసారీ పార్టీల ఐడియాలజీల మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. ఈ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ స్థానం ఎక్కడ అనే విషయంపై కూడా ఆయన తన అభిప్రాయం చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ: రాహుల్ గాంధీ సభలో అవిశ్వాస తీర్మానం సమయంలో ఇచ్చిన ప్రసంగం గురించి మీరేమంటారు?
రాహుల్ గాంధీ బాడీ లాంగ్వేజ్ సరిగానే ఉంది. ఆయన కంపోజ్డ్‌గా కనిపించారు. తన ఇంగ్లీష్, హిందీ ప్రసంగంతో ప్రధానమంత్రిని బోనులో నిలబెట్టారు. ప్రధాని తన జవాబిచ్చేందుకు కూడా తడబడ్డారు. మోదీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు.
రాహుల్ అన్నిటికంటే మొదట రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ డీల్ గురించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ ఈ ప్రశ్న అడుగుతోంది.
ఎంత ధరకు ఈ విమానాలు కొన్నారు? కొనుగోళ్లలో ప్రామాణిక నిబంధనలు పాటించారా? సెక్యూరిటీ కమిటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారా? ధరలపై సంప్రదింపుల కమిటీ ధరల గురించి నెగోషియేట్ చేసిందా లేదా? 60 వేల కోట్లు నుంచి 70 వేల కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నప్పుడు వాటిలో ఎలాంటి జాగ్రత్తలు పాటించారో? చెప్పాలని కాంగ్రెస్ ప్రశ్నించింది. కానీ వారు జవాబు చెప్పలేదు.
అది కాకుండా రాహుల్ గాంధీ మూకదాడుల అంశాన్ని కూడా లేవనెత్తారు. చిన్న విషయాలకే ట్వీట్ చేసే మోదీ మూకదాడుల గురించి మౌనంగా ఎందుకున్నారు. శుక్రవారమే ఒక వ్యక్తిని దాడి చేసి చంపేశారు.
ఇది ఒక విధంగా అరాచక పరిస్థితి
బీబీసీ: రాహుల్ గాంధీ అన్ని అంశాలూ లేవనెత్తారు. కానీ ఆయన ప్రధాన మంత్రిని ఆలింగనం చేసుకున్నారు. తర్వాత కన్ను కొట్టారు. అలా చేయడం వల్ల రాహుల్ ఆరోపణల తీవ్రత తగ్గిపోతుందా?
రాహుల్ గాంధీ తన ప్రసంగం చివర్లో తనకు భారత సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునే అవకాశం కల్పించినందుకు బీజేపీ, ఆరెస్సెస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అంటే ఎవరైనా మనల్ని విమర్శించినా వారితో సహృదయంతో ఉండాలి. అది చూపించడానికే ఆయన ప్రధాని సీటు వరకూ వెళ్లారు. చేయి కలిపారు. నేను మీకు వ్యతిరేకంగా మాట్లాడాను, కానీ నా మనసులో మీపట్ల ఏమీ లేదు అని చెప్పడానికే ఆలింగనం చేసుకున్నారు.
ఇక కన్ను కొట్టే విషయానికి వస్తే, అది పూర్తిగా వేరే విషయం. ఆ రెండింటికీ ఎలాంటి సంబంధం లేదు. స్నేహితులకు అలా చేస్తుంటారు. అదంత పెద్ద విషయమేం కాదు.

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ:రాహుల్ గాంధీకి దగ్గరగా మీరు 13-14 ఏళ్ల పాటు పనిచేయడం చూశాం. మీరు ఆయన రాజకీయ మార్గదర్శి అని కూడా అంటుంటారు...
(మధ్యలోనే కల్పించుకుని) లేదు, నేను ఆయన రాజకీయ గైడ్‌ను కాను. అది మీడియా చేసిన ప్రచారం.
బీబీసీ: మీరు రాహుల్‌తో సన్నిహితంగా ఉన్నారు. దాని ప్రకారం ఒక రాజకీయ నేతగా ఆయన ఎంత మెచ్యూర్ అయ్యారంటారు?
ఆయన చాలా మెచ్యూర్ అయ్యారు. చాలా తేడా వచ్చింది. ఆయనలో రాజకీయ అవగాహన పెరిగింది. వాటిని బాగా అర్థం చేసుకున్నారు.
బీబీసీ: ఆయన మెచ్యూర్ అయ్యారు, కానీ మీరు ఆయన టీమ్‌లో లేరు. దానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
నేను మీకు 2011లో కాంగ్రెస్ సెషన్ గురించి చెబుతా. అప్పుడు నేను "రాహుల్ జీ, మీరు పార్టీకి నేతృత్వం వహించండి, కొత్త కాంగ్రెస్‌ను నిర్మించండి అన్నాను. మీ కొత్త టీమ్ ఏర్పాటు చేయండి. అహ్మద్ పటేల్, గులామ్ నబీ ఆజాద్, నాలాంటి వారికి రిటైర్మెంట్ ఇవ్వండి" అని అడిగా.
నేను అప్పటినుంచి ఇది చెబుతూనే ఉన్నా. ఈ రోజు కూడా నేను ఆ మాటకే కట్టుబడి ఉంటా.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఎవరున్నారు, ఎవరు లేరు అనేది ఇక్కడ ప్రశ్న కాదు. భారతీయ జనతా పార్టీతో పోటీపడేందుకు, వారిని ఓడించేందుకు మాకు సత్తా ఉందా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న.

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ: భారతీయ జనతా పార్టీకి పోటీ ఇచ్చే దిశగా కాంగ్రెస్ ప్రస్తుతం ఎక్కడుంది?
కాంగ్రెస్ పూర్తి సన్నాహాల్లో ఉంది, పార్టీ అధ్యక్షుడు ఈ సవాలు కోసం రకరకాల వారితో బృందాలు ఏర్పాటు చేశారు. అవి తమ పని చేస్తున్నాయి.
బీబీసీ: 2019 ఎన్నికలు చూస్తుంటే, ఒక పెద్ద ప్రశ్న కూడా వస్తుంది. మీ విపక్షాలన్నీ ఒక్క తాటిపైకి రాగలవా? దీనికి సంబంధించిన మరో ప్రశ్న, రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా స్వీకరిస్తారా?
మీరు 2014 ఎన్నికలనే తీసుకుంటే, అక్కడ బీజేపీకి కేవలం 31 శాతం ఓట్లే వచ్చాయి. అప్పుడు వారికి 283 సీట్లు వచ్చాయి. 69 శాతం ఓట్లు విపక్షాలకు లభించాయి.
ఈ సారీ తెలుగుదేశం, శివసేన లాంటి పార్టీలు కూడా బీజేపీని వదిలి బయటికొచ్చేశాయి.
ఇక ప్రతిపక్ష నేత విషయానికి వస్తే, 2019 ఎన్నికలు వ్యక్తులు కేంద్రంగా, పర్సనాలిటీ ఆధారంగా జరగవు. ఆ ఎన్నికలు ఐడియాలజీ ఆధారంగానే జరుగుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ: మొదటి సారి ప్రతిపక్షాలు ఇంత బలహీనంగా కనిపిస్తున్నాయి కాబట్టే, అధికార పక్షంలో అంత దూకుడు కనిపిస్తోందా?
కేంద్ర ప్రభుత్వం దగ్గర మీడియాను మేనేజ్ చేసేందుకు కోట్ల ప్యాకేజీ ఉంటుంది. అందుకే ప్రతిపక్షాలు బలహీనంగా కనిపిస్తున్నాయి.
ప్రతిపక్షాల దగ్గర ఎలాంటి ప్యాకేజీలు ఉండవు. పత్రికల్లో మా వార్తలు చిన్న కాలమ్‌లో వేస్తారు. వాళ్లవి ఐదారు కాలమ్ పెట్టి వేస్తారు. దానివల్ల కూడా తేడా కనిపిస్తుంది.
టీవీ ఛానళ్లలో ప్రతిపక్షాల వార్తలేవీ కనిపించవు. అందుకే అవి బలహీనంగా కనిపిస్తాయి.
ఇవి కూడా చదవండి:
- లోక్‌సభలో నిన్న ఏం జరిగింది? అవిశ్వాసంలో ఎవరేమన్నారు?
- ‘చంద్రబాబు మా మిత్రుడే.. కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టడం చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది’
- BBC Special: బోనాల్లో 'రంగం' చెప్పే మాతంగి స్వర్ణలత ఎవరు?
- 5,300 ఏళ్ల కిందటి మంచుమనిషి చివరిగా ఏం తిన్నాడు?
- విట్టెనూమ్: ‘ఈ పట్టణం ఖాళీ.. అక్కడకు వెళ్లారా అంతే’
- వాట్సప్: 'ఇక మెసేజీని ఐదుసార్లకు మించి ఫార్వర్డ్ చేయలేరు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








