అంధత్వం: మేనరికాలు, దగ్గరి సంబంధాలు.. పుట్టబోయే పిల్లలకు శాపం
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్‌లోని దేవనార్ అంధుల పాఠశాల. ఇక్కడ ఉన్న అంధ బాలబాలికల్లో మూడొంతుల మంది మేనరికాలు, దగ్గరి సంబంధాల వల్ల పుట్టినవారే!
మేనరికం పెళ్లిళ్లతో సమస్యలు వస్తాయని చాలా మందికి తెలుసు కానీ.. అవి ఎంత తీవ్రంగా ఉంటాయో తెలిపే ఉదాహరణ ఇది!
దేవనార్ ప్రపంచంలోనే పెద్ద అంధుల పాఠశాల అని చెబుతోంది యాజమాన్యం. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు ఎల్‌కేజీ నుంచి ఇంటర్ వరకూ చదువుతుంటారు.
మొత్తం 463 మంది విద్యార్థుల్లో 313 మంది తల్లిదండ్రులు దగ్గరి సంబంధాల్లో పెళ్లి చేసుకున్నవారే. అంటే ఈ విద్యార్థుల్లో 68 శాతం మంది మేనరికాలు లేదా దగ్గరి సంబంధాల వల్ల పుట్టిన వారే.
భారతదేశంలో.. అందునా దక్షిణాదిన మేనరికాలు ఎక్కువ. ముస్లింలలో దగ్గర బంధువుల మధ్య పెళ్లిళ్లు చాలా ఎక్కువ.
దక్షిణ భారతంలో అన్నదమ్ముల పిల్లలను అక్క చెల్లెళ్ల పిల్లలకు ఇవ్వడం.. మేనకోడలిని మేనమామకు ఇవ్వడం ఉంది.
ముస్లింలలో అన్నదమ్ముల పిల్లల మధ్య పెళ్లిళ్ళు జరుగుతాయి.
ఇలా దగ్గర బంధువుల మధ్య జరిగే పెళ్లిళ్లను కన్‌సాన్‌జీనియస్ మేరేజెస్ అంటారు. ఈ రకమైన పెళ్లిళ్ళ వల్ల జన్యుపరమైన సమస్యలు వస్తుంటాయి.

దగ్గరి రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లతో జన్యులోపాలు
తల్లితండ్రుల నుంచి పిల్లలకు, అలా తరతరాలకు డీఎన్ఏ వెళుతుంది. దగ్గర సంబంధాల పెళ్లిళ్ల వల్ల జన్యువుల మ్యుటేషన్ తక్కువగా ఉంటుంది. దాంతో వారికి వంశ పారంపర్య జబ్బులను తట్టుకునే శక్తి తగ్గుతుంది. అలాంటి వాటిలో అంధత్వం ముఖ్యమైనది, తీవ్రమైనది.
మ్యుటేషన్ అంటే.. జన్యువు నిర్మాణం మారినప్పుడు రకరకాల మార్పులు వస్తాయి. అవి కొత్త తరానికి వెళతాయి. డీఎన్ఏలోని సింగిల్ బేస్ యూనిట్లు మారడం.. జన్యువులు, క్రోమోజోములు కొత్తగా అమరడం, కొత్తవి చేరడం, పాతవి కొన్ని పోవడం జరుగుతాయి.
రక్త సంబంధాలు దగ్గరగా ఉండే వారి మధ్య పెళ్లిళ్లు జరిగినప్పుడు.. భార్యాభర్తలు ఇద్దరిలోనూ ఒకే మూల జన్యువులు ఉంటాయి. ఎక్కువ తరాల మధ్య మేనరికాలు జరిగే కొద్దీ జన్యు మార్పులకు అవకాశం తగ్గిపోతూ ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
డీఎన్ఏ ఫౌండర్ ఈవెంట్.. అంటే వంశంలో బాగా పూర్వీకుల డీఎన్ఏ అమరికలు అలానే ఉంటాయి. అంటే మ్యుటేషన్ జరగదు. బయటి సంబంధాలు చేసుకున్న తరంలో మార్పిడికి అవకాశం ఉంటుంది.
"అడ్మిషన్ల కోసం, పిల్లలను కలవడం కోసం తల్లిదండ్రులు వస్తుంటారు. వారితో మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. వారిలో చాలా మంది మేనరికాలు చేసుకున్నారు. ఈ విషయమై అందరి పిల్లలపై అధ్యయనం చేయాలనుకున్నాం’’ అని చెప్పారు దేవనార్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సాయిబాబా గౌడ్.

ఆ తల్లదండ్రుల ముందు తరం వారూ మేనరికాలే...
‘‘తల్లితండ్రులందరికీ ఫోన్ చేసి విషయం కనుక్కున్నాం. కొందరిలో అయితే కేవలం తల్లిదండ్రులే కాకుండా వారి ముందు తరం కూడా మేనరికాలున్నాయి’’ అని ఆయన వివరించారు.
ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఈ అధ్యయనం చేస్తున్నామని ఆయన చెప్పారు. తరువాత నేరుగా అడ్మిషన్ ఫామ్‌లోనే దగ్గరి బంధువుల మధ్య పెళ్లా కాదా అనే ప్రశ్నను పెట్టారు. అప్పుడు ఈ అంకెలు తెలిశాయి.
‘‘ఇటువంటి అధ్యయనం నాకు తెలిసి గల్ఫ్ దేశాల్లో జరిగింది. సౌదీ అరేబియాలో అంధుల్లో దగ్గరి సంబంధాల వల్ల పుట్టిన వారి శాతం 78 వరకూ ఉంది" అని తెలిపారు.

సరోజిని కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేసిన సాయిబాబా.. ఆ సర్వీసులో ఉండగానే అంధ పిల్లల కోసం 1992లో పాఠశాల ప్రారంభించారు. ఇక్కడ అంధులకు ఉచిత విద్య వసతి ఉంటాయి.
"మిగిలిన వికలాంగుల సమస్యలు వేరే. అంధుల సమస్యలు వేరే. వికలాంగులందరికీ కలిపి ఒకే పాఠశాల ఉంటుంది. కానీ అక్కడ అంధులు ఇమడలేరు. వారికోసం ప్రత్యేకంగా బడి ఉండాలి. అందుకే పెట్టా. మొదట్లో ఇబ్బందులు ఎదురైనా, అందరి సహకారంతో నడుపుతున్నాం. ఇక్కడ చదివిన ఎందరో చాలా పెద్ద స్థాయికి ఎదిగారు" అని ఆయన చెప్తారు.

అంధత్వ నివారణ ఎలా?
దృష్టి లోపాలు కొన్ని నివారించగలిగేవి (ప్రివెంటబుల్) ఉంటాయి. కొన్ని నయం (క్యూరబుల్) చేయగలిగేవి ఉంటాయి. కళ్లద్దాలు, కాటరాక్ట్ సమస్యలు, డయాబెటిస్, వయసు పెరగడం వల్ల వచ్చే సమస్యలు ఇలాంటివి.
కొందరికి పుట్టుకతో చూపు సమస్యలు వస్తాయి. గర్భిణికి ఇన్ఫెక్షన్లు రావడం, గర్భంతో ఉన్నప్పుడు సరైన ఆహారం తీసుకోకపోవడం, బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, కంటికి ఇన్ఫెక్షన్లు రావడం వంటివి దీనికి కారణాలు.

శాశ్వత అంధుల్లో 70 శాతం మందికి పుట్టుకతో సమస్య వస్తుంటే.. 25 శాతం మందికి 2-3 ఏళ్ల లోపు సమస్య వస్తోంది. ఐదు శాతం మందికి బ్రెయిన్ హ్యామరేజ్, ఇతరత్రా ఇన్ఫెక్షన్ల వల్ల అంధత్వ సమస్య వస్తుంది.
"ప్రస్తుతం పిల్లలు సరైన ఆహారం తినడం లేదు. డబ్బు లేక కాదు. ఏ సారం లేని తిండి తింటున్నారు. సరైన పోషకాహారం వారికి అందడం లేదు. కాస్లులో 20 శాతం మందికి పైనే కళ్లజోళ్లు ఉంటున్నాయి. ఫోన్ల గురించి చెప్పక్కర్లేదు. శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు అందాలి. అపార్టుమెంటులో ఉండే పిల్లవాడు బయటకు రావడంతోనే బస్ ఎక్కేస్తుంటే వాడికి ఎండ ఎలా తగులుతుంది?" అని ప్రశ్నించారు సాయిబాబా.

ఇప్పటికే మేనరికం పెళ్లిళ్లు చేసుకున్నవారు..
"మేనరికాలు వద్దని చెబుతాను. ఏ కారణం చేతైనా చేసుకుంటే పిల్లలు పుట్టే ముందు.. లేదంటే.. గర్భంతో ఉన్నప్పుడు జెనిటెక్ కౌన్సిలింగ్‌కి వెళ్లడం మంచింది. వాళ్లు జెనెటిక్ ఎగ్జామినేషన్ చేసి పుట్టే బిడ్డలకు ఎటువంటి సమస్య వచ్చే అవకాశం ఉందో వివరిస్తారు" అని ఆయన తెలిపారు.

అంధత్వ సమస్యలు రాకుండా ఉండాలంటే..
- స్క్రీన్ దూరం పెట్టండి
- సమతుల్య ఆహారం (బాలెన్స్‌డ్ డైట్) తీసుకోవాలి
- తరచూ, నిర్ణీత సమయంలో కంటి పరీక్షలు చేయించుకోవాలి
- డయాబెటిస్ ఉన్నవారు పరీక్షలు చేయించుకుని, డాక్టర్ సలహా పాటించాలి
- డాక్టర్ కళ్లద్దాలు వాడాలని చెబితే, తప్పనిసరిగా వాడాలి

ఫొటో సోర్స్, Getty Images
పిల్లల విషయంలో...
- గర్భిణిలు ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి
- గర్భంతో ఉన్నవారు పోషకాహారం తీసుకోవాలి
- ఆసుపత్రిలో డెలివరీ చేయించుకోవాలి
- బిడ్డకు పుట్టిన వెంటనే, ఆ తరువాత వీలైనంత వరకూ తల్లిపాలు ఇవ్వాలి
- చిన్నప్పుడు అంటే బడిలో చేర్చే ముందు ఒకసారి కంటి పరీక్షలు చేయించాలి
- పిల్లలకు తరచూ, నిర్ణీత సమయంలో కంటి పరీక్షలు చేయిస్తూ ఉండాలి
ఇవి కూడా చూడండి:
- అభిప్రాయం: పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
- వైరల్: పాకిస్తాన్లో భద్రతపై తీసిన ఈ వీడియో భారత్‌లో హత్యకు కారణమైంది. ఇలా..
- గ్రౌండ్ రిపోర్ట్: ఈ 24 దళిత కుటుంబాలు ఎందుకు ఊరొదిలేయాల్సి వచ్చింది?
- ఏ సెల్‌ఫోన్‌తో ఎంత ప్రమాదం?
- ఈ తమన్నా ఒంటికాలితో పోరాడుతోంది
- దక్షిణాది రాష్ట్రాల సీఎంలను మోదీ చిన్నచూపు చూస్తున్నారా
- పాస్‌పోర్ట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- వైరల్: పాకిస్తాన్లో భద్రతపై తీసిన ఈ వీడియో భారత్‌లో హత్యకు కారణమైంది. ఇలా..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










