ప్రభుత్వ ఉద్యోగాలు: పోస్టులు వందల్లో.. దరఖాస్తులు లక్షల్లో

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిఖిల్ హేమరాజానీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆ మధ్య ఉత్తర్ ప్రదేశ్‌లో 368 ప్యూన్ పోస్టులకు దాదాపు 23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సుమారు 2 లక్షల మంది ఇంజినీర్లు. మరో 255 మంది పీహెచ్‌డీ చేశారు.
మార్చిలో భారతీయ రైల్వే విభాగం లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే 2 కోట్లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ గణాంకాలు చాలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఎలా పరితపిస్తోందో అర్థం చేసుకోవడానికి.
ప్రైవేటురంగంలో ఉద్యోగ భద్రత లేక పోవడం, పని ఒత్తిడి వంటివి చాలా మందిని ప్రభుత్వ ఉద్యోగాల వైపు మొగ్గేలా చేస్తున్నాయి. మరికొందరు ప్రజాసేవ కోసం కూడా ప్రభుత్వ ఉద్యోగాలను మార్గంగా ఎంచుకుంటూ ఉంటారు.
తాజాగా విడుదలైన సివిల్ సర్వీసు ఫలితాల్లో తెలంగాణకు చెందిన అనుదీప్ దురిశెట్టి మొదటి ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. గతంలో ఆయన గూగుల్‌లో ఉద్యోగం చేశారు. సివిల్స్‌లో ఏడు సార్లు ప్రయత్నించి ఆయన చివరకు విజయం సాధించారు.
ఉద్యోగ భద్రత కోసం కొందరు ప్రభుత్వరంగం వైపు చూస్తుంటే మరికొన్ని చోట్ల ఇది సామాజిక హోదాగా కనిపిస్తోంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉద్యోగం అనేది పెళ్లికి కూడా ప్రధాన అర్హతగా మారుతోంది.
రాజస్థాన్‌కు చెందిన అనీశ్ తోమర్ కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఏడు సార్లు వివిధ రకాల పోటీ పరీక్షలు రాశారు. ఉపాధ్యాయుడి ఉద్యోగం నుంచి ఫారెస్ట్ గార్డు వరకు ఈ జాబితాలో ఉన్నాయి.
తాజాగా భారతీయ రైల్వేలో కాంపౌండర్ ఉద్యోగానికి అనీశ్ సిద్ధమవుతున్నారు. ఈసారి పోటీలో ఆయన ఒంటరిగా ఏమీ లేడు. ఎందుకంటే అతని భార్య కూడా ఈ ఉద్యోగానికి పోటీపడుతున్నారు.
హోదాపరంగా ఈ ఉద్యోగాలు చాలా చిన్నవే. అయినప్పటికీ ఎంతో మందిని ఆకర్షిస్తున్నాయి.
ప్రస్తుతం అనీశ్ రాజస్థాన్‌లోని ఒక కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. నెలకు రూ. 25,000 జీతం. కానీ ప్రభుత్వ ఉద్యోగం కోరుకోవడానికి అనీశ్‌కు చాలా కారణాలున్నాయి. పెరుగుతున్న పని భారం, అదనపు గంటలు పని చేయాల్సి రావడం, ఎంత కష్టపడినా శ్రమకు తగిన ప్రతిఫలం రాకపోవడం, ఉద్యోగ భద్రత వంటివి తనను అటువైపు చూసేలా చేస్తున్నాయని అనీశ్ అంటున్నారు.
"అర్ధరాత్రి ఫోను చేస్తారు. అదేమైంది, ఇదేమైందని అడుగుతుంటారు. ప్రశాంతంగా నిద్ర కూడా పోలేం." అని అనీశ్ చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కుటుంబానికి ఆసరా
భారతదేశంలో చాలా మంది అనుదీప్, అనీశ్‌ల మాదిరే ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు. ఉద్యోగ భద్రత ప్రధానకారణమైతే, కుటుంబానికి వైద్యంపరంగా ఆసరా లభిస్తుండటం మరో కారణం. ఇంకా ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
భారతదేశంలో ప్రభుత్వరంగ ఉద్యోగుల ప్రారంభ వేతనాలు దాదాపు ప్రైవేటురంగంతో పోటీపడుతున్నాయి. అనీశ్ కాంపౌండర్ ఉద్యోగం సాధిస్తే ప్రారంభ జీతం నెలకు రూ. 35,000 వరకు ఉంటుంది.
లక్షల్లో దరఖాస్తులు
ఇలాంటి ప్రయోజనాల వల్లే భారతదేశంలో ప్రభుత్వరంగంలో వందల ఖాళీలకు వేలు, లక్షల్లో దరఖాస్తులు వస్తుంటాయి.
భారతీయ రైల్వేలో ఒక్కో కాంపౌండర్/నర్స్ ఉద్యోగానికి సగటున 200 మంది దరఖాస్తు చేస్తుకున్నారు. ఈ యేడాది మార్చిలో భారతీయ రైల్వే విభాగం 1,00,000 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రాక్‌మ్యాన్లు, సామాన్లు మోసే కూలీలు, ఎలక్ట్రీషియన్లు వంటి ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. వీటి కోసం దాదాపు 2.3 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇది ఒక్క రైల్వే విభాగానికి మాత్రమే పరిమితం కాదు.
ముంబయిలో 1,137 కాన్‌స్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే, దాదాపు 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 2015లో ఉత్తర్ ప్రదేశ్ స్థానిక సంస్థల్లో 368 క్లర్కు పోస్టులకు 23 లక్షల మంది పోటీపడ్డారు. అంటే ఒక్కో ఉద్యోగానికి 6,250 దరఖాస్తులు వచ్చాయన్న మాట.

ఫొటో సోర్స్, Getty Images
అర్హతకు తగిన ఉద్యోగాలేనా?
చాలా మంది తమ విద్యార్హత కంటే చిన్న ఉద్యోగాలకు కూడా పోటీపడుతున్నారు. 10వ తరగతి అర్హత కలిగిన ఉద్యోగాలకు కూడా ఇంజినీర్లు, పట్టభద్రులు దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ స్థానిక సంస్థల్లో క్లర్క్ ఉద్యోగానికి కనీస అర్హతలు.. సైకిలు తొక్కగలగడం, 10 ఏళ్ల వరకు బడికి వెళ్లిఉండటం. భారతీయ రైల్వే లక్ష ఉద్యోగాలకు కనీస అర్హత 10వ తరగతి మాత్రమే.
పెళ్లికి కూడా అర్హతే!
ప్రభుత్వ ఉద్యోగమనేది పెళ్లికి కూడా అర్హతగా మారి పోయింది. ప్రభుత్వ ఉద్యోగం ఉంటే మంచి సంబంధం వస్తుంది. 2017లో వచ్చిన బాలీవుడ్ సినిమా న్యూటన్ ఇదే అంశాన్ని చర్చించింది. అందులో కథానాయకుడు ప్రభుత్వ ఉద్యోగి.
"నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి. పిల్ల తండ్రి కాంట్రాక్టర్. ఇంతకంటే ఏం కావాలి? " అని కథానాయకుడు న్యూటన్ తండ్రి అంటారు. "కట్నం కిందట లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఓ బైకు కూడా పెడతామన్నారు. " అని న్యూటన్ తల్లి సంబరపడుతుంది.
ప్రభుత్వ ఉద్యోగం ఉన్న పురుషునికి కట్నం పరంగా ఎంత గిరాకీ ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఈ సినిమాలోని సంభాషణ ఉదాహరణ మాత్రమే.

ఫొటో సోర్స్, Getty Images
సామాజిక హోదా
ఉత్తర్ ప్రదేశ్‌లో గోరఖ్‌పుర్, ఝాన్సీతోపాటు మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు రైళ్ల అనుసంధానంతో కొంచెం అభివృద్ధి చెందాయి. అందువల్ల ఇక్కడ రైల్వే ఉద్యోగులకు సమాజంలో గౌరవ, మర్యాదలు కాస్త ఎక్కువగా లభిస్తాయి.
"ఈ ప్రాంతాలలో వ్యవసాయం ఎక్కువ. భూస్వామ్య సంస్కృతి. ఇక్కడ ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాన్ని హోదాకు చిహ్నంగా చూస్తారు. " అని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ ఖరే తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ధోరణిని చూసినా ఈ విషయం అర్థమవుతుంది. ఉత్తర ప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఐఏఎస్‌కు ఎంపికవుతుంటారు.
రైల్వే విభాగంలో ప్రతి సంవత్సరం సగటున 15,000 మంది తమ సొంత రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌కు బదిలీ చేయమని దరఖాస్తు చేసుకుంటారని పేరు చెప్పడానికి ఇష్టపడమని ఒక అధికారి వెల్లడించారు.
గంగా నది పరివాహక ప్రాంతంలో ఉండే కొన్ని రాష్ట్రాల్లో అక్షరాస్యత చాలా తక్కువ. పేదరికం చాలా ఎక్కువ.
మరి అనీశ్ తోమర్ భార్య ప్రియ ఏమంటున్నారు? "మీ భర్తకు మీరు పోటీ ఇస్తున్నారా?" అని అడిగితే.. "లేదు. మా ఆయనకు రాకపోతే కానీసం నాకైనా వస్తుందేమోననే ఆశతోనే దరఖాస్తు చేశా" అని ప్రియ అన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








