గాంధీ మహాత్ముడిగా మారేందుకు పురికొల్పిన ఆ అవమానానికి 125 ఏళ్లు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహాత్మా గాంధీ.. ప్రపంచానికి శాంతి బోధన చేసిన అహింసా మూర్తి. భారతదేశానికి దాస్య విముక్తిని ప్రసాదించిన మానవతా మూర్తి.
అటువంటి మహాత్ముడు ఒకనాడు ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ జరిగిన ఓ సంఘటన మాములు మనిషిగా ఉన్న గాంధీ.. మహాత్మునిగా మారేందుకు పునాదిగా నిలిచింది.
సాధారణ వ్యక్తిగా ఉన్న గాంధీ ఓ అసాధారణ శక్తిగా మారేందుకు నాంది పలికింది.
ఆ ఘటనకు నేటితో 125 ఏళ్లు నిండాయి. అది దక్షిణాఫ్రికాలో గాంధీని రైలు నుంచి బయటకు గెంటివేయడం. ఒకరకంగా జాతివివక్షలోని రాక్షసత్వాన్ని గాంధీకి రుచి చూపింది ఆ అవమానమే.
1893 జూన్ 7న జరిగిన ఈ ఘటన, గాంధీ ఆలోచన తీరుపై బలమైన ముద్రవేసింది. తెల్లజాతీయులపై ఆయన దృక్పథంలో మార్పు తెచ్చింది.

ఫొటో సోర్స్, Gandhiashramsevagram.org
ఆత్మకథలో గాంధీ ఏం రాశారు?
నాడు తాను ఎదుర్కొన్న అవమానం, అప్పుడు ఆయన పడిన వేదన, మనసులోని కల్లోలం ఆయన ఆత్మకథ 'ద స్టోరీ ఆఫ్ మై ఎక్సపరిమెంట్స్ విత్ ట్రూత్' ద్వారా తెలుసుకోవచ్చు.
గాంధీ లా చదువుకున్నారు. న్యాయవాదిగా పని చేసేందుకు దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ తాను పని చేసే అబ్దుల్లా సేఠ్ కంపెనీ తరపున ఒక కేసు వాదించేందుకు డర్బన్ నుంచి ప్రిటోరియా వెళ్లాల్సి వచ్చింది.
అది రైలు ప్రయాణం. డర్బన్ రైలు స్టేషన్‌లో గాంధీ మొదటి తరగతి రైలు టికెట్ తీసుకున్నారు.
'డర్బన్‌లో మొదటి తరగతి రైలు టికెట్ తీసుకున్నాను. దుప్పట్లు కావాలంటే మరో అయిదు షిల్లింగులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కానీ డబ్బు ఆదా చేసే ఉద్దేశంతో నేను తీసుకోలేదు. అప్పటికీ అబ్దుల్లా సేఠ్ హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇక్కడి వాతావరణం భారతదేశానికి కంటే భిన్నంగా ఉంటుందని దుప్పట్లు తీసుకోమని మరీమరీ చెప్పారు. మరేం ఫర్వాలేదని, అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదని సేఠ్‌కు సర్దిచెప్పాను' అంటూ తన ప్రయాణం మొదలైన తీరును గాంధీ రాసుకున్నారు.
ఈ రైలు ప్రయాణం తన జీవితాన్ని మార్చి వేస్తుందని 24 ఏళ్ల గాంధీ ఊహించి ఉండరు.

ఫొటో సోర్స్, Gandhiashramsevagram.org
బ్రిటిష్ జాతి వివక్ష
రాత్రి 9 గంటల ప్రాంతంలో నతాల్ రాజధాని మారిట్జ్‌బర్గ్‌కు రైలు చేరుకుంది. అప్పుడు జరిగిన ఘటనను గాంధీ ఇలా వివరించారు.
'మారిట్జ్‌బర్గ్ స్టేషన్‌లో ప్రయాణికులకు దుప్పట్లు ఇస్తుంటారు. మీకు దుప్పట్లు కావాలా? అంటూ రైలులో పని చేసే వ్యక్తి అడిగాడు. నేను తెచ్చుకున్నాను, వద్దని చెప్పాను. అతను వెళ్లిపోయాడు. ఆ తరువాత బోగీలోకి ఒక తెల్లజాతీయుడు వచ్చాడు. నన్ను చూడగానే అతను దిగిపోయాడు. అందుకు కారణం నేను నల్లవాడిని కావడమే. అది నాకు ఎంతో బాధ కలిగించింది.'
రైలు దిగిన తెల్లజాతీయుడు కొందరు అధికారులను వెంటబెట్టుకొని వచ్చారు. వారంతా గాంధీ వద్దకు వచ్చి నిలబడ్డారు. ఆయననే చూస్తూ ఉన్నారు.
ఆ అవమానకరపు ఘటన జరిగిన తీరును గాంధీ ఇలా రాసుకున్నారు.

అవమానం ఇలా జరిగింది
'మరో అధికారి నా వద్దకు వచ్చి నాతో రా, నువ్వు సాధారణ బోగీలో ఎక్కాలి అని అన్నాడు.
ఎందుకు? నేను మొదటి తరగతి టికెట్టు తీసుకున్నానని చెప్పాను.
అదంతా తెలియదు. ముందు నువ్వు దిగి, మిగతావాళ్లు ఉండే సాధారణ బోగీ ఎక్కు అంటూ గదమాయించాడు.
మరోసారి చెబుతున్నా. మొదటి తరగతిలో ప్రయాణించేందుకు అవసరమైన టికెట్ నా వద్ద ఉంది. డర్బన్ స్టేషన్ ఈ టికెట్ ఇచ్చింది. నేను ఈ బోగీలోనే ప్రయాణిస్తానని స్పష్టం చేశాను.
నువ్వు ఇందులో ప్రయాణించడం కుదరదు. దిగిపోతావా? లేక పోలీసులను పిలిచి బయటకు గెంటించమంటావా? అంటూ అధికారి అరిచాడు.
మీరు చేయాల్సింది చేసుకోండి. నేను మాత్రం దిగనని అన్నాను.
పోలీసు కాన్‌స్టేబుల్ వచ్చి, నా రెక్క పుచ్చుకొని బయటకు లాగేశాడు. నా పెట్టెబేడను కూడా ప్లాట్‌ఫాంపై విసిరేశాడు.
నేను మరో బోగీ ఎక్కడానికి ఒప్పుకోలేదు. నన్ను అక్కడే వదలి రైలు వెళ్లిపోయింది.'

అవమాన భారం
నల్లజాతీయులను ఎంత హీనంగా చూస్తారో ఆ ఘటనతో గాంధీకి బోధపడింది. జాత్యాంహకారం వల్ల కలిగే నొప్పి ఏమిటో తెలిసొచ్చింది.
ఆ క్షణంలో గాంధీ అవమానభారంతో కుచించుకు పోయారు. మనసంతా బాధతో నిండిపోయింది.
చేతి సంచి తీసుకొని మెల్లగా వెళ్లి ప్రయాణికులు వేచి ఉండే గదిలో కూర్చున్నారు. సామాను అంతా ప్లాట్‌ఫాంపైనే ఉండి పోయింది. రైల్వే అధికారులు వాటిని తీసి ఉంచారు.
అది చలికాలం. దక్షిణాఫ్రికాలో చలి భరించరానిది. సముద్రమట్టానికి మారిట్జ్‌బర్గ్ చాలా ఎగువన ఉన్నందున చలి ఎముకలను కొరికేస్తూ ఉంది. గాంధీ చలి కోటు సామానుల్లో ఉండి పోయింది. కోటు కోసం అధికారులను అడగాలని గాంధీ అనుకున్నారు. కానీ మళ్లీ అవమానం ఎదుర్కోవాల్సి ఉంటుందని అలాగే వణుకుతూ కూర్చుండి పోయారు.
ఆ రాత్రి గడ్డకట్టే చలిలో ఆయన పడిన వేదన గాంధీ రాతల ద్వారా తెలుస్తోంది.
'గదిలో వెలుతురు లేదు. అర్ధరాత్రి ఒక ప్రయాణికుడు గదిలోకి వచ్చాడు. నాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ నేను మాట్లాడే స్థితిలో లేను.' అని గాంధీ రాశారు.
గాంధీ మనసు ఎంత గాయపడిందో ఇక్కడ తెలుస్తోంది. అవమాన భారంతో నిండిన ఆయన మనసుకు మరో ఆలోచన రావడంలేదనే విషయం చాలా స్పష్టమవుతోంది.

అంతర్మథనం
సరే, అవమానం జరిగింది. ఆ తరువాత ఏమిటి? న్యాయం కోసం నిలబడి పోరాడాలా? లేక భారతదేశానికి తిరిగి వెళ్లిపోవాలా? లేదంటే పిరికి వాని మాదిరిగా ఏమీ చేయకుండా చేతులు కట్టుకు కూర్చోవాలా? ఇలా ఆయనలో ఎన్నో ప్రశ్నలు. మనసులో ఒక మదనం. ఒక సంఘర్షణ. ఆయన రాసిన ఈ వాక్యాలు చదివితే మనకు ఈ విషయం అర్థమవుతుంది.
'ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? ఇదే ప్రశ్న పదేపదే నా మనసును తొలిచి వేస్తోంది.
నా హక్కుల కోసం పోరాడాలా? లేక భారతదేశానికి తిరిగి వెళ్లిపోవాలా?
లేక ఈ అవమానాన్ని దిగమింగి ప్రిటోరియా వెళ్లి, కేసు పని పూర్తయ్యాక భారతదేశానికి వెళ్లిపోవాలా?
నా బాధ్యతలను నెరవేర్చకుండా భారతదేశానికి పోవడమంటే అది పిరికితనమే అవుతుంది.'
ఎంతో అంతర్మథనం తరువాత యువ గాంధీ పోరాడాలని నిశ్చయించుకున్నారు. ఆయనలోని ఈ పోరాటతత్వమే ఆ తరువాత గాంధీ మేటి నాయకునిగా మారేందుకు దోహదపడింది.

జాత్యాంహకారంపై పోరాటం
జాతి వివక్షను రూపు మాపాలని ఆయన అప్పుడే కంకణం కట్టుకున్నారు. అందుకు ఎందాకైనా పోరాడాలని నిర్ణయించుకున్నారు.
'నేను ఎదుర్కొన్న ఈ అవమానం భరించరానిది. జాత్యాంహకారమనే రోగం ఇందుకు కారణం. ఈ రోగాన్ని పారదోలేందుకు ప్రయత్నిస్తాను. ఇందుకు ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబడతాను.'
మరుసటి రోజు స్థానిక భారతీయులు మారిట్జ్‌బర్గ్ స్టేషన్‌లో ఉన్నగాంధీని పరామర్శించేందుకు వచ్చారు. ఇక్కడ భారతీయులకు, నల్లజాతీయులకు ఇటువంటి అవమానాలు చాలా సాధారణమని వారు గాంధీకి వివరించారు. తమ బాధలను చెప్పుకొన్నారు. ఇది కూడా గాంధీ ఆలోచనా తీరును ప్రభావితం చేసింది.
పోరాటానికి సిద్ధమైన గాంధీ, చివరకు ప్రిటోరియా వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా రైల్వే జనరల్ మేనజర్‌కు టెలిగ్రాం ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి, తన నిరసనను తెలియజేశారు.
ఇక్కడ నుంచి మొదలైన గాంధీ పోరాటం భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చే వరకు ఆగలేదు.
ఇవి కూడా చదవండి
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: బహుశా.. ఈ తరానికి పెద్దగా తెలియని చరిత్ర ఇది
- జీసస్: నిజంగా నల్లగా ఉండేవాడా?
- తొలి కంచి పీఠాధిపతి ఆది శంకరుడేనా?
- ఆఫ్రికన్ చారిత్రక గాథ: వాంఛ తీర్చుకుని చంపేస్తుంది: కాదు, జాతి పోరాట యోధురాలు
- బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పీవీ ఎందుకు ఆపలేదు?
- రవీంద్రనాథ్ ఠాగూర్: ‘జాతీయవాదం ప్రమాదకారి. భారతదేశ సమస్యలకు అదే మూలం’
- వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








