చందా కోచర్: వివాదం ఎలా మొదలైంది? ఇప్పుడేం జరుగుతోంది?

ఫొటో సోర్స్, ICICIBANK/FACEBOOK
- రచయిత, స్నేహా కంచన్, సురంజనా తివారి
- హోదా, బీబీసీ ప్రతినిధులు
దశాబ్ద కాలంగా చందా కోచర్ భారతదేశపు ప్రైవేట్ రంగంలోని రెండో అతి పెద్ద బ్యాంక్ విజయానికి పర్యాయపదంగా మారారు. కొన్నిసార్లు ఆమెను భారతదేశపు అతి శక్తివంతమైన మహిళగా కూడా పేర్కొంటుంటారు. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓపై వచ్చిన తాజా ఆరోపణలపై విచారణ జరపాలని నిర్ణయించడంతో కోచర్‌కు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు.
బ్యాంకు కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఉల్లంఘించినట్లు, కొన్ని బ్యాంకు రుణాల విషయంలో 'క్విడ్ ప్రొ కో'కు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి.
ఇంతకూ ఆమె ఈ వివాదంలో ఎలా చిక్కుకున్నారు. అసలు వివాదం ఎప్పుడు మొదలైంది?

ఫొటో సోర్స్, ICICIBANK/TWITTER
ఏప్రిల్, 2012
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్సార్టియం నేతృత్వంలో ఐసీఐసీఐ బ్యాంక్ వీడియోకాన్ గ్రూప్‌కు రూ.3,250 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. అప్పుల్లో చిక్కుకుపోయిన ఆ గ్రూప్‌కు ఇరవై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొత్తం రూ.40,000 కోట్ల రుణాన్ని ఇస్తామని ముందుకు వచ్చాయి.
అక్టోబర్ 22, 2016
ఐసీఐసీఐలో మరియు వీడియోకాన్ గ్రూపులో ఒక ఇన్వెస్టర్ అయిన అరవింద్ గుప్త తన బ్లాగ్ పోస్టులో తాను ప్రధానికి, ఇతర ప్రభుత్వ శాఖలకు రాసిన లేఖను పోస్టు చేశారు. 2016, మార్చి 15న రాసిన ఆ లేఖలో ఐసీఐసీఐ తన లావాదేవీలను నిర్వహిస్తున్న విధానాలపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. అందులో ఆయన చందా కోచర్ భర్త దీపక్ కోచర్‌కు వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌తో వ్యాపార సంబంధాలు ఉన్నాయని, అందువల్ల వీడియోకాన్‌కు ఇచ్చిన రూ.3,250 కోట్ల రుణంలో విరుద్ధ ప్రయోజనాలు ఉండి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు.
మార్చి 28, 2018
ఐసీఐసీఐ బోర్డు తమ ఎండీ, సీఈఓ చందా కోచర్‌పై తమకు సంపూర్ణంగా విశ్వాసం ఉందంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో తమ బ్యాంకులో ఎలాంటి క్విడ్ ప్రొ కో జరగలేదని పేర్కొంది. బ్యాంకు, ఉన్నతస్థాయి మేనేజ్మెంట్ ప్రతిష్టను దిగజార్చడానికే అలాంటి వదంతులను సృష్టిస్తున్నారని అంది.
మార్చి 29, 2018
- ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రికలో ఒక పరిశోధనాత్మక కథనం ప్రచురించారు. దానిలో దీపక్ కోచర్, వేణుగోపాల్ ధూత్‌ల మధ్య ఉన్న ఆర్థిక, వ్యాపారల లావాదేవీలను ప్రస్తావించారు.
- ఆ వ్యాసంలో దీపక్ కోచర్, ధూత్‌లు 2008, డిసెంబర్‌లో ఎలా 50-50 భాగస్వామ్యంలో ఉమ్మడి యాజమాన్యం కింద 'నుపవర్ ప్రైవేట్ లిమిటెడ్'ను ఎలా స్థాపించారో పేర్కొన్నారు.
- ఈ తర్వాత నెలలోనే ధూత్ నుపవర్‌కు రాజీనామా చేసి, 25 వేల షేర్లను దీపక్ కోచర్‌కు రూ.2.5 లక్షలకు విక్రయించారు.
- 2010, మార్చిలో నుపవర్ ధూత్ సొంత కంపెనీ సుప్రీం ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ.64 కోట్ల రుణాన్ని తీసుకుంది.
- షేర్లను ధూత్ నుంచి కోచర్‌కు, కోచర్ బంధువుల సంస్థ పసిఫిక్ క్యాపిటల్‌కు బదిలీ అనంతరం ధూత్ యాజమాన్యం కింద ఉన్న సుప్రీం ఎనర్జీ, 94.9 శాతం భాగస్వామ్యంతో నుపవర్‌లో భాగస్వామిగా మారింది.
- 2010, నవంబర్‌లో ధూత్ సుప్రీం ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉన్న తన హోల్డింగ్‌ను మహేశ్ చంద్ర పుగ్లియా అనే అసోసియేట్‌కు బదిలీ చేశారు.
- 2012లో పుగ్లియా తన హోల్డింగ్‌ను దీపక్ కొచ్చార్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న పినాకిల్ ఎనర్జీకి బదిలీ చేశారు. ఈ బదిలీ లావాదేవీ విలువ కేవలం రూ.9 లక్షలు.
- నుపవర్‌కు రుణం ఇచ్చిన మూడేళ్లలోపే, సుప్రీం ఎనర్జీని పినాకిల్ ఎనర్జీ టేకోవర్ చేసింది.
- ఆ లావాదేవీలు జరగడానికి ఆరు నెలల ముందు, వీడియోకాన్‌కు ఐసీఐసీఐ నుంచి రూ.3,250 కోట్ల రుణం మంజూరైంది.
- ఆ రుణంలో దాదాపు 80 శాతం, అంటే రూ.2,810 కోట్లను తిరిగి చెల్లించలేదు. ఆ తర్వాత 2017లో ఐసీఐసీఐ వీడియోకాన్ అకౌంట్‌ను నిరర్థక ఆస్తులుగా ప్రకటించింది.

ఫొటో సోర్స్, ICICIBANK/FACEBOOK
మార్చి 31, 2018
మీడియా వార్తల ప్రకారం - దీపక్ కోచర్, వేణుగోపాల్ ధూత్‌ల మధ్య జరిగిన లావాదేవీలపై సీబీఐ ప్రాథమిక విచారణ జరపనుంది. అయితే ప్రాథమిక విచారణలో చందా కోచర్ పేరును పేర్కొనలేదు.
ఏప్రిల్ 4, 2018
ఐసీఐసీఐ రుణాల కేసులో పన్ను ఎగవేత విచారణ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ దీపక్ కోచర్‌కు చెందిన నుపవర్‌కు నోటీసులు జారీ చేసింది.
మే 24, 2018
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఐసీఐసీఐ బ్యాంకుకు, దాని ఎండీ, సీఈఓ చందా కోచర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
మే 30, 2018
చందా కోచర్‌పై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిపిస్తామని ఐసీఐసీఐ బ్యాంకు స్పష్టం చేసింది. ప్రాథమిక వార్తలను బట్టి, విచారణ నేపథ్యంలో బ్యాంకు ఆమెను నిరవధిక సెలవుపై పంపినట్లు తెలుస్తోంది. అయితే తర్వాత ఐసీఐసీఐ ఆ వార్తలను కొట్టిపారేసింది. చందా కోచర్ తన ముందస్తు ప్రణాళికకు అనుగుణంగా తన వార్షిక సెలవులో ఉన్నారని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








