అధ్యయనం: ఫేస్‌బుక్‌కు కటీఫ్ చెప్పేస్తున్న అమెరికా కుర్రకారు

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా టీనేజర్లలో చాలా మంది ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌ను వదిలేసి, యూట్యూట్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ లాంటి ఇతర ప్లాట్‌ఫాంల వైపు మళ్లుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది.
2015లో అమెరికా టీనేజర్లలో 71 శాతం మంది ఫేస్‌బుక్ వాడేవారని, ఇప్పుడు దీనిని వాడేవారి సంఖ్య 51 శాతానికి తగ్గిపోయిందని అమెరికా కేంద్రంగా పనిచేసే ప్యూ రీసర్చ్ సెంటర్ తెలిపింది.
ఎక్కువ ఆదాయమున్న కుటుంబాల్లోని టీనేజర్లతో పోలిస్తే తక్కువ ఆదాయమున్న కుటుంబాల్లోని టీనేజర్లు ఫేస్‌బుక్ పట్ల ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
2015తో పోలిస్తే ట్విటర్, టంబ్లర్ వాడే టీనేజర్ల శాతాలు - ట్విటర్ 32 శాతం, టంబ్లర్ 14 శాతం - పెద్దగా మారలేదు.

ఫొటో సోర్స్, Getty Images
యూట్యూబ్ వైపు 85 శాతం మంది మొగ్గు
అమెరికాలో 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్నవారిలో అత్యధికులు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. వీరికి సొంత స్మార్ట్‌ఫోనైనా ఉంది లేదా వాడుకొనేందుకు ఇతరుల స్మార్ట్‌ఫోనైనా అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ఈ వయసువారిలో 45 శాతం మంది దాదాపు ఎప్పుడూ ఆన్‌లైన్‌లో ఉంటున్నారు.
టీనేజర్లలో ఇంతకు ముందు ఫేస్‌బుక్‌కు అత్యధిక ఆదరణ ఉండగా, ఇప్పుడు దీని స్థానాన్ని యూట్యూబ్ ఆక్రమించింది. టీనేజర్లలో 85 శాతం మంది యూట్యూబ్ వైపే మొగ్గు చూపుతున్నారు. యూట్యూబ్ తర్వాతి స్థానాల్లో ఇన్‌స్టాగ్రామ్(72 శాతం), స్నాప్‌చాట్(69 శాతం) ఉన్నాయి.
ఫేస్‌బుక్‌ను వీడే టీనేజర్లు మొగ్గుచూపుతున్న ప్లాట్‌ఫాంలలో యూట్యూబ్ గూగుల్‌కు చెందినది కాగా, ఇన్‌స్టాగ్రామ్ ఫేస్‌బుక్‌దే.
దాదాపు నెల క్రితం 750 మంది టీనేజర్లను నమూనాగా తీసుకొని ప్యూ ఈ అధ్యయనం నిర్వహించింది.
అమెరికా టీనేజర్లలో మూడేళ్ల క్రితం 73 శాతం మందికి స్మార్ట్ ఫోన్లు ఉండగా, ఇప్పుడు 95 శాతం మందికి ఉన్నాయి.
ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వాడాలనే విషయంలో టీనేజర్లపై తమ ఈడువారి ప్రభావం ఎక్కువగా ఉంది. ఇంతకుముందు కూడా ఇంతే.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియా ప్రభావంపై భిన్నాభిప్రాయాలు
తమ జీవితాలపై సోషల్ మీడియా ప్రభావం పట్ల టీనేజర్లలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
ఇది సానుకూలం ప్రభావం చూపుతోందని దాదాపు 33 శాతం మంది, ప్రతికూల ప్రభావం చూపుతోందని 25 శాతం మంది చెప్పారు. తమపై సానుకూల ప్రభావంగాని, ప్రతికూల ప్రభావంగాని చూపడం లేదని 45 శాతం మంది తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- అబ్బాయిల ముందు అమ్మాయి ఎందుకు ఎక్కువ తినదు?
- #GroundReport ప్రకాశం జిల్లా: తవ్విన కొద్దీ కన్నీరే, నీటి చుక్క జాడలేదు
- బీజేపీ ఫేస్‌బుక్ పేజీలో ఏపీ నెటిజన్ల నిరసనలు
- పపువా న్యూగినియా: ఫేస్‌బుక్‌పై 30 రోజులు నిషేధం
- వ్యక్తిగత డేటా భద్రత గురించి భయమా? అయితే ఈ 5 పద్ధతులు పాటించండి!
- నొప్పిని తగ్గించే మందు మీకు దొరకడం లేదా? ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








