‘భయపడకండి.. మేమున్నాం’.. ఉద్యోగుల సంతాన సాఫల్యానికి తాజ్ గ్రూప్ భరోసా

ఉద్యోగాలు చేసే మహిళలకు గర్భధారణకు సంబంధించి రకరకాల సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా తాజ్ గ్రూప్, తమ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగులకు సంతాన సాఫల్య చికిత్సకు అయ్యే ఖర్చులను భరించాలని నిర్ణయించింది.
అంతే కాకుండా కోరుకున్న వారికి అండ శీతలీకరణ సదుపాయాలను కల్పిస్తామని ప్రకటించింది. ముంబయి నుంచి బీబీసీ ప్రతినిధి సురంజనా తివారీ అందిస్తున్న కథనం..
తాజ్ మహల్ ప్యాలస్ హోటల్.. ముంబయిలోని ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటి .
ఈ హోటల్‌ను నడుపుతున్న టాటా గ్రూప్, ఇప్పుడు తన ఉద్యోగుల సౌకర్యార్థం ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
ఇక్కడ పని చేస్తున్న మహిళా ఉద్యోగుల్ని ప్రోత్సహించడంలో భాగంగా, సంతాన సాఫల్య చికిత్స తీసుకునే వాళ్లకు అయ్యే వైద్య ఖర్చును భరించేందుకు ముందుకొచ్చింది.
రోజురోజుకీ ఉద్యోగాలు చేసే మహిళలు ఎక్కువవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వివాహం ఆలస్యం కావడం లేదా ఉద్యోగ జీవితంలో తీరిక లేక బిడ్డల్ని కనడం వాయిదా వెయ్యడం చేస్తున్నారు. ఈ సమస్యలకు ఐవీఎఫ్ చికిత్స చక్కని పరిష్కారంగా ఉంటుంది. దాని వల్ల వాళ్లు తమ కెరియర్ పై దృష్టి పెట్టడమే కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐవీఎఫ్ ద్వారా బిడ్డల్ని కనగలరు కూడా.
ముంబయిలోని కోకిలాబెన్ దీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో, ఒక్క రౌండ్ ఐవీఎఫ్‌కు అయ్యే ఖర్చు దాదాపు 2 లక్షల 70 వేల రూపాయలు. కొన్ని చోట్ల అది నాలుగు లక్షల వరకు ఉంది.
ఇక ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, బీమా పథకాలు, ఈ సంతాన సాఫల్య చికిత్సకు బీమా చెల్లించవు.

షైలా పాఠక్ లాంటి మహిళా ఉద్యోగులకు అంత ఖర్చు భరించడం చాలా కష్టం. ఇక సంతాన సాఫల్య చికిత్స తీసుకోవడమన్నది స్త్రీలలో భావోద్వేగాలకు సంబంధించిన విషయం.
ఆ చికిత్స విఫలమైతే కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు...మానసికంగా, శారీరకంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొవాలి అంటారు షైలా.
షైలా, పిల్లల కోసం చాలా ఏళ్లు వేచి చూశారు. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగారు. చాలాసార్లు వాటి వల్ల నిరాశే మిగిలింది. చివరకు ఐవీఎఫ్ ద్వారా ఆమె మొదటిసారిగా కవల పిల్లలకు తల్లయ్యారు.

ఇకపై ఉద్యోగులు తమ కుటుంబ జీవితాన్ని ప్రారంభించేందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాజ్ సంస్థ భరోసానిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ‘అందరూ నిర్దోషులైతే.. ఈ దళితుల్ని చంపిందెవరు?’
- అన్నం ఎక్కువగా తింటే ముందుగానే మెనోపాజ్..!
- 'పోర్న్ స్టార్ నోరు మూయించడానికి ట్రంప్ లక్షా 30 వేల డాలర్లు చెల్లించారు'
- ‘అందరూ నిర్దోషులైతే.. ఈ దళితుల్ని చంపిందెవరు?’
- విశ్లేషణ: 2019 ఎన్నికలపై కర్ణాటక ప్రభావమెంత?
- పూర్తి కథనం స్ట్రాబెరీ ఉంగరం చెప్పే యెమెన్ కన్నీటి కథ
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.









