పంజాబ్‌లో మసీదు నిర్మాణానికి హిందువులు, సిక్కుల చందాలు

- రచయిత, అరవింద్ ఛాబ్రా
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశంలో కొన్నిచోట్ల ఒక మతం వారిని మరో మతం వారిపై రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతుండగా, పంజాబ్‌లోని ఓ గ్రామంలో మాత్రం దీనికి భిన్నంగా ఓ అరుదైన ఘటన జరిగింది.
బర్నాలా జిల్లాలోని మూమ్ గ్రామంలో సుమారు 400 మంది ముస్లింలు ఉండగా, హిందువులు, సిక్కులు 4 వేల మందికి పైగా ఉన్నారు.
ఆ గ్రామంలో నజీమ్ ఖాన్ మేస్త్రీగా పని చేస్తున్నారు. గ్రామంలోని శివాలయ నిర్మాణంలో నజీమ్ కూడా పని చేశారు. అయితే పని చేసేప్పుడు గ్రామంలో తమకంటూ ఒక మసీదు లేకపోవడం అతణ్ని కలచి వేసింది.

మూమ్ గ్రామంలోని ముస్లింలు చాలా మంది కూలీలుగా పని చేస్తున్నారు. అందువల్ల మసీదును నిర్మించుకునే శక్తి వాళ్లకు లేదు. ఈ ఏడాది ప్రారంభంలో శివాలయ నిర్మాణం పూర్తైన వెంటనే నజీమ్ వెళ్లి ఆలయ నిర్వాహకులను కలిశారు.
''మీ హిందువులకు ఇప్పటికే ఒక ఆలయం ఉంది. దానికి తోడు మళ్లీ ఇప్పుడు కొత్తగా శివాలయం నిర్మించుకున్నారు. కానీ మా ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి గ్రామంలో ఒక్క మసీదు కూడా లేదు. మసీదు నిర్మించుకునే శక్తి కూడా మాకు లేదు. అందువల్ల దయచేసి మాక్కొంచెం భూమిని ఇవ్వగలరా?'' అని కోరారు.

ఒక వారం తర్వాత అతని ప్రశ్నకు జవాబు లభించింది. ఆలయ నిర్వాహకులు గుడికి పక్కనే ఉన్న 900 చదరపు అడుగుల స్థలాన్ని మసీదు కోసం ఇవ్వడానికి అంగీకరించారు.
''వాళ్లకు కృతజ్ఞతలు చెప్పడానికి మా వద్ద మాటలు లేవు'' అని నజీమ్ అన్నారు.
ఆలయ నిర్వాహకులలో ఒకరైన పురుషోత్తమ లాల్, ''వాళ్లది చాలా న్యాయమైన కోరిక. మా సుఖదు:ఖాలను కలిసి పంచుకుంటాం. అలాంటప్పుడు తమకు మసీదు కావాలన్న వాళ్ల కోరిక సక్రమంగానే అనిపించింది'' అన్నారు.
ఇప్పుడు నజీమ్, మరికొంత మంది మేస్త్రీలు, కూలీలు కలిసి మసీదు నిర్మాణంలో పాలు పంచుకొంటున్నారు. అంతే కాదు ఈ మసీదుకు సంబంధించి మరో విశేషం ఏమిటంటే - గురుద్వారాకు, మసీదుకు మధ్య ఉమ్మడి గోడ ఉంది. అంతే కాకుండా మసీదు నిర్మాణం కోసం సిక్కులు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు.

ఇంతవరకు ఈ గ్రామంలో వివిధ మతాల మధ్య ఘర్షణలు జరిగిన చరిత్ర కూడా లేదు. దేశంలోని పలు ప్రాంతాలలో మత విద్వేషాగ్ని ప్రబలుతుండగా ఈ గ్రామంలో మాత్రం మతసామరస్యం వెల్లివిరుస్తోంది.
ఈ గ్రామంలో మరో విశేషం - ఇక్కడ హిందువులు కూడా గురుద్వారాకు వెళతారు. సిక్కులు ధరించే తలపాగా చుడతారు. ఇతర మతాల వారింట్లో ఏవైనా కార్యాలు జరిగితే వాటికీ వెళుతుంటారు.
గురుద్వారా ముఖ్య నిర్వాహకులు సుర్జీత్ సింగ్, తమ గురుద్వారాలో హిందువుల గీతాపఠనం కూడా జరుగుతుందని తెలిపారు.

అదృష్టవశాత్తూ తమ గ్రామంలో వివిధ మతాల వారిని విడదీసే రాజకీయ నాయకులు లేరని దేవాలయ వ్యవహారాలు చూసుకునే భరత్ రామ్ అనే ఉపాధ్యాయుడు తెలిపారు. గ్రామస్తుల మధ్య సుహృద్భావ వాతావరణం ఉందని, అందుకనే ముస్లింలు అడగ్గానే వారికి స్థలం ఇచ్చామని వివరించారు.
ఆ మసీదు కేవలం ముస్లింల కోసం మాత్రమే కాదు - హిందువులు, సిక్కుల కోసం కూడా అని ఆయన అన్నారు.
'గురుద్వారా అయినా, మసీదు అయినా, దేవాలయమైనా.. అన్నిచోట్లా భగవంతుడు ఉంటాడు' అనేది గ్రామస్తుల ఉమ్మడి అభిప్రాయం.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








