అభిప్రాయం - గడ్చిరోలి కాల్పులు: పోలీసుల దూకుడుకు కారణాలేంటి?

నక్సలైట్లు

ఫొటో సోర్స్, AFP/GettyImages

ఫొటో క్యాప్షన్, నక్సలైట్లు (పాతచిత్రం)
    • రచయిత, టంకశాల అశోక్
    • హోదా, బీబీసీ కోసం

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ నెల 22, 23 తేదీల్లో నక్సలైట్లతో జరిగిన 'ఎదురుకాల్పుల' గురించి పోలీసులు చెప్తున్న వివరాలు, గతంలో పోలీసులు చెబుతూ వచ్చిన కథనాలకు భిన్నంగా ఉండటం గమనించదగ్గ విషయం.

లోగడ ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు తమ కూంబింగ్ ఎలా సాగిందో, తమకు తారసపడిన నక్సలైట్లను లొంగిపోవలసిందిగా ఎలా కోరామో, అయినప్పటికీ లెక్కచేయని నక్సలైట్లు కాల్పులు ప్రారంభించడంతో విధిలేక తాము కూడా ఎలా కాల్చవలసి వచ్చిందో పోలీసులు చాలా వర్ణించి చెప్పేవారు. ఆ మాటలను నమ్మేవారు బహుశా ఎవరూ ఉండకపోవచ్చునని తెలిసినా, ప్రతిసారి అవే కథనాలు వినిపించేవారు.

ఎందుకోగాని మహారాష్ట్ర పోలీసులు ఈసారి అలాంటి శ్రమ తీసుకోవడం లేదు.

నక్సలైట్లు

ఫొటో సోర్స్, Alok Putul

ఫొటో క్యాప్షన్, పాతచిత్రం

కాల్పులపై స్పందన మారుతోందా?

ఆదివారం నాటి మొదటి ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మొదలుకొని, నాలుగు రోజుల తర్వాత బుధవారం పోలీసు ఉన్నతాధికారులు విషయాలను మరోసారి చెప్పేవరకు కూడా వారి నుంచి ఎన్‌కౌంటర్ కథనాలు వెనకటి తరహాలో మూస పద్ధతిలో వినరాలేదు. అలాగని లొంగిపోవలసిందిగా తాము కోరినా నక్సలైట్లు పెడచెవిన పెట్టడంతో ఆత్మరక్షణ కోసం తాము కూడా కాల్పులు జరపవలసి వచ్చిందనే మాటను వారు అనలేదని కాదు. కానీ ఆ మాట మంద్ర స్వరంలో ఒకటీ అరా సార్లు మాత్రమే అన్నారు. ఇతర వివరాలు అనేకం వారి నుంచి వచ్చాయి.

ఇంచుమించు ఒకేసారి జరిగిన రెండు కాల్పుల ఘటనల్లో దాదాపు 40 మంది నక్సలైట్లు చనిపోవడమన్నది 50 సంవత్సరాల విప్లవోదమ్య చరిత్రలోనే లేదు. అలాంటప్పుడు అందులో తమ దోషమేమీ లేదని ఒప్పించేందుకు పోలీసులు మామూలు కన్నా ఎక్కువ శ్రమ పడవలసింది. కానీ అటువంటిదేమీ కనిపించకపోవడం ఆశ్చర్యకరం. అందుకు కారణం ఏమై ఉంటుంది?

సాధారణంగా ఇటువంటివి చోటుచేసుకొన్నప్పుడు విప్లవ సంస్థలు, హక్కుల సంస్థలతోపాటు ఒక మేరకు సమాజంలో కూడా నిరసనలు కన్పించేవి. అవి ఎంత తీవ్రస్థాయిలో ఉంటే పోలీసులకు ''ఎదురు కథనాలు'' అంత అవసరమయ్యేవి.

అవి తీవ్రస్థాయిలో లేకుండా, సాధారణ స్థాయికి తగ్గిపోయినప్పుడు పోలీసులకు ''ఎదురు కథనాలు'' వినిపించాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంది. అటువంటి స్థితిలో వాస్తవాలు నిజనిర్ధరణ సంఘాల విచారణలతో నిమిత్తం లేకుండా తగినంత మేర బయటపడుతుంటాయి.

దేశంలో నక్సలైట్ ఉద్యమం, పోలీసుల కాల్పులు-మరణాలు, అందుకు వేర్వేరు వైపుల నుంచి స్పందనల స్థితి ఈ విధంగా మారుతోందనుకోవాలా?

కాల్పుల ఘటనలు ఎక్కువగా ఛత్తీస్‌గఢ్-తెలంగాణ-ఆంధ్రప్రదేశ్-ఒడిశా జోన్‌లో జరుగుతున్నాయి.

జాగ్రత్తగా గమనిస్తే, ఈ గడ్చిరోలి ఉదంతంలో పూర్తిగా పోల్చదగినట్లు కాకపోయినా, ఈ నాలుగు రాష్ట్రాల జోన్‌ ఘటనల పట్ల స్పందనలోనూ తీవ్రతలు, విస్తృతి కూడా క్రమంగా తగ్గుతుండటాన్ని గమనించవచ్చు. ఉద్యమంలో పెరుగుతున్న నిస్పృహ, సమాజంలో పెరుగుతున్న నిర్లిప్తత, పోలీసుల్లో పెరుగుతున్న ధీమా ఇందుకు కారణాలు కావొచ్చు.

భద్రతా దళాలు

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, భద్రతా దళాలు (ప్రతీకాత్మక చిత్రం)

వీరి అంచనా నిజమవుతుందా? వారి ఆశాభావం నిజమవుతుందా?

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సరిగ్గా నెల రోజుల క్రితం రెండు, మూడు సందర్భాల్లో మాట్లాడుతూ, దేశంలో నక్సలైట్ ఉద్యమం 2013 నుంచి బాగా త్గగుముఖం పట్టిందన్నారు. తన ప్రకటనకు సమర్థనగా రకరకాల లెక్కలు కూడా ఇచ్చారు.

మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశానికి అంతర్గతంగా అతిపెద్ద సవాలు 'నక్సలిజం' అన్నది తెలిసిందే.

రాజ్‌నాథ్ సింగ్ మార్చి 24న, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) 79వ వ్యవస్థాపక దినోత్సవంలో మాట్లాడుతూ- దేశంలో ఒక తీవ్రమైన సవాలుగా నక్సలిజం చివరి దశలో ఉందన్నారు. అసలు మొత్తం ఉద్యమాన్ని వచ్చే నాలుగేళ్లలో తుడిచిపెట్టగలమన్నది గడ్చిరోలి ఘటనల సందర్భంగా అధికారుల అంచనా.

వారు ఆ పని చేయగలరా, లేక దేశంలోని పేద వర్గాల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఆధారం చేసుకొంటూ తాము తిరిగిపుంజుకోగలమనే నక్సలైట్ల ఆశాభావం నిజమవుతుందా అన్నది భవిష్యత్తు మాత్రమే చెప్పగలదు. కానీ ప్రస్తుతానికి గమనించాల్సినవి కొన్ని ఉన్నాయి.

నక్సలైట్ల దాడి

ఫొటో సోర్స్, Alok Putul

ఫొటో క్యాప్షన్, భద్రతా బలగాలపై నక్సలైట్ల దాడి (పాతచిత్రం)

విప్లవకారులపై పెరుగుతున్న ఒత్తిడి

దండకారణ్య ప్రాంతంలోని రాష్ట్రాలతోపాటు కేంద్ర ప్రభుత్వం విప్లవకారులపై ఒత్తిడిని వెనకటి కన్నా బాగా పెంచుతున్నాయి.

నక్సలైట్ల గురించి సమాచార సేకరణ మనుషుల ద్వారా, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చాలా ఎక్కువైంది. పోలీసులకు మరింత ఆధునిక ఆయుధాలు అందుతున్నాయి. దండకారణ్యంలోని దట్టమైన అడవులు, కొండల గురించి నక్సలైట్లకు, వారిని అనుసరించే గిరిజనులకు అరచేతి నిమ్మవలె తెలుసనుకుంటే అదే విధమైన వివరాలను పోలీసులు సంపాదించే మార్గంలో ఉన్నారు. అడవులు, కొండల్లో దాడులు, ఎదురుదాడులకు తగిన శిక్షణలతో పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇందులో అనేకానికి విప్లవకారుల వద్ద సమాధానాలు లేవు. అప్పుడప్పుడు మందుపాతరలతో ఆకస్మిక నష్టాలు కలిగించడం మినహా.

గడ్చిరోలి సహా ఇటీవలి ఘటనలను విశ్లేషించినప్పుడు పైన పేర్కొన్న కోణాలన్నీ కనిపిస్తాయి. ఎక్కడో మారుమూల, దట్టమైన అడవుల్లో, ఇంద్రావతి నది సమీపాన, అక్కడి గిరిజన గూడేలలో నక్సలైట్ల కదలికలు అన్నింటి గురించి పోలీసులకు సమాచారం ఉంది. ప్రత్యేక శిక్షణ పొందిన కమాండోలు, ఇతర పోలీసు బలగాలు, ఆధునిక ఆయుధాలతో పకడ్బందీ వ్యూహం ప్రకారం విప్లవకారులను వెన్నాడుతూ వెళ్లి, ఒక చోట చుట్టుముట్టారు. నదీ తీరాన చేరిన వారిలో దాదాపు నాలుగింట మూడొంతుల మంది మృతదేహాలు బుధవారం (ఏప్రిల్ 25) నాటికే లభ్యమయ్యాయి.

కనీసం ప్రస్తుతానికి ఉభయ పక్షాల మధ్య బలాబలాలతోపాటు క్షేత్రస్థాయి పరిస్థితులు, వాతావరణం పోలీసులకు అనుకూలంగా మోహరించి ఉన్నట్లు కనిపిస్తోంది. చివరకు సామాజిక స్పందనలు కూడా విప్లవకారుల స్థైర్యాన్ని నిలబెట్టగల విధంగా లేవు. ఇవన్నీ గడ్చిరోలి ఘటనల పాఠాలు. అందువల్లే, విప్లవోద్యమ చరిత్రలోనే అన్నింటికన్న పెద్దవైన గడ్చిరోలి కాల్పుల గురించిన వాస్తవాలను మహారాష్ట్ర పోలీసులు ఎలాంటి ఆత్మరక్షణకు లోనుకాకుండా, ఇంచుమించు ఎలాంటి దాపరికం లేకుండా బయటకు చెప్తున్నారు.

(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)