కాంగ్రెస్‌కు రాహుల్ గెలుపు గుర్రం అవుతారా?

2017 గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభిమానులకు అభివాదం చేస్తున్నా రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను మెప్పించేలా రాహుల్ ప్రవర్తించారు.
    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారం చేపట్టేవరకూ బీజేపీకి స్వర్ణయుగం రానట్లే. రానున్న ఎన్నికల్లో ఈ నాలుగు రాష్ట్రల్లోనూ తప్పక గెలుస్తాం...'' ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించాక మార్చి 3న మీడియా సమావేశంలో అమిత్ షా కామెంట్ ఇది.

అమిత్ షా మాటలతో.. బీజేపీ విజయోత్సవాలు ఇంకా ముగింపు దశకు రాలేదని, రానున్న ఎన్నికల కార్యాచరణ మొదలైందని అర్థమవుతోంది.

మరోవైపు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెరమరుగయ్యారు. తన అమ్మమ్మను చూడటానికి ఇటలీ వెళ్లారు.

గతేడాది డిసెంబర్‌లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక రాహుల్ గాంధీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. గుజరాత్ ఎన్నికల్లో చాలా మంది రాహుల్ గాంధీని అభినందించారు.

గుజరాత్‌లోని బీజేపీ ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 27-28 సార్లు హిందూ దేవాలయాలకు రాహుల్ వెళ్లారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోదీ, అమిత్ షా, గుజరాత్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

రాహుల్ ప్రభావం నుంచి బీజేపీకి కంచుకోటల్లాంటి స్థానాలను కాపాడుకోవడానికి మోదీ, అమిత్ షా చాలా కష్టపడాల్సివచ్చింది. కాంగ్రెస్ పార్టీ.. మరింత చాకచక్యంగా పావులు కదిపుంటే గుజరాత్ ఎన్నికల్లో పైచేయి సాధించడం కాంగ్రెస్‌కు అసాధ్యం కాదని అర్థమవుతోంది.

గుజరాత్ ఎన్నికల్లో రాహుల్ వైఖరి చూశాక.. ఆయన పూర్తిస్థాయి రాజకీయ నాయకుడుగా మారాడని చాలా మంది ప్రశంసించారు.

అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ ఇటలీ పర్యటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో.. అమిత్ షా, రాహుల్ గాంధీల పనితీరు పోల్చడం మొదలైంది.

ఒకవైపు అమిత్ షా వరుస విజయాలతో కదం తొక్కుతుంటే.. మరోవైపు రాహుల్ గాంధీ ఇంకా విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు కాకముందు.. పార్టీని బలోపేతం చేయాలని మాట్లాడిన రాహుల్.. అధ్యక్షుడయ్యాక చేస్తున్నదేమిటి? అని రాజకీయ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

కొత్తగా పార్టీ పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీని నాలుగు సంవత్సరాలుగా అధ్యక్షుడుగా ఉన్న అమిత్ షాతో పోల్చడం సరికాదని మరికొందరు వాదిస్తున్నారు.

''చాలా విషయాల్లో రాహుల్ గాంధీ తన వైఖరిని స్పష్టపరచాల్సి ఉంది... కొన్ని సంవత్సరాలుగా ప్రస్తావిస్తున్న విషయాలను అమలు చేయడానికి ఆయనకు కొంత సమయం ఇవ్వాలి. రాహుల్‌ను అమిత్ షాతో పోల్చడానికి ఇది సమయం కాదు'' అని సీనియర్ జర్నలిస్టు ఒకరు అభిప్రాయపడ్డారు.

ఉమేష్ రఘువంశి గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికలపై పార్టీ వైఖరిని ఆలస్యంగా ప్రకటించడం కాంగ్రెస్ దుస్థితికి ఉదాహరణ అని ఉమేష్ చెబుతున్నారు.

''ఉత్తర్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికపై పార్టీ వైఖరి ఆలస్యం కావడానికి కారకులైనవారికే పూర్తి బాధ్యతలు అప్పజెప్పాలి. అప్పుడు మాత్రమే పార్టీలో కొత్త సంస్కృతికి బీజం పడుతుంది'' అని ఉమేష్ అభిప్రాయపడ్డారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, AFP

2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 44స్థానాలకే పరిమితమైంది. అనంతరం ఏకే ఆంటొనీ కమిటీ ఎన్నికల ఫలితాలపై ఓ నివేదిక ఇచ్చింది. కానీ ఆ నివేదిక ఏమైందో.. ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు.

2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. ఎన్నికల ఫలితాల అనంతరం దాదాపు రెండు నెలలపాటు రాహుల్ గాంధీ అజ్ఞాతంలోకి వెళ్లారు. రాహుల్ ఎక్కడ? అంటూ మీడియాలో పలు వార్తలు కూడా వచ్చాయి.

''రాజకీయం ఆటలు కాదు.. మోదీ ఎప్పుడూ శలవులపై వెళ్లరు. విదేశీ పర్యటనలో ఉన్నాకూడా.. ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో ఆయన అలక్ష్యం చూపరు'' అని సీనియర్ పాత్రికేయులు సిద్ధార్థ్ వరదరాజన్ అన్నారు.

ఉత్తర్ ప్రదేశ్‌లో 312 అసెంబ్లీ స్థానాలను గెలిచిన వెంటనే బీజేపీని బలోపేతం చేయడానికి అమిత్ షా 95 రోజులపాటు దేశవ్యాప్తంగా పర్యటించారు. 2019ఎన్నికల్లో విజయం సాధించే వ్యూహంలో ఇది కూడా భాగమే!

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 7 స్థానాలకే పరిమితమైంది. ఎన్నికల ఫలితాల అనంతరం అమిత్ షా దేశవ్యాప్త పర్యటన చేస్తే, రాహుల్ గాంధీ మాత్రం.. అనారోగ్యంగా ఉన్న తన తల్లిని చూడటానికి అమెరికా వెళ్లారు.

హిందుస్తాన్ టైమ్స్ సీనియర్ పాత్రికేయులు జతిన్ గాంధీ రాహుల్ గాంధీపై ఓ పుస్తకం రాశారు. రాహుల్ గాంధీ సమర్థవంతంగా పని చేయడం లేదని ఈయన అభిప్రాయపడుతున్నారు. ఎకనామిక్ టైమ్స్ పాత్రికేయులు రాకేష్ మోహన్ చతుర్వేది బీజేపీకి సంబంధించిన వార్తలను గత పది సంవత్సరాలుగా రాస్తున్నారు. ఈయన విశ్లేషణ మేరకు..

''అమిత్ షా చాలా చురుకుగా పని చేస్తారు. ఉదయం 8-9 గం. నుంచి ఆయన ప్రజలను కలుస్తారు. తన ఇల్లు, కార్యాలయం రెండు చోట్లా ఆయన ప్రజలను కలుస్తారు. కానీ రాహుల్ గాంధీ అలా కాదు. ఆయన ప్రజలతో ఎక్కువగా కలవరు. ఎన్నికల సమయాల్లో మహా అయితే ఒకటి లేదా రెండు ర్యాలీల్లో పాల్గొంటారు.

గుజరాత్ ఎన్నికల్లాంటి ప్రతిష్టాత్మకమైన సందర్భాల్లో నాలుగు ర్యాలీల్లో పాల్గొన్నారు. కానీ నరేంద్ర మోదీ.. రోజుకు 5 ర్యాలీల్లో పాల్గొన్నారు'' అని చతుర్వేది అభిప్రాయపడ్డారు.

ఓటర్ల నుంచి పోలింగ్ బూత్ స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎంపిక చేసిన కొందరు వ్యక్తులకు, మంత్రులకు బాధ్యతలను అప్పగించి.. వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి బాధ్యతలను అమిత్ షా పర్యవేక్షిస్తారు.

అమిత్ షా, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

మరి రాహుల్ సంగతేంటి?..

''ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది. గుజరాత్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ పట్ల ప్రజల దృష్టి మారింది. అయితే.. అర్ధాంతరంగా అంతర్ధానమవ్వడమే సమస్య! రాజకీయాలంటే ఇరవైనాలుగు గంటల ఉద్యోగం కదా..!

కానీ అమిత్ షా అలా కాదు. ఎన్నికల్లో విజయం సాధించడానికి ఏఒక్క అవకాశాన్నీ అమిత్ షా వదలరు. ప్రతి చిన్న అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటారు'' అని ఎకనామిక్ టైమ్స్ పాత్రికేయులు రాకేష్ మోహన్ చతుర్వేది అభిప్రాయపడ్డారు.

గత నాలుగేళ్లలో రాహుల్, అమిత్ షా రాజకీయ ప్రయాణాన్ని ఓసారి పరిశీలిస్తే..

ఉత్తర్ ప్రదేశ్‌లో 2014 లోక్‌సభ ఎన్నికల బాధ్యతలను అమిత్ షాకు అప్పజెప్పారు. అప్పుడు రాజ్‌నాథ్ సింగ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీకి గెలుపు అసాధ్యమని అందరూ భావించారు.

మరోవైపున రాహుల్ గాంధీ చురుకుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే.. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ 80లోక్‌సభ స్థానాలకుగానూ 71 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.

గుజరాత్ ఎన్నికల అనుభవం అమిత్ షాకు బాగా ఉపయోగపడింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని కుల సమీకరణాలను సులువుగానే అర్థం చేసుకున్నారు. స్థానికంగా ఉండే బడా నేతలకు అందుబాటులో ఉంటూ పరిస్థితిని సమీక్షించేవారు.

అసంతృప్త నేతలను శాంతింపచేసి, అందరినీ కలుపుకుపోయి అఖండ విజయం సాధించారు. ఉత్తర్ ప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాక, అమిత్ షాకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పదోన్నతి లభించింది.

తల్లి సోనియాతో రాహుల్

ఫొటో సోర్స్, AFP

మరవైపు.. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ స్థానాలు 206 నుంచి 44 స్థానాలకు పరిమితమయ్యాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నపుడు బీజేపీ కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. కానీ ఇప్పటి పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుతం బీజేపీ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.

2014 మే - 2016 డిసెంబర్ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో.. ఆంధ్రప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. మధ్యప్రదేశ్‌లోని ఓ విద్యార్థి.. అత్యధిక ఎన్నికల్లో 27సార్లు ఓటమి చవిచూసిన నేతగా రాహుల్ పేరును గిన్నిస్‌బుక్‌లో ఉంచాలని దరఖాస్తు చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో 2017 డిసెంబర్‌లో రాహుల్ గాంధీ ఎట్టకేలకు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. రాహుల్.. ముందు నుంచి కూడా సిగ్గరిలా కనిపించేవాడు. అసలు రాజకీయాల పట్ల సుముఖత ఉన్న వ్యక్తిలా ప్రవర్తించేవాడు కాదు. కానీ 2004లో అమేథీ నుంచి లోక్‌సభకు పోటీ చేసి అందర్నీ ఆశ్చర్యపరచారు.

2007లో పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికై యూత్ కాంగ్రెస్‌పై దృష్టి సారించారు. ఈ సమయంలో పార్టీలో కొన్ని సంస్కరణలు రావాలని ఆయన ప్రస్తావించేవారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా రాహుల్ నియమితులయ్యారు. తాను భవిష్యనేతగా ప్రజల గుండెల్లో ముద్ర వేసుకోవడానికి చాలా బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సమయంలో 200 ర్యాలీల్లో పాల్గొని, పేదల గుడిసెల్లో నిద్రించారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకమునుపు.. పార్టీలోని సీనియర్ నాయకుల వల్లనే కాంగ్రెస్‌పై రాహుల్ ముద్ర లేదని, తాను కోరుకుంటున్న మార్పులను తీసుకురాలేకపోతున్నారని అనేవారు. కానీ ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నా.. ఆ మార్పులు ఎందుకు రాలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పార్టీ అధ్యక్షుడు కాకముందు, ప్రస్తుతం రాహుల్ గాంధీలో చెప్పుకోదగ్గ మార్పులేవీ లేవని చాలా మంది భావిస్తున్నారు.

ఒకవైపు అమిత్ షా నేతృత్వంలో బీజేపీ కాంగ్రెస్ రహిత భారత్ అజెండాతో ముందుకు పోతోంటే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Bloomberg/Getty Images

స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే నేతగా రాహుల్‌ గాంధీ కనిపించడం లేదు. నరేంద్ర మోదీ దిల్లీకి వచ్చినపుడు ఆయన ప్రధాన మంత్రి అభ్యర్థిత్వాన్ని చాలా మంది తీవ్రంగా వ్యతిరేకించారు. సాక్షాత్తూ ఎల్.కే.అడ్వాణీ కూడా వ్యతిరేకించారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి ప్రస్తుత ప్రధానిగా మోదీ పరిణమించారని జతిన్ గాంధీ అన్నారు.

పార్టీని పటిష్టపరుచుకునే బదలు.. ప్రత్యర్థి పార్టీ చేసే పొరపాట్ల కోసం ఎదురు చూసి, వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ ఈ వ్యవధిలో.. బీజేపీ తన పార్టీని పటిష్టపరుచుకోవడంలో నిమగ్నమై ఉంది.

''కాంగ్రెస్ పార్టీ ప్రజలతో మమేకమవడం లేదు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం లేదు. కేవలం ప్రసంగాలు, ర్యాలీలు, రోడ్ షోలు ఎన్నికల్లో విజయాన్ని సాధించిపెట్టవు కదా!'' అని రాకేష్ మోహన్ చతుర్వేది వివరించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)