ఆ ఎంఎస్‌డీ ఈ ఎంఎస్‌డీని ఎందుకు కలిశారు?

ధోనీతో సనుష్

ఫొటో సోర్స్, Inpho

అమ్మతో ఆడుకునే వయసులో ఈ బుజ్జోడు బ్యాట్ పట్టుకున్నాడు. కార్టూన్ చూడాల్సిన సమయంలో వీడు క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. ఆఖరికి ధోనీతో కూడా శెభాష్ అనిపించుకున్నాడు.

చెన్నైకి చెందిన ఈ పిల్లాడి పేరు ఎం. సనుష్ సూర్యదేవ్. క్లుప్తంగా చెప్పాలంటే ఎంఎస్‌డీ. భారత క్రికెట్ ఆటగాడు ధోనీని కూడా అభిమానులు ఎంఎస్‌డీ అనే పిలుచుకుంటారు.

ఇంకో విశేషమేంటంటే.. ఈ ఇద్దరు ఎంఎస్‌డీల పుట్టినరోజు ఒక్కటే (07-07). పెద్ద ఎంఎస్‌డీ తన ఆటతో కోట్లాది అభిమానుల్ని సంపాదిస్తే, చిన్న ఎంఎస్‌డీ తన ఆట తీరుతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాడు.

వీడియో క్యాప్షన్, ఈ పిల్లాడి ఆట తెలియాలంటే.. ఈ వీడియో చూడండి

ప్రస్తుతం సనుష్ వయసు రెండున్నరేళ్లు. ఆ పిల్లాడికి రెండేళ్లు ఉన్నప్పుడు వాళ్ల నాన్న ఓ వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టారు. కొన్ని రోజుల్లోనే అది వైరల్‌గా మారింది. అప్పట్నుంచీ సనుష్‌ని చాలామంది జూనియర్ ఎంఎస్‌డీ అనడం మొదలుపెట్టారు.

అంతలా ఆ వీడియో వైరల్ కావడానికి కారణం సనుష్ ఆటతీరే. రెండేళ్ల వయసులోనే అతడు ఆడిన షాట్లు అచ్చమైన క్రికెట్ షాట్లను పోలి ఉన్నాయి. ఫుట్‌వర్క్, షాట్ల ఎంపిక, బ్యాట్‌ని స్వింగ్ చేసే తీరు.. ఇలా అన్నీ ప్రొఫెషనల్‌ ఆటతీరుకు దగ్గరగా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.

ధోనీతో సనుష్ కుటుంబ సభ్యులు

'సనుష్‌కి క్రికెట్ అంటే ఇష్టమని గమనించి నేనే నేర్పడం మొదలుపెట్టా. కానీ ఇంత బాగా ఆడతాడని అనుకోలేదు' అని అతడి తండ్రి అంటున్నారు.

సనుష్‌ను 'యంగెస్ట్ చైల్డ్ క్రికెటర్'గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. ఆ తరవాత ధోనీని కూడా కలిసి సనుష్ అతడి అభినందనలు అందుకున్నాడు.

సనుష్ ఆట తీరుకి ధోని చాలా ముచ్చటపడ్డారని ఆ పిల్లాడి తండ్రి అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)