లైంగిక హింసపై సర్వత్రా చర్చ: పెద్ద మార్పు ఇదే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశ రాజధానిలో 'నిర్భయ'పై దారుణ అత్యాచారం జరిగి నేటికి ఐదేళ్లయ్యింది. ఈ నేపథ్యంలో, భారత్‌లో మహిళల పరిస్థితులు మెరుగుపడ్డాయా అనే అంశంపై బీబీసీ ప్రతినిధి గీతాపాండే అందిస్తున్న కథనం.
2012 డిసెంబరు 16న రాత్రి 9గంటలు దాటిన తర్వాత దిల్లీలో 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థిని, ఆమె స్నేహితుడు ఒక బస్సు ఎక్కారు.
కదిలే బస్సులో బస్సు డ్రైవర్, మరో ఐదుగురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్నేహితుడిని తీవ్రంగా కొట్టారు. తర్వాత వారిద్దరిని రోడ్డు పక్కన పడేశారు.
కొందరు స్థానికులు వారిద్దరిని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. ఆ విద్యార్థిని దాదాపు రెండు వారాలపాటు మృత్యువుతో పోరాడి, చివరకు కన్నుమూశారు. ఆ యువతిని మీడియా 'నిర్భయ'గా పేర్కొంది.
నిర్భయ అత్యాచారం, మృతి నేపథ్యంలో జరిగిన నిరసనలు, ఆందోళనలతో భారత్ అట్టుడికింది.

ఫొటో సోర్స్, Getty Images
అంతకు పదేళ్ల ముందు...
నిర్భయ ఉదంతం జరగడానికి దశాబ్దం ముందే నేను నిర్భయ తరహా బాధితురాలిని ఒకరిని కలిశాను. భారత్‌లో అత్యాచారాలపై బీబీసీ రేడియో కోసం నేను ఒక ఫీచర్ చేస్తున్న సమయంలో, సెంట్రల్ దిల్లీలో ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడిచే పునరావాస కేంద్రంలో ఆమెను కలిశాను.
ఆమె గుజరాత్‌లోని ఒక సంచార జాతికి చెందిన నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. తన భర్త, తమ ఒక్కగానొక్క సంతానంతో కలిసి ఆమె దిల్లీకి వచ్చారు.
దిల్లీలో కొన్ని నెలలపాటు రోజు కూలీలుగా భార్యాభర్తలు పనిచేశారు. ఒకసారి గుజరాత్ వెళ్లి వద్దామని బయల్దేరారు. రైలు వచ్చే సమయానికి రైల్వే స్టేషన్‌లో చాలా గందరోగళం ఉంది.
మిగతా కుటుంబ సభ్యులు రైలు ఎక్కగా, అక్కడున్న గందరగోళం వల్ల ఆమె ఎక్కలేకపోయారు. రైలు వెళ్లిపోయింది. ఆమె ప్లాట్‌ఫాంపైనే ఉండిపోయారు! ఆమె చేతిలో డబ్బుల్లేవు.
ప్లాట్‌ఫాంపై ఏడుస్తూ కూర్చున్న ఆమె వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. తాను ట్రక్కు డ్రైవర్‌ను అని, ఆమెను ఇంటికి చేరుస్తానని నమ్మబలికాడు.

ఫొటో సోర్స్, Getty Images
మనసు వికలమైంది
నాలుగు రోజులపాటు ఆమెను ట్రక్కులో తిప్పుతూ, ఆ డ్రైవర్, మరో ముగ్గురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు. చనిపోయేలా ఉందనే అనుమానంతో ఆమెను రోడ్డు పక్కన పడేశారు.
తర్వాత వేరేవారు ఆమెను గుర్తించి, ఆస్పత్రికి తరలించారు.
పునరావాస కేంద్రంలో నేను ఆమెను కలిసినప్పుడు ఆమె దయనీయ స్థితిలో ఉన్నారు. కొన్ని నెలలపాటు ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆమెను అక్కడకు తీసుకొచ్చారు. అత్యాచారానికి పాల్పడినవారు తన రొమ్ముపై సిగరెట్‌తో కాల్చారంటూ ఆ గుర్తులను ఆమె నాకు చూపించారు.
ఆమె కుటుంబం ఎక్కడుందో ఆమెకు తెలియదు.
ఆమె పరిస్థితి చూసిన తర్వాత నా మనసు వికలమైంది. జీవితంలో తొలిసారిగా నాకు భయం కలిగింది. ఈ భయం నన్ను వెంటాడుతూ వస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ భయం తాలూకు ప్రభావం, నాకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు మహిళలకు నేను చెప్పే జాగ్రత్తల్లో కనిపిస్తుంటుంది. వారిలో ఒకరు నా సోదరి, ఇంకొకరు నా బెస్ట్ ఫ్రెండ్(అప్పట్లో తను నా కొలీగ్). ఎప్పుడూ హుషారుగా ఉంటూ, ఎంతో స్వతంత్రంగా వ్యవహరించే మహిళలు వాళ్లు.
వాళ్లు నన్ను కలిసి తిరిగి వెళ్లేటప్పుడల్లా, వారికో మాట చెబుతుంటాను- ఇల్లు చేరగానే నాకు మెసేజ్ చేయాలని! మొదట్లో వాళ్లు నా తీరు చూసి నవ్వేవారు.
నా జాగ్రత్తలతో కొన్నిసార్లు వాళ్లకు విసుగు కూడా తెప్పిస్తుంటాను. ఎందుకంటే వాళ్లు మెసేజ్ చేయడం మరచిపోతే, మరుసటి రోజు ఉదయాన్నే ఫోన్ చేసి, మందలిస్తాను! కొన్నిసార్లు వాళ్లు నన్ను ఆట పట్టించారు కూడా!
ఈ భయం నాలో కొనసాగుతుండగానే, 2012లో నిర్భయ అత్యాచారం జరిగింది. దోషులను కఠినంగా శిక్షించాలని, పటిష్ఠ చట్టాలు తేవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా యువత, ప్రజలు పెద్దయెత్తున ఆందోళనలు, ప్రదర్శనలు చేశారు. మహిళలపై నేరాల నియంత్రణకు ప్రభుత్వం మెరుగైన చట్టాన్ని తీసుకొచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
చర్చ జరగాలి
అన్నింటికన్నా పెద్ద మార్పు ఏమిటంటే- లైంగిక హింస పట్ల సమాజం వైఖరిలో వచ్చిన మార్పు. సెక్స్, లైంగిక నేరాల గురించి గతంలో భారత్‌లో బహిరంగంగా అంతగా మాట్లాడుకొనేవారు కాదు. ఇప్పుడు వీటి గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది.
మహిళలకు అనువైన దేశంగా భారత్‌ను మార్చే క్రమంలో జరగాల్సిన మొదటి పరిణామం ఏమిటంటే- మహిళల హక్కులు, వారి భద్రతపై చర్చ జరగడం. ఈ అంశాలపై భారత్‌లో ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇది సోషల్ మీడియాకూ విస్తరించింది.
మహిళల భద్రత, మహిళా సమానత్వానికి సంబంధించిన ప్రతి చిన్న, పెద్ద విషయంపై చర్చ జరుగుతోంది. ఈ అంశాలపై సునిశిత దృష్టి కేంద్రీకృతమై ఉంది. వీటికి సంబంధించిన అనేక ఆందోళనలు, ఉద్యమాలపై మేం కథనాలు అందించాం.
మహిళలు తమ భద్రత, హక్కుల కోసం ముందెన్నడూ గళం విప్పలేదని నేను చెప్పడం లేదు. పురుషాధిక్య భావజాలంతో కూడిన ఆలోచనలు, విధానాలపై ఎంతో మంది మహిళా యోధులు దశాబ్దాలుగా పోరాడుతున్నారు.
సమాజాన్ని మహిళలకు, ఇతర వర్గాలకు మరింత సురక్షితమైన, మెరుగైన, సమ్మిళితమైన సమాజంగా తీర్చిదిద్దేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్న మహిళామణులపై రానున్న రోజుల్లో మేం కథనాలు అందిస్తాం.

ఫొటో సోర్స్, Getty Images
స్ఫూర్తిదాయక పోరాటం
మరి మహిళల పోరాటం ఎంతమేర విజయవంతమైంది?
ఇటీవల విడుదలైన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) 2016 గణాంకాలను చూస్తే పరిస్థితి తీవ్రంగా ఉంది. మహిళలపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి.
వరకట్న వేధింపులతో వేల మంది యువతులను చంపేస్తున్నారు. వేల మంది బాలికలు, మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. లక్షల మంది మహిళలు గృహహింసను ఎదుర్కొంటున్నారు. భ్రూణహత్యలు కొనసాగుతున్నాయి.
గత వారంలోనే ఆరేళ్ల బాలికపై దారుణ అత్యాచారానికి పాల్పడి, బాలికను చిత్రవధకు గురిచేసి చంపేసిన ఉదంతం, క్యాన్సర్‌ను జయించిన 16 ఏళ్ల అమ్మాయిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనల వార్తలు వచ్చాయి.
ఒకవైపు పరిస్థితులు ఇలా ఉన్నా, తమ భద్రత, హక్కుల సాధనకు మహిళలు పోరాటాన్ని కొనసాగిస్తుండటం స్ఫూర్తిదాయకం. భారత్‌లో మహిళల భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందనే ఆశలను కలిగించేది వారి ఈ పోరాటపటిమే!
మా ఇతర కథనాలు:
- అమరావతి తీర్పు: ఎన్జీటీ కమిటీలు ఏం చేస్తాయి?
- అమెరికాలో మాట్లాడే భారతీయ భాషల్లో తెలుగుది ఎన్నో స్థానం?
- గుజరాత్-- అందరిలా సంతోషంగా బతికే హక్కు నాకూ ఉంది
- కుల వ్యవస్థ ప్రసంగాలతో పోయేది కాదు- బీబీసీతో అంబేడ్కర్
- గుజరాత్- '2002 అల్లర్ల తర్వాత 15 ఏళ్లుగా ఓట్లేసినా ఒరిగిందేమీ లేదు’
- ఇవాంకా ట్రంప్ ప్రసంగం - 10 ముఖ్యాంశాలు
- ఇరాక్ ప్రధాని: ఐఎస్‌పై యుద్ధం ముగిసింది
- సౌరకుటుంబాన్ని పోలిన కెప్లర్-90ను కనుగొన్న నాసా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








