ఎడారిలో డ్యాములు కడుతున్న బామ్మ
- రచయిత, ఆమీర్ రఫీక్ పీర్జాదా
- హోదా, బీబీసీ ఇన్నొవేటర్స్ సిరీస్, రాజస్థాన్
ఆమ్లా రుయాను చూస్తే ఏదో మామూలు బామ్మ అనుకుంటారు. కానీ 71 ఏళ్ల వయసున్న ఈ ముంబై మహిళ ప్రపంచంలో ఎంతో విజయవంతమైన డ్యామ్ నిర్మాతల్లో ఒకరు. భారతదేశంలో కరువు మీద పోరాటంలో ఆమె ముందు వరుసలో ఉన్నారు.
భారత్‌లో ఏటా 30 కోట్ల మంది జనం తీవ్ర నీటి కొరతతో సతమతమవుతుంటారు. ఇటీవలి సంవత్సరాల్లో రుతుపవనాలు నిరాశాపూరితంగా ఉండటంతో ప్రభుత్వం రైళ్లు, ట్యాంకర్ల ద్వారా పొలాలకు, గ్రామాలకు నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది.
నీరు తెచ్చుకోవడానికి సమీపంలో ఉన్న బావి కూడా చాలా మైళ్ల దూరం ఉండటంతో ఆ దూరం నడిచేలోపు డీహైడ్రేషన్ (నిర్జలీకరణం) వల్ల మనుషులు చనిపోయిన ఉదంతాలున్నాయి.
దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన రాజస్థాన్ నీటి కొరత అధికంగా ఉండే రాష్ట్రాల్లో ఒకటి. ఆమ్లా రుయాతోపాటు ఆమె ఆకార్ చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడే పనిచేస్తోంది.
గత పదేళ్లలో వారు 200కి పైగా ‘చెక్ డ్యామ్’లు నిర్మించారు. ఫలితంగా 115కి పైగా గ్రామాల్లో జీవితాలు, జీవనాధారాలు సమూలంగా మారిపోయాయి. ఇది మరో 193 గ్రామాలపైనా సానుకూల ప్రభావం చూపింది.

పురాతన వ్యవస్థ
ఈ ట్రస్ట్ గ్రామస్థులతో కలిసి పనిచేస్తూ, పరిసర ప్రాంతాల్లో రిజర్వాయర్ లాగా నీటిని పట్టి ఉంచగల భూభాగాలను గుర్తిస్తుంది.
కొండ ప్రాంతాల్లో సహజంగా ఉండే కాంటూర్లను, సహజంగా ఉన్న లోతట్టు ప్రాంతాలను రిజర్వాయర్లలా ఉపయోగిస్తూ వాన నీరు అక్కడికి జారివచ్చేలా పల్లాలను, ఆ నీరు అక్కడ నిలిచి ఉండేలా గట్లను నిర్మిస్తారు.
రుతుపవనాలు వచ్చినపుడు వర్షాలతో ఈ చెక్-డ్యాములు నిండుతాయి. ఎంతోకాలంగా ప్రమాదకర స్థాయిలో పడిపోయిన భూగర్భ నీటి మట్టాలను పునరుద్ధరిస్తాయి.
తర్వాత వచ్చే వేసవి కాలానికి అవసరమైన నీరు గ్రామాల సమీపంలోని చెరువులు, బావుల్లో నిండుతుంది.
ఈ చెక్ డ్యాములు నిర్మించడం చౌక. భారీ డ్యాములు, రిజర్వాయర్ల లాగా ఇక్కడ భారీ స్థాయిలో ప్రజలు నిర్వాసితులు కావడమూ ఉండదు.
‘‘ఇది కొత్త పరిష్కారమేమీ కాదు. మా పూర్వీకులు దీనిని ఆచరించారు’’ అని చెప్తారు ఆమ్లా రుయా.

‘‘మేం కట్టే నిర్మాణాల్లో మధ్యలో మాత్రమే కాంక్రీటు గోడ ఉంటుంది. నీటి మట్టాలు పెరిగినపుడు నీరు గోడ మీదుగా ఇవతలివైపు వచ్చి సులభంగా ప్రవహించడానికి వీలుగా ఆ నిర్మాణం ఉంటుంది’’ అని ఆకార్ చారిటబుల్ ట్రస్ట్ ఇంజనీర్ దృగ్పాల్ సిన్ఘా వివరించారు.
‘‘మిగతా గోడలు కూడా మట్టి కట్టలతో నిర్మించేవే. ఇక జలాశయ గర్భం కూడా మామూలు మట్టే. అంటే మొత్తం మట్టితో కట్టేదే’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘ఇది నిండినపుడు నీరు నేరుగా మట్టిలోకి ఇంకిపోతుంది. భూగర్భ జలాలను పెంపొందిస్తుంది. సమీపంలోని బావులన్నిటిలోనూ నీటి మట్టాలను పెంచుతుంది’’ అని చెప్పారు.

విశ్వాసం.. అవిశ్వాసం...
ప్రతి చెక్ డ్యామ్‌కు అవసరమైన నిధుల్లో 60 శాతాన్ని ఈ ట్రస్ట్ అందిస్తుంది. మిగతా 40 శాతం నిధులను సమకూర్చాల్సిందిగా స్థానిక ప్రజలను కోరుతుంది.
స్థానికులు ఈ స్థాయి పెట్టుబడి పెట్టేలా, గ్రామస్థులు, రైతులు ఈ చెక్‌డ్యామ్‌ల నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా చూస్తోంది. దానివల్ల ట్రస్ట్ వైదొలగిన తర్వాత కూడా వీటి ప్రయోజనాలు కొనసాగుతాయి.
‘‘తొలుత మమ్మల్ని విశ్వసించడానికి గ్రామస్థులు సుముఖంగా లేరు. మాకేదో స్వార్థ ఆలోచన ఉందని వారు భావించారు’’ అని ఆమ్లా రుయా తాము ఈ కృషి ప్రారంభించిన తొలి రోజుల గురించి చెప్పారు.
చెక్ డ్యామ్‌ల నిర్మాణంతో జీవితాలపై గొప్ప ప్రభావం ఉందని ఈ ట్రస్ట్ అంటోంది.

గతంలో మనుగడ కోసం ట్యాంకుల ద్వారా నీటిని తీసుకెళ్లే గ్రామాల్లో ఇప్పుడు రైతు మూడు పంటలు పండించటంతోపాటు పశువులనూ పెంచుతున్నారని ట్రస్ట్ చెప్తోంది.
నీరు తేవడం కోసం తమ తల్లులు మైళ్ల దూరం వెళ్లి రావాల్సి ఉన్నందున ఇళ్లలోనే ఉండిపోయే బాలికలు ఇప్పుడు స్కూళ్లకు వెళుతున్నారని ఆమ్లా రుయా తెలిపారు.
ఆకార్ చారిటబుల్ ట్రస్ట్ ఏటా స్థానికులతో కలిసి సగటున 30 చెక్ డ్యామ్‌లు నిర్మిస్తోంది. దీనిని మూడు రెట్లకు పెంచి ఏటా 90 చెక్ డ్యాములు కట్టాలని ఆమ్లా రుయా కోరుకుంటున్నారు.
చెక్ డ్యామ్‌ల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలన్నది కూడా ఆమె ఆకాంక్ష.
కానీ ఈ పరిష్కారం అందరికీ వర్తించదని స్థానిక నీటి కార్యకర్త ప్రఫుల్ కాదామ్ అభిప్రాయపడుతున్నారు.
‘‘ఈ చెక్ డ్యామ్‌లు ఇక్కడి స్థానికులకు చాలా ప్రయోజనం అందిస్తాయి. భవిష్యత్తులో సీజన్ పంటలకు తోడ్పడతాయి. కానీ దీనికి పరిమితులు కూడా ఉన్నాయి. ఈ వినూత్న ఆవిష్కరణ దేశం మొత్తానికీ వర్తించదు. ఎందుకంటే దేశంలో విభిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు.
కానీ ఇదేదీ ఆమ్లా రుయా కృషిని ఆపడం లేదు.
‘‘నాకు 90 ఏళ్లు వచ్చే వరకూ నా చెక్ డ్యామ్‌ల పని చేస్తూనే ఉంటానని నేనొకసారి నా భర్తతో చెప్పాను. ‘మరి ఆ తర్వాత 30 ఏళ్లు ఏం చేస్తావు? నువ్వు 120 ఏళ్ల వరకూ పనిచేస్తూనే ఉంటావు’ అని ఆయన అన్నారు’’ అంటూ నవ్వుతారు ఆమ్లా రుయా.
బీబీసీ వరల్డ్ సర్వీస్ కార్యక్రమానికి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ నిధులు అందిస్తోంది.



(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









