తెలంగాణ: వరంగల్ జిల్లాలో యాసిడ్ దాడిలో వివాహిత మృతి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అంజయ్య తవిటి
- హోదా, బీబీసీ ప్రతినిధి
యాసిడ్ దాడిలో గాయపడి, ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధవి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
వరంగల్ జిల్లాలో యాసిడ్ దాడి ఘటన కలకలం సృష్టించింది. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి సమీపంలో ఓ వివాహితపై బుధవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ పోసి పరారయ్యారు.
బాధితురాలు వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని కరీమాబాద్, సాకరాసి కుంటకు చెందిన బోయిన మాధవి అలియాస్ మాధురి అని తెలిసింది.
గర్మిళ్లపల్లి సమీపంలోని చెట్ల పొదల్లో కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న మహిళ కేకలు విన్న గ్రామస్థులు, 108కి సమాచారం అందించి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారని స్థానిక పాత్రికేయుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
మాధవికి మూడేళ్ల కింద తన మేనమామ చంటితో వివాహమైంది. ఆమెకు ఒక కూతురు ఉంది.
అయితే, కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఆమె సాకరాసి కుంట ప్రాంతంలో తన తల్లితో కలిసి ఉంటూ ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నారని స్థానికులు తెలిపారు.
"బోయిని మాధురి భర్త నుంచి విడాకులు తీసుకోకుండానే, చందు అనే వ్యక్తికి దగ్గరయ్యారు. ఇద్దరూ వేములవాడలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇటీవల మరో వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉంటున్నారనే అనుమానాలున్నాయి. దాంతో కక్ష పెంచుకుని చందు ఈ దాడికి పథకం రచించాడు. అతనికి మరో ఇద్దరు సహకరించినట్టు తెలిసింది. వారిపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పూర్తి విచారణ జరగాల్సి ఉంది. 47 శాతం కాలిపోయిన స్థితిలో ఆమె ఆస్పత్రిలో చేరగా.. వెంటిలేషన్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందించే ప్రయత్నం చేశారు" అని వర్ధన్నపేట ఏసీపీ మధు తెలిపారు.
"సాకరాసి కుంట వాసి కలువాల చందు, అతని ఇద్దరు మిత్రులపై 307, 326 ఏ, 367 R/W 34 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం, దోషులను త్వరలోనే అరెస్టు చేస్తాం" అని జఫర్‌గడ్ ఎస్‌ఐ రాజన్ బాబు చెప్పారు.

2008 తర్వాత మళ్లీ ఇదే...
వరంగల్ జిల్లాలో 2008లో ఇద్దరు విద్యార్థినులపై జరిగిన యాసిడ్ దాడి అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
వరంగల్ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన స్వప్నిక, ప్రణీతలపై 2008 డిసెంబర్ 10 సాయంత్రం మోటారు సైకిల్‌పై వచ్చిన ముగ్గురు యువకులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు.
ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన స్వప్నిక మృతి చెందారు. ప్రణీత కోలుకున్నారు. ఆ తర్వాత దాడి చేసిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ ముగ్గురూ మరణించారు. ఆ ఎన్‌కౌంటర్‌పై భిన్న కథనాలున్నాయి. దానిపై ఇప్పటికీ కోర్టులో కేసు నడుస్తోంది.
అయితే, అప్పటి నుంచి వరంగల్ జిల్లాలో ఎక్కడా యాసిడ్ దాడి ఘటనలు జరగలేదు. తాజా సంఘటనతో తెలంగాణవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలైంది.
మా ఇతర కథనాలు:
- బిత్తిరి సత్తిపై దాడి
- 'జీఎస్టీ, నోట్ల రద్దు మమ్మల్ని దెబ్బతీశాయి'
- అభంగపట్నం: ఆ దళితులిద్దరూ ఏమయ్యారు?
- ‘పురుషుల ముందే టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చేది’
- లక్షన్నర మంది బాలికల్ని బడికి పంపిన సామాన్య మహిళలు
- కేసీఆర్ మీద ఫేస్‌బుక్ పోస్టులు: కండక్టర్ సస్పెన్షన్
- కాంగ్రెస్‌లో రేవంత్ చేరికపై తలెత్తుతున్న ప్రశ్నలు
- 'పురోహితులకు ప్రభుత్వం కట్నమిస్తోందా!'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








