లెబనాన్: ఈ దేశంలో ఏ ఎలక్ట్రానిక్ వస్తువూ సేఫ్ కాదా, కంప్యూటర్లు, మొబైళ్లతోనూ భయమేనా....?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హ్యూగో బచెగా
- హోదా, మిడిల్ ఈస్ట్ కరస్పాండెంట్
లెబనాన్‌లో మంగళవారం జరిగిన వరుస పేజర్ పేలుళ్ల ఘటనల్లో అనేకమంది మరణించగా, వందలమంది గాయపడ్డారు.
పేజర్ల పేలుళ్ల ప్రభావం కొనసాగుతుండగానే హిజ్బుల్లా బలంగా ఉన్న దక్షిణ బేరూత్‌లోని దహియే ప్రాంతంలో మరోరకం పేలుళ్లు మొదలయ్యాయి.
జనం కిందపడిపోయి ఆర్తనాదాలు చేస్తున్న దృశ్యాలు, కొందరు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు వీడియోలలో కనిపిస్తున్నాయి.
అంతకు ముందురోజు జరిగిన పేలుళ్లలో చనిపోయిన ఓ 11 ఏళ్ల బాలుడు, మరో ముగ్గురు హిజ్బుల్లా సభ్యుల అంత్యక్రియలకు కొన్ని క్షణాల ముందు ఈ అలజడి చెలరేగింది.
అకస్మాత్తుగా పేలుడు శబ్దం రావడంతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారిపోయింది. అప్పటి వరకు నడుస్తున్న విషాద గీతాలు ఆగిపోయాయి. ఏం జరుగుతోందో తెలియక అక్కడున్నవారంతా అయోమయానికి గురయ్యారు.


ఫొటో సోర్స్, AFP
పేలిన వాకీటాకీలు… నెక్ట్స్ ఏంటి..?
వాకీటాకీలను కేంద్రంగా చేసుకుని రెండో దశ పేలుళ్లు జరిగాయి. అంటే, ఏ ఎలక్ట్రానిక్ పరికం కూడా సురక్షితం కాదని రిపోర్టులనుబట్టి అర్ధమవుతోంది.
కెమెరాలు, మొబైల్ ఫోన్స్ ఉపయోగించరాదంటూ బీబీసీ సిబ్బందిని లెబనాన్‌లోని హిజ్బుల్లా మద్దతుదారులు పలుమార్లు హెచ్చరించారు.
లెబనాన్‌కు చెందిన సిమ్ కార్డు ఫోన్‌లో ఉంటే పేలిపోయే ప్రమాదముందనే భయంతో, ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్ తీసుకున్నట్టు మా బృందంలోని ఓ ప్రొడ్యూసర్‌కు తన స్నేహితురాలు మెసేజ్ చేశారు.
అంతేకాదు, సోలార్ ప్యానల్స్ కూడా పేలిపోతాయనే ప్రచారం జరుగుతోంది. ఇలా ఎన్నో రకాల వదంతులు, ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో సామాన్య ప్రజలు కూడా భయభయంగా ఉన్నారు.
రెండో దశ పేలుళ్లుగా చెబుతున్న ఈ వాకీటాకీల దాడిలో దేశవ్యాప్తంగా దాదాపు 20 మంది చనిపోయారని, 450 మంది గాయపడ్డారని లెబనాన్ అధికారులు ప్రకటించారు. వీటి ధాటికి పదుల సంఖ్యలో ఇళ్లు, షాపులు, వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఈ దాడిని హిజ్బుల్లా గ్రూప్ తమ ఓటమిగా భావిస్తోంది. అంతేకాదు, ఈ దెబ్బతో మొత్తం తమ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ఇజ్రాయెల్ చేతుల్లోకి వెళ్లిపోయిందేమోనని అనుమానిస్తోంది.
ఈ తరుణంలో తరువాత ఏం జరగబోతుందా అన్న ఉత్కంఠ నెలకొంది.
‘మొబైల్స్, ల్యాప్‌టాప్స్ చూడాలంటేనే భయంగా ఉంది’
మంగళవారం జరిగిన వేలాది పేజర్ల పేలుళ్లతో ప్రజలు ఇంకా ఆ షాక్‌లోనే ఉన్నారు. దీని తరువాత ఏమైనా మేసేజ్ వస్తే అది హిజ్బుల్లా నుంచే వచ్చిందేమోనని యూజర్లు జంకుతున్నారు.
షాపుల్లో, ఇంట్లో, వీధుల్లో ఇలా పలుచోట్ల ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 8 ఏళ్ల పాప, 11 ఏళ్లు బాలుడు చనిపోయారు. సుమారు 2,800 మంది గాయపడ్డారు.
ఈ ఘటనలతో ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడ్డారని ఘిదా అనే మహిళ బీబీసీ న్యూస్ డే ప్రోగ్రాంలో చెప్పారు.
“మా మొబైల్స్, ల్యాప్‌టాప్స్ ఇలా వేటిముందు కూడా కూర్చోలేని స్థితిలో ఉన్నాం. ప్రతి వస్తువూ ప్రమాదకరంగానే కనిపించింది. ఏం చేయాలో ఎవరికీ తెలియని పరిస్థితి. నా దేశంలో జరుగుతున్న ఈ యుద్ధాన్ని చూస్తే భయమేస్తోంది. నా దేశం గురించి, నా ప్రజల గురించి ఆందోళన పడుతున్నా. ఇజ్రాయెల్, హిజ్బుల్లా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి మేం బలవుతున్నాం. మా పరిస్థితి ఇలా ఉండకూడదు” అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
60 శాతం మంది ఒక కన్నును కోల్పోయారు
మంగళవారం జరిగిన దాడిలో గాయపడిన వారిలో సుమారు 60 శాతం మంది ఒక కన్ను కోల్పోయారని డా. ఎలియాస్ వారక్ బీబీసీతో చెప్పారు. ఇంకా చాలామంది తమ చేతిని లేదా చేతి వేళ్లను కోల్పోయారని తెలిపారు.
“నా వైద్యవృత్తిలో ఇదే అత్యంత దారుణమైన రోజు. ఈ దాడిలో భారీ స్థాయిలో మృతులు, క్షతగాత్రుల సంఖ్య నమోదైంది. దురదృష్టవశాత్తు చాలామంది కళ్లను మేము బాగు చేయలేకపోతున్నాం. ఇంకా చాలామంది మెదడు, ముఖాలపై గాయాలతో బాధపడుతున్నారు” అని డాక్టర్ ఎలియాస్ వారక్ చెప్పారు.
పేజర్లు దేశంలోకి దిగుమతయ్యే సమయంలోనే అందులో పేలుడు పదార్థాలు పెట్టి ఉంటారని అనేక రిపోర్ట్స్ అంచనా వేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్‌తో యుద్ధానికి హిజ్బుల్లా సై అంటుందా..?
మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, మిలిటరీ దళాలు తమను సులువుగా గుర్తించి దాడి చేసే అవకాశం ఉందని హిజ్బుల్లా తమ గ్రూప్ సభ్యులకు పేజర్లు అందించింది. అయితే, బుధవారం రోజు జరిగిన వాకీటాకీల పేలుళ్లు ఎలా సంభవించాయో ఇంకా అంతుచిక్కడం లేదు.
ఈ దాడి కచ్చితంగా ఇజ్రాయెల్ చేసి ఉంటుందని హిజ్బుల్లా ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ ఈ దాడులపై స్పందించలేదు.
ప్రస్తుత రక్తపాతంతో రెండు దేశాల మధ్య వైరం పూర్తిస్థాయి యుద్ధంగా మారొచ్చనే భయాలు మొదలయ్యాయి. అదే కనుక జరిగితే, రెండు దేశాల సరిహద్దుల్లోని లక్షలాది మంది నిరాశ్రయులయ్యే అవకాశం ఉంది.
గాజాలోని పాలస్తీనీయులకు సంఘీభావంగా హిజ్బుల్లా ఏడాది క్రితమే ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది. సాధారణంగా ఈ దాడులు కాల్పుల విరమణ ఒప్పందంతో ఆగే అవకాశం ఉంటుంది. కానీ, ప్రస్తుత ఉద్రిక్త వాతావరణంలో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఒంటి కన్నుతో యుద్ధం చేస్తాం
“ఈ నొప్పి మా శరీరానికే కాదు మనసుకు కూడా. ఇది మాకు అలవాటైన విషయమే అయినా, మేం మా పోరాటంలో వెనక్కి తగ్గం” అని ఓ యువకుడు చెప్పారు.
“ఓ కన్ను పోతే ఏంటి..? ఒంటి కన్నుతో యుద్ధం చేస్తాం. ఈ దాడులు మమ్నల్ని మరింత బలంగా మార్చాయి. అందరం కలిసికట్టుగా పోరాడతాం” అని ఓ 45 ఏళ్ల మహిళ బీబీసీతో చెప్పారు.
‘యుద్ధంలో ఒక కొత్త దశకు ఆరంభంలో ఉన్నాం’’ అని ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యోవ్ గాలంట్ పేలుళ్లు జరిగిన కొన్ని గంటల తర్వాత ప్రకటించారు. అయితే, గాజా నుంచి ఇజ్రాయెల్‌కు తిరిగి వెళ్తున్న 98 డివిజన్ మిలిటరీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతానికైతే, ఇజ్రాయెల్‌తో పూర్తిస్థాయి యుద్ధానికి దిగేందుకు తాము సిద్ధంగా లేము అనే సంకేతాల్ని హిజ్బుల్లా ఇస్తోంది. ఎందుకంటే, యుద్ధాల కారణంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు లెబనాన్ కష్టపడుతోంది. ఈ సమయంలో యుద్ధం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని చాలామంది చెబుతున్నారు.
కానీ, మరికొందరు మాత్రం దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అని వాదిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














