మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం: కార్పొరేటర్ నుంచి ముఖ్యమంత్రి వరకు

devendra fadnavis oath taking

ఫొటో సోర్స్, ANI/twitter

    • రచయిత, మయురేశ్ కొన్నూర్, దీపాలి జగ్‌తాప్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం ఆదిత్యనాథ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఉప ముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ శిందే, అజిత్ పవార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు.

సరిగ్గా నాలుగు నెలల కిందట జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, రాష్ట్రంలో బీజేపీని అతిపెద్ద పార్టీగా నిలబెట్టడంలో ఫడణవీస్ కీలకపాత్ర పోషించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

గత పదేళ్లుగా బీజేపీతోపాటు మహారాష్ట్ర రాజకీయాల్లో దేవేంద్ర ఫడణవీస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దేవేంద్ర ఫడణవీస్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, దేవేంద్ర ఫడణవీస్

2014 వరకు మహారాష్ట్రలో అందరు బీజేపీ నాయకుల్లో ఒకరిగా ఉన్న ఫడణవీస్.. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు.

అనంతరం ఆయన బీజేపీలో తన పట్టు పెంచుకున్నారు.

కేంద్రంలో వాజ్‌పేయి - అడ్వాణీల బీజేపీ, మోదీ - షా బీజేపీగా మారినట్లు.. రాష్ట్రంలోనూ ముండే-గడ్కరీల బీజేపీ నుంచి ఫడణవీస్ - ఆయన మద్దతుదారుల బీజేపీగా మారింది.

దేవేంద్ర ఫడణవీస్

ఫొటో సోర్స్, Getty Images

దేవేంద్ర ఫడణవీస్ దాదాపు 30 ఏళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

తన సమకాలీన నాయకులతో పోలిస్తే వారికంటే చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు ఫడణవీస్. పదవులు పొందడంలోనూ ఆయన అందరికంటే ముందున్నారు. ఆయన కుటుంబానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తో అనుబంధంతో పాటు, రాజకీయ నేపథ్యముంది.

దేవేంద్ర ఫడణవీస్ తండ్రి గంగాధర్ ఫడణవీస్ బీజేపీ కీలక నేతల్లో ఒకరు. ఆయన చాలా ఏళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగారు.

తండ్రి గంగాధర్ ఫడణవీస్ చనిపోయేప్పటికి దేవేంద్ర ఫడణవీస్‌కు 17 ఏళ్లు.

గంగాధర్ మరణానంతరం ఖాళీ అయిన స్థానం నుంచి నితిన్ గడ్కరీ ఎన్నికయ్యారు.

దేవేంద్ర ఫడణవీస్ అత్తయ్య శోభాతాయ్ ఫడణవీస్ బీజేపీ - శివసేన తొలి సంకీర్ణ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు.

విద్యార్థి దశలో 'అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)' సభ్యుడిగా, నేతగా ఎదిగారు. గడ్కరీ అడుగుజాడల్లో నడుస్తూ, ఆ తర్వాత కొద్దికాలానికే రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. 1992లో, 22 ఏళ్లకే కార్పొరేటర్‌గా నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అడుగుపెట్టారు.

అలా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఫడణవీస్ రాజకీయ జీవితం గురించి మహారాష్ట్ర టైమ్స్ నాగ్‌పూర్ ఎడిషన్ ఎడిటర్ శ్రీపాద్ అపరాజిత్ మాట్లాడుతూ, ''మిగిలిన రాజకీయ నాయకులతో పోలిస్తే, సులువుగానే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆయన రాజకీయ ప్రయాణం మాత్రం అంత సులభంగా ఏమీ సాగలేదు. 1992లో తొలిసారి కార్పొరేటర్‌ అయ్యారు, నిజానికి ఆ ఎన్నికలు 1989లో జరగాల్సి ఉంది. అప్పటికి ఆయనకు వయసు సరిపోదు, కానీ అదృష్టవశాత్తూ ఆ ఎన్నికలు వాయిదాలు పడడంతో చిన్నవయసులోనే కార్పొరేటర్ అయిపోయారు'' అన్నారు.

ఆ తర్వాత, చిన్నవయసులోనే నాగ్‌పూర్ మేయర్ అయ్యారు. అనంతరం, శివసేన - బీజేపీ తొలి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో జరిగిన 1999 ఎన్నికల్లో గెలిచి మొదటిసారి శాసన సభలో అడుగుపెట్టారు.

నితిన్ గడ్కరీ, దేవేంద్ర ఫడణవీస్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఎన్నికల్లో విజయం తర్వాత నితిన్ గడ్కరీ ఆశీస్సులు తీసుకుంటున్న దేవేంద్ర ఫడణవీస్

ఫడణవీస్ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో నాగ్‌పూర్, విదర్భ ప్రాంతాల్లో నితిన్ గడ్కరీ హవా నడిచేది. ఫడణవీస్ ఆయన అడుగుజాడల్లోనే రాజకీయంగా తొలి అడుగులు వేశారు. ఆ తర్వాత మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో గడ్కరీని వీడి, ఆయన ప్రత్యర్థి గోపీనాథ్ ముండే వర్గానికి దగ్గరయ్యారు. అలా, 2013లో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని దక్కించుకోగలిగారు.

దేవేంద్ర ఫడణవీస్‌ను ఆర్ఎస్ఎస్‌లో కీలక సభ్యుడిగానూ, అధిష్టానానికి విధేయుడిగానూ చెబుతారు. అది ఆయనకు మేలు చేసింది. మరో విషయమేంటంటే, 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత మోదీ - షా సారథ్యంలోని బీజేపీ నితిన్ గడ్కరీకి అంత అనుకూలంగా లేదని చెబుతుంటారు.

అదే సమయంలో, రాష్ట్రాల్లో మెజారిటీ వర్గానికి చెందిన నాయకుడిని కాకుండా, మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిని చేసే వ్యూహాన్ని బీజేపీ అమలు చేసింది. హరియాణాలో జాట్ కాని మనోహర్‌లాల్ ఖట్టర్, ఝార్ఖండ్‌లో గిరిజనేతర నాయకుడు రఘువర్ దాస్‌ను ముఖ్యమంత్రులను చేసింది.

అదే కోవలో మరాఠాయేతరుడైన దేవేంద్ర ఫడణవీస్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి దక్కింది.

కేంద్రంలో కొలువుదీరిన మోదీ ప్రభుత్వ తరహా అభివృద్ధి నమూనాను ఫడణవీస్ కూడా ఫాలో అయ్యారు. జలయుక్త శివర్ యోజన వంటి పథకాలకు భారీ ప్రచారం కల్పించారు. అయితే, ఆ తర్వాత వచ్చిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది.

భూగర్భ జలాలను పెంచడమే ఈ పథకం లక్ష్యం. కానీ, భూగర్భ జలాలు పెద్దగా పెరగలేదని కాగ్ నివేదిక పేర్కొంది.

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, దేవేంద్ర ఫడణవీస్

ఫొటో సోర్స్, ANI

సొంతపార్టీలో ప్రత్యర్థులను తప్పించి..

ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఫడణవీస్ మహారాష్ట్రలో అధికార కేంద్రంగా ఎదిగారు. మోదీ అడుగుజాడల్లో నడుస్తూ, ఒకవైపు అభివృద్ధి ఇమేజ్, మరోవైపు పార్టీలో తన ప్రత్యర్థులను తగ్గించుకోవడం వంటి వ్యూహాలను అమలు చేశారని విశ్లేషకులు చెబుతారు.

నిజానికి, సొంత పార్టీలోని ప్రత్యర్థులనే ఫడణవీస్‌కు పెద్దసవాల్‌గా చెబుతారు. నితిన్ గడ్కరీ, ఏక్‌నాథ్ ఖడ్సే, పంకజ ముండే, వినోద్ తావ్డే, చంద్రకాంత్ పాటిల్‌లను ఆయనకు ప్రత్యర్థులుగా భావిస్తారు.

వీరిలో నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సి రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం తగ్గిపోయింది. ఇతర ప్రత్యర్థుల దారులు కూడా మూసుకుపోవడంతో ఫడణవీస్‌కు దాదాపు అడ్డంకులు తొలగాయి.

మంత్రులుగా ఉన్న ఏక్‌నాథ్ ఖడ్సే, పంకజ ముండే, వినోద్ తావ్డేలు వరుస వివాదాలతో ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.

అవినీతి ఆరోపణల కారణంగా ఖడ్సే మంత్రి పదవి కోల్పోయారు. ఆయన్ను మళ్లీ క్యాబినెట్‌లోకి తీసుకోలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్ కూడా దక్కలేదు.

దీంతో ఫడణవీస్‌పై ఖడ్సే విమర్శలు కూడా చేశారు. చివరకు ఖడ్సే బీజేపీని వీడి శరద్ పవార్ పార్టీలో చేరారు.

పంకజా ముండే

ఫొటో సోర్స్, FACEBOOK

బోగస్ డిగ్రీ కేసుతో పాటు పాఠశాల పరికరాల కోనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో వినోద్ తావ్డే సమస్యల్లో పడ్డారు.

ఈయనకు కూడా ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. చివరకు, రాష్ట్ర రాజకీయాలు వదిలి దిల్లీ బాట పట్టాల్సి వచ్చింది.

బీజేపీలో కీలక నేత కావడంతో తావ్డేకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. పలు రాష్ట్రాల బాధ్యతలు ఆయనపై పడ్డాయి.

''ప్రజల మనసుల్లో నేనే ముఖ్యమంత్రిని'' అన్న గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ ముండే.. ఫడణవీస్ క్యాబినెట్‌లో చేరిన కొంతకాలానికే చిక్కీ కేసులో చిక్కుకున్నారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి చవిచూశారు.

ఓబీసీ వర్గాల మద్దతు బలంగా ఉన్నప్పటికీ ఆమెకు చాలాకాలం ఎలాంటి పదవులు దక్కలేదు. శాసన మండలి, రాజ్యసభ వంటి అవకాశాలు ఆమె వరకు రాలేదు.

2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆమె పోటీ చేసినా, మళ్లీ ఓడిపోయారు. అయితే, మరాఠా - ఓబీసీ రిజర్వేషన్ వివాదాల తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓబీసీ ఓటర్ల అవసరం వంటి కారణాలతో ఎట్టకేలకు ఆమెకు మళ్లీ ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది. ఆమె ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.

ఖడ్సేకు ప్రత్యామ్నాయంగా గిరీశ్ మహాజన్‌కు మద్దతు ఇవ్వడం, వినోద్ తావ్డేకు ప్రత్యామ్నాయంగా ఆశిష్ షెలర్‌‌ను ప్రోత్సహించడం వంటివాటితో పార్టీలోని తన ప్రత్యర్థులకు ప్రత్యామ్నాయాలను కూడా దేవేంద్ర ఫడణవీస్ సిద్ధం చేసుకున్నారని చెబుతారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)