వైఎస్ షర్మిల పై దొంగతనం సహా పలు సెక్షన్ల కింద కేసులు, బెయిల్ మంజూరు

వీడియో క్యాప్షన్, ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించి అరెస్టయిన వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల పై దొంగతనం సహా పలు సెక్షన్ల కింద కేసులు, బెయిల్ మంజూరు

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కేంద్రంగా సోమవారం మధ్యాహ్నం నుంచి జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో వేడిని పెంచాయి.

హైదరాబాద్‌లో పోలీసులు ఆమెను మంగళవారం అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు, ఆ తరువాత నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

వైఎస్ షర్మిల పాదయాత్ర సోమవారం మధ్యాహ్నం నర్సంపేట నియోజకవర్గంలో సాగింది. ఆ సందర్భంగా ఆమె స్థానిక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డిపై విమర్శలు చేశారు.

దీంతో పెద్ది సుదర్శన్‌రెడ్డి అనుచరులుగా చెబుతున్నవారు షర్మిల వాహనాలపై దాడి చేశారు. పాదయాత్ర తరువాత సాయంత్రం షర్మిల భోజనం చేసే, సేదతీరే బస్సుపై పెట్రోలు పోసి తగులబెట్టేందుకు ప్రయత్నించారు.

పాదయాత్రలో ఆమె వెంట వస్తున్న కొన్ని కార్లను కూడా ధ్వంసం చేశారు.

దీంతో షర్మిల అక్కడ నిరసన తెలిపారు. దాంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని వరంగల్ మీదుగా హైదరాబాద్ తరలించాలి.

వైఎస్ షర్మిల

ఫొటో సోర్స్, twitter/ysrtp

షర్మిల కారులో ఉండగానే క్రేన్‌తో ఎత్తి తరలించారు

అనంతరం షర్మిల మంగళవారం ఉదయం.. టీఆర్ఎస్ నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ, తనకు భద్రత కావాలని కోరుతూ ముందురోజు టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన కారులోనే ప్రగతి భవన్‌కు బయలుదేరారు.

ధ్వంసమైన ఒక కారును ఆమె స్వయంగా నడుపుతూ వెళ్లగా ఆమె వెంట ధ్వంసమైన మిగతా వాహనాలను అనుచరులు తీసుకెళ్లారు.

పంజాగుట్ట ప్రాంతంలో పోలీసులు ఆమెను అడ్డుకుని ప్రగతి భవన్‌కు వెళ్లొద్దని సూచించారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలుగుతుందని, కారు దిగాలని ఆమెను పోలీసులు కోరగా ఆమె నిరాకరించారు.

దీంతో కారులో ఆమె ఉండగానే పోలీసులు క్రేన్ సహాయంతో ఆ కారును అక్కడి నుంచి ఎత్తి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

అక్కడ కూడా ఆమె కారు నుంచి దిగడానికి నిరాకరించగా మహిళా పోలీసుల బలవంతంగా ఆమెను కిందకు దించారు.

వైఎస్ షర్మిల

ఫొటో సోర్స్, FB/IMSHARMILAREDDY

ఆమెను వెంటనే విడుదల చేయాలంటూ తల్లి విజయమ్మ ఇంటి నుంచి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరగా ఆమెనూ పోలీసులు అడ్డుకున్నారు.

అనంతరం పోలీసులు షర్మిలపై ఐపీసీ సెక్షన్లు 353, 333, 327 ప్రకారం కేసులు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి వంటివి ఈ సెక్షన్ల పరిధిలోకి వస్తాయి.

అనంతరం ఆమెను అరెస్ట్ చూపించి నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

కాగా షర్మిల అరెస్ట్ అనంతరం అక్కడకు వచ్చిన ఆమె భర్త అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఐపీసీ సెక్షన్ 333 ప్రకారం కేసు పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రభుత్వ అధికారులపై ఆమె దాడి చేయలేదని, అలాంటప్పుడు ఈ సెక్షన్ ప్రకారం ఎలా కేసు పెడతారని ఆయన అన్నారు.

బెయిల్ మంజూరు

షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. మంగళవారం సాయంత్రం ఆమెను హైదరాబాద్ నాంపల్లి కోర్టు ముందు ప్రవేశ పెట్టారు. 

రిమాండ్ చేసిన కోర్టు, తరువాత ఆమెకు వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ ఇచ్చింది.

షర్మిలతో కలిపి ఏడుగురిపై పోలీసులు కేసు పెట్టారు. షర్మిల, ఇందూజా రెడ్డి, సుధారాణి, ముషారఫ్, బాషా, సంజీవ్ కుమార్, కొడెం శ్రీనులపై కేసులు పెట్టారు.

 ‘‘షర్మిల బస్సును ఆపితే, వెనుక నుంచి కారులో షర్మిల వచ్చారు. కారును ఆపే ప్రయత్నం చేసినా ఆగలేదు. చాలా వేగంగా వచ్చి, నన్నుఢీకొట్టబోయారు. నేను ఆమె  ప్రవర్తనను వీడియో తీస్తుంటే నన్ను తిట్టారు. నా సెల్ ఫోన్ లాక్కున్నారు. ఆ క్రమంలో భారీ  ట్రాఫిక్ జాం అయింది.’’ అంటూ షర్మిలపై రాసిన ఫిర్యాదులో ఎస్ఐ అఖిల పేర్కొన్నారు 

షర్మిలపై పెట్టిన కేసులు: (ఐపీసీ సెక్షన్లు)

143 – అక్రమంగా గుమిగూడినందుకు 

341 – అక్రమంగా ఇతరులను నిలువరించినందుకు

290 – పబ్లిక్ న్యూసెన్స్ కి 

506 – నేరపూరితంగా బెదిరించినందుకు 

509 – మహిళను కించపరచడం

336 – నిర్లక్ష్యంగా ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేలా ప్రవర్తించడం

353 – ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహించకుండా అడ్డుకోవడం, దాడి చేయడం

382 – దొంగతనం

ఈ కేసులను షర్మిలతో పాటూ ఏడుగురి మీద పెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)