హిరోషిమా: అణుబాంబు పేలుడు నుంచి బయటపడిన కొందరు కొరియన్లు ఇప్పుడెలా ఉన్నారు?

హిరోషిమా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అణుబాంబు బాధితులు (ఫైల్ ఫోటో)
    • రచయిత, హ్యోజంగ్ కిమ్
    • నుంచి, బీబీసీ ప్రతినిధి, హాప్చాన్

1945, ఆగస్టు 6వ తేదీ ఉదయం 8:15 గంటల సమయం...

హిరోషిమా నగరంపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు ఆకాశం నుంచి రాయిలా జారిపడింది.

అప్పుడు లీ జంగ్-సూన్ ప్రాథమిక పాఠశాలకు వెళ్తోంది. ఇప్పుడామె వయసు 88 ఏళ్లు. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా చేతులు ఊపుతోంది.

''మా నాన్న పనికి వెళ్లబోతున్నారు. కానీ అకస్మాత్తుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. మమ్మల్ని వెంటనే ఖాళీ చేసేయమన్నారు. చనిపోయినవారితో వీధులన్నీ నిండిపోయాయని చెప్పారు. నేను చాలా షాక్ అయ్యాను. నాకు గుర్తున్నదల్లా ఒక్కటే ఏడుపు. నేను చాలా ఏడ్చాను'' అని లీ చెప్పారు.

హిరోషిమా

ఫొటో సోర్స్, BBC/Hyojung Kim

ఫొటో క్యాప్షన్, హిరోషిమా అణుబాంబు పేలుడు నుంచి ప్రాణాలతో బయటపడి దక్షిణకొరియాలోని హాప్చాన్‌లో నివసిస్తున్న చాలామంది బాధితుల్లో ఒకరైన లీ జంగ్-సూన్ (88 ఏళ్ల వయసు)

4.20 లక్షల జనాభా గల నగరాన్ని 15 వేల టన్నుల టీఎన్‌టీతో సమానమైన పేలుడు కమ్మేసింది. ఆ తర్వాత మిగిలిందేమిటంటే...గుర్తించలేనివిధంగా ఛిద్రమైన శవాలు.

''అణుబాంబు...చాలా భయంకరమైన ఆయుధం'' అన్నారు లీ.

మొట్టమొదటి అణుబాంబు 'లిటిల్ బాయ్'‌ను అమెరికా జపాన్‌లోని హిరోషిమాపై ప్రయోగించి 80 సంవత్సరాలు అయ్యింది. నాటి ఆ దాడిలో దాదాపు 70 వేల మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.

తర్వాత కొన్ని నెలల్లో రేడియేషన్ ఫలితంగా అనారోగ్యం, కాలిన గాయాలు, డీహైడ్రేషన్‌తో వేలమంది చనిపోయారు.

హిరోషిమా, నాగాసాకి నగరాలపై అణుబాంబుల విధ్వంసం రెండో ప్రపంచ యుద్ధానికి, ఆసియాలో జపాన్ సామ్రాజ్యవాద పాలనకు నిర్ణయాత్మకమైన ముగింపు పలికింది.

అణుబాంబు తక్షణ బాధితుల్లో దాదాపు 20 శాతంమంది కొరియా ప్రజలనేది అంతగా వెలుగులోకి రాలేదు.

ఈ బాంబు దాడి నాటికి 35 ఏళ్ల ముందు నుంచి కొరియా జపాన్ కాలనీగా ఉండేది. హిరోషిమా నగరంలోనే 1.40 లక్షల మంది కొరియా ప్రజలు ఉండేవారు. వారిలో ఎక్కువమందిని పనులు చేయించుకోవడానికి బలవంతంగా తీసుకొచ్చారు.

అణుబాంబు దాడి నుంచి బయటపడినవారు, వారి వారసులతో నాటి పీడకలలోనే జీవిస్తున్నారు. రూపుమారిన శరీరం, బాధతో పాటు పరిష్కారం దొరకని న్యాయం కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హిరోషిమా , నాగాసాకి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అణుబాబు దాడి నుంచి బయటపడినవారంతా యుద్ధం తర్వాత హాప్చాన్‌లో నివసిస్తుండటంతో ఈ నగరాన్ని 'కొరియా హిరోషిమా' అని పిలుస్తారు

నాటి వినాశనానికి ఎవరిది బాధ్యత?

''బాంబు వేసిన దేశమూ, మమ్మల్ని రక్షించడంలో విఫలమైన దేశమూ...ఎవరూ బాధ్యత తీసుకోవట్లేదు'' అని షిమ్ జిన్-టే అన్నారు.

83 ఏళ్ల వయసుగల ఆయన కూడా అణుబాంబు బాధితుడే. ప్రస్తుతం హాప్చాన్‌లో నివసిస్తున్నారు.

''అమెరికా ఎప్పుడూ క్షమాపణ చెప్పలేదు. జపాన్ తెలియనట్లు నటిస్తోంది. కొరియా చెప్పకోదగినదేమీ చేయలేదు. వారు ఒకరినొకరు నిందించుకుంటారు. మనం ఒంటరిగా మిగిలిపోతాం'' అని అన్నారు.

లీ ఇంకా నాటి షాక్ నుంచి తేరుకోలేదు. ఆమె శరీరం అనారోగ్యం పాలైంది. ఆమె ఇప్పుడు స్కిన్ క్యాన్సర్, పార్కిన్సన్స్ వ్యాధితో పాటు యాంజినా (గుండెకు తగిన స్థాయిలో రక్తం సరఫరా లేకపోవడంతో కలిగే ఛాతినొప్పి)తో బాధపడుతున్నారు. అక్కడితో ఆమె సమస్యలు ఆగిపోలేదు. కిడ్నీ పాడవ్వడంతో ఆమె తన కుమారుడు హో-చాంగ్ సహాయంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు.

''రేడియేషన్‌కు గురికావడం వల్లే ఈ పరిస్థితి అని నేను అనుకుంటున్నాను. కానీ దాన్ని ఎవరు నిరూపించగలరు? శాస్త్రీయంగా నిరూపించడం కష్టం. జన్యుపరీక్ష అవసరం. అది చాలా ఖరీదైంది, మేము భరించలేనిది'' అని హో-చాంగ్ లీ అన్నారు.

2020 నుంచి 2024 మధ్యకాలంలో జెనెటిక్ డేటా సేకరించామని, తదుపరి అధ్యయనాలను 2029 వరకూ కొనసాగిస్తామని ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంవోహెచ్‌డబ్ల్యూ) బీబీసీకి తెలిపింది.

వీటి ఫలితాలు చాలా కీలకమని, బాధితుల రెండు, మూడో తరాలకు వర్తించేలా 'బాధితుల' నిర్వచనాన్ని విస్తరించడానికీ పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.

కొరియన్ల అష్టకష్టాలు...

అణుబాంబు పేలిననాటికి దాదాపు 1.40 లక్షల మంది కొరియన్లు హిరోషిమాలో ఉన్నారు. వారిలో ఎక్కువ మంది హాప్చాన్ నుంచి వెళ్లినవారే.

హాప్చాన్ చుట్టూ పర్వతాలు, తక్కువ వ్యవసాయ భూములతో ప్రజలు జీవించడానికి అనువైన ప్రదేశం కాదు. ఆ పంటలనూ జపాన్ ఆక్రమణదారులు కబ్జా చేసేశారు. మరోవైపు కరువు పరిస్థితులు భూమి పనికిరాకుండా మార్చేశాయి.

యుద్ధ సమయంలో వేలాది మంది జపాన్‌కు వలస వెళ్లారు. అక్కడ కొంతమందిని బలవంతంగా సైన్యంలోకి నియమించుకున్నారు. ''మీరు రోజూ మూడుపూటలు తినవచ్చు, మీ పిల్లలను స్కూలుకు పంపవచ్చు'' అని ఆశ చూపిస్తే మరికొందరు ఆకర్షితులయ్యారు.

జపాన్‌లో కొరియన్లను ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూసేవారు. కష్టతరమైన, అత్యంత ప్రమాదకరమైన, అపరిశుభ్రమైన ప్రదేశాలలో ఉద్యోగాలు ఇచ్చేవారు.

తన తండ్రి ఆయుధ కర్మాగారంలో వెట్టిచాకిరీ కార్మికుడిగా పనిచేసేవారని, తన తల్లి మందుగుండు సామాగ్రి పెట్టే చెక్క పెట్టెలకు మేకులు కొట్టే పని చేసేవారని షిమ్ చెప్పారు.

హిరోషిమాలోని కొరియన్లకు పనిచేసే చోటనున్న ఈ పరిస్థితులు అణుబాంబు దాడి తర్వాత మరింత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైనవిగా మారిపోయాయి.

అరకొరగా వైద్యం, ప్రమాదకరమైన పని, వేళ్లూనుకుపోయిన వివక్ష... ఇవన్నీ కొరియన్లలో మరణాల సంఖ్య అసంఖ్యాకంగా పెరగడానికి కారణమయ్యాయి.

కొరియన్ అటమిక్ బాంబు విక్టిమ్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం...కొరియన్లలో మరణాలు 57.1 శాతం కాగా, మొత్తం అణుబాంబు దాడితో మరణాలతో పోలిస్తే 33.7 శాతం.

దాదాపు 70 వేల మంది కొరియన్లు బాంబు దాడికి గురయ్యారు. వారిలో 40వేల మంది ఏడాదిలోపే చనిపోయారు.

హిరోషిమా

ఫొటో సోర్స్, BBC/Hyojung Kim

ఫొటో క్యాప్షన్, షిమ్ జిన్-టే

సొంతగడ్డపైనా వివక్ష...

హిరోషిమా, నాగాసాకిలపై అణుబాంబుల దాడితో జపాన్ లొంగిపోయింది. కొరియాకు స్వాతంత్ర్యం వచ్చింది. దీంతో దాదాపు 23వేల మంది కొరియన్లు స్వదేశానికి తిరిగొచ్చారు. వారికేమీ స్వాగతం లభించలేదు. వికృత రూపం ఉన్నవారిగా, శాపగ్రస్తులుగా ముద్రపడినవారు మాతృభూమిలోనూ వివక్షను ఎదుర్కొన్నారు.

''తీవ్రంగా కాలిన గాయాలైన, తీవ్ర పేదరికంలోనున్న వ్యక్తుల పట్ల భయంకరంగా ప్రవర్తించారు. మా గ్రామంలో కొంతమందికి వీపు, ముఖం కాలిపోయి తీవ్రంగా గాయపడ్డారు. వారి కళ్లు మాత్రమే కనిపించేవి. వివాహం చేసుకోకూడదని వారిని తిరస్కరించారు. దూరంగా ఉంచారు'' అని లీ చెప్పారు.

హిరోషిమా

ఫొటో సోర్స్, BBC/Hyojung Kim

ఫొటో క్యాప్షన్, సొంత కుటుంబంలోనే వివక్ష ఎదుర్కొంటున్న రెండో తరం బాధితురాలు హాన్ జాంగ్-సన్

తరాలు మారినా మారని పరిస్థితులు...

హాన్ జాంగ్-సన్, అణుబాంబు బాధితుల రెండో తరానికి చెందినవారు. ఆమె తుంటి ఎముకలలో అవాస్కులర్ నెక్రోసిస్‌ అనే సమస్యతో బాధపడుతున్నారు. సరిగా నడవలేరు. ఆమె మొదటి బిడ్డ కూడా సెరిబ్రల్ పాల్సీ (మస్తిష్క పక్షవాతం)తో జన్మించాడు.

''నా కొడుకు జీవితంలో ఒక్క అడుగు కూడా వేయలేడు. అత్తమామలు నన్ను భయంకరంగా చూస్తున్నారు. 'నీవు వికలాంగురాలివి. వికలాంగుడైన కొడుకును కన్నావు. మన కుటుంబాన్ని నాశనం చేస్తావా?' అని అంటుంటే నాకు పరమ నరకం కనిపిస్తుంది’’ అని హాన్ ఆవేదన చెందారు.

ఉత్తర కొరియాతో యుద్ధం, ఆర్థిక సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన దక్షిణ కొరియా ప్రభుత్వం కూడా సొంత ప్రజలపై దశాబ్దాలుగా సరైన శ్రద్ధ చూపించలేదు.

రెండోతరం బాధితులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని రెండు వేర్వేరు అధ్యయనాలు వెల్లడించాయి.

సాధారణ ప్రజానీకంకన్నా అణుబాంబు బాధిత కుటుంబాల్లో రెండో తరం బాధితులు డిప్రెషన్, గుండె జబ్బులు, రక్తహీనతతో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉందని ఒక నివేదిక పేర్కొంది.

రెండో తరంలో వైకల్య నమోదు రేటు కూడా జాతీయ సగటు కన్నా దాదాపు రెట్టింపు ఉందని 2013 నుంచి జరుగుతున్న అధ్యయనం ఒకటి వెల్లడించింది.

హిరోషిమా

ఫొటో సోర్స్, BBC/Hyojung Kim

ఫొటో క్యాప్షన్, అణుబాంబు దాడిలో చనిపోయిన కొరియన్లు పేర్లతో ఒక్కొక్కరికి ఒకటి చొప్పున 1,160 చెక్క జ్ఞాపికలను హాప్చాన్‌లోని మెమోరియల్ హాల్‌లో ఉంచారు

క్షమాపణ లేకుండా శాంతి....

హిరోషిమా అధికారులు తొలిసారిగా గత నెల జులై 12వ తేదీన హాప్చాన్ సందర్శించారు. ఒక స్మారక స్తూపం దగ్గర పుష్పగుచ్ఛాలు ఉంచారు. మాజీ ప్రధాని యుకియో హటోయామా, ఇతర ప్రైవేట్ వ్యక్తులు గతంలో వచ్చినప్పటికీ, జపాన్ అధికారుల మొదటి అధికారిక పర్యటన ఇదే.

''2025లో జపాన్ శాంతి గురించి మాట్లాడుతోంది. కానీ క్షమాపణ లేకుండా శాంతి అనేది అర్థంలేనిది'' అని జపాన్ శాంతి కార్యకర్త జుంకో ఇచిబా అన్నారు. ఆమె దీర్ఘకాలంగా కొరియన్ హిరోషిమా బాధితుల కోసం పోరాటం చేస్తున్నారు.

జపాన్ మాజీ నాయకులు చాలామంది క్షమాపణలు, పశ్చాత్తాపం తెలియజేసినా, అధికారిక అంగీకారం లేకుండా చేసినవి నిజాయితీ లేనివిగానే చాలామంది దక్షిణ కొరియన్లు భావిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)