కొత్త జేమ్స్‌బాండ్ ఎవరు, మాజీ బాండ్స్ ఏమంటున్నారు, అమెజాన్ బాస్ ఏం చెబుతున్నారు?

పియర్స్ బ్రాస్నన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పియర్స్ బ్రాస్నన్ 1995 గోల్డెన్ ఐ నుంచి 2002 డై అనదర్ డే వరకు నాలుగు బాండ్ చిత్రాలలో నటించారు.
    • రచయిత, ఫ్రాన్సెస్కా గిల్లెట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పదహారేళ్లలో ఐదు సినిమాల్లో జేమ్స్ బాండ్‌గా నటించారు డేనియల్ క్రెగ్. ఈ బ్రిటిష్ గూఢచారి పాత్రలో ఆయన నటన 2021 ఆరంభంలో ముగిసింది.

బాండ్ పాత్రకు నటుడి ఎంపిక చాలా ముఖ్యమైన నిర్ణయం. ఎందుకంటే, బాక్సాఫీస్ వసూళ్లు చాలా వరకూ ఈ పాత్రకు ఎన్నుకునే నటుడిపై కూడా ఆధారపడి ఉంటాయి.

డేనియల్ క్రెగ్ తర్వాత జేమ్స్ బాండ్‌ పాత్రలో ఎవరు నటించాలనే నిర్ణయాన్ని అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ తీసుకోనుంది. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు ఎక్స్‌లో తదుపరి బాండ్ ఎవరు అనే పశ్నను అభిమానులు సంధించారు. తదుపరి 007 ఎవరనేది అమెజాన్ బాస్ నిర్ణయించనున్నారు. డేనియల్ క్రెగ్ స్థానంలో ఎవరినీ ఎంపిక చేయాలనేది ఇప్పుడు అమెజాన్ ఎంజీఎం స్టూడియో ముందున్న అతిపెద్ద నిర్ణయం.

అయితే, బ్రిటిష్ వ్యక్తి తదుపరి జేమ్స్ బాండ్ పాత్రలో ఉండాలని అనుకుంటున్నట్లు నటుడు, మాజీ జేమ్స్‌బాండ్ పియర్స్ బ్రాస్నన్ చెప్పారు.

ఐరిష్‌కు చెందిన బ్రాస్నన్ సండే టెలిగ్రాఫ్‌ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. బాండ్ సినిమాల నిర్మాతలు అమెజాన్‌కు సృజనాత్మక నియంత్రణ ఇవ్వడం సరైన ఎంపిక అని భావిస్తున్నాననీ ఆయన చెప్పారు.

"వదులుకోవడానికి వారికి చాలా ధైర్యం అవసరం" అని బ్రాస్నన్ అన్నారు. బాండ్ పాత్రను గౌరవం, సృజనాత్మకత, శ్రద్ధతో అమెజాన్ నిర్వహిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆరోన్ టేలర్-జాన్సన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జేమ్స్ బాండ్ పాత్ర ఫేవరెట్లలో ఆరోన్ టేలర్-జాన్సన్ ఒకరు.

డేనియల్‌ క్రెగ్ స్థానంలో ఎవరు?

జేమ్స్ బాండ్ పాత్రకు డేనియల్ క్రెగ్ స్థానంలో జేమ్స్ నార్టన్, ఆరోన్ టేలర్-జాన్సన్, థియో జేమ్స్ ఫేవరెట్లుగా ఉన్నారు, వీరందరూ ఇంగ్లీష్ వారు.

గతంలో బాండ్ పాత్రను ఇద్దరు బ్రిటిషేతర నటులు పోషించారు. అందులో ఒకరు ఆస్ట్రేలియన్ జార్జ్ లేజెన్‌బై, మరొకరు ఐరిష్ వ్యక్తి పియర్స్ బ్రాస్నన్. బాండ్ పాత్రను ఇప్పటివరకు అమెరికన్ నటులు పోషించలేదు. ఇపుడీ పాత్ర కోసం అమెరికన్ నటుడు ఆస్టిన్ బట్లర్ పరిశీలనలో ఉన్నారు. ఆయన కాలిఫోర్నియాలో జన్మించారు.

ఈ పాత్ర కోసం ఫేవరెట్లుగా ఇతర బ్రిటిషేతర నటులలో ఐరిష్ నటులు పాల్ మెస్కల్, సిలియన్ మర్ఫీ, ఐడాన్ టర్నర్, ఆస్ట్రేలియన్ జాకబ్ ఎలోర్డి ఉన్నారు.

1967లో సీన్ కానరీ తర్వాత బాండ్ పాత్ర పోషించే అవకాశం హాలీవుడ్ నటుడు క్లింట్ ఈస్ట్‌వుడ్‌కు వచ్చిందని, అయితే ఆయన ఆ పాత్రను తిరస్కరించారని, అది తనకు సరైనది కాదని చెప్పారని తెలుస్తోంది. ఇయాన్ ఫ్లెమింగ్ నవలల్లో బాండ్‌కు స్కాటిష్ తండ్రి, స్విట్జర్లాండ్ తల్లి ఉన్నారు.

గత నెలలో ప్రకటించిన కొత్త ఒప్పందం ప్రకారం.. బాండ్ నిర్మాతలు బార్బరా బ్రోకలీ, మైఖేల్ జి. విల్సన్‌లు ఫ్రాంచైజీకి సహ-యజమానులుగా ఉంటారు.

కానీ, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్‌కు సృజనాత్మక నియంత్రణ ఉంటుంది.

బాండ్ వారసత్వంలో బార్బరా, మైఖేల్‌ తీసిన సినిమాల్లో భాగమైనందుకు గర్వంగా ఉందని 71 ఏళ్ల పియర్స్ బ్రాస్నన్ అన్నారు.

డేనియల్ క్రెగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డేనియల్ క్రెగ్

తదుపరి చిత్రం ఎప్పుడు?

జేమ్స్ బాండ్ కొత్త నటుడి పేరును ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై ఇప్పటివరకైతే స్పష్టత లేదు, తదుపరి బాండ్ చిత్రం ఎప్పుడు తీస్తారనేదానిపై నిర్దిష్ట కాలక్రమం కూడా లేదు. చివరిగా విడుదలైన బాండ్ చిత్రం నో టైమ్ టు డై (2021), బాండ్‌గా డేనియల్ క్రెగ్‌కు చివరి చిత్రమది.

బాండ్ వంటి పెద్ద సినిమాను రూపొందించడానికి సమయం పడుతుంది. ఇప్పటివరకు రెండు బాండ్ సినిమాల మధ్య ఆరేళ్ల గ్యాప్ అత్యధికం. ఇపుడు అది దాటే అవకాశముంది.

పియర్స్ బ్రాస్నన్ 1995 గోల్డెన్ ఐ నుంచి 2002 డై అనదర్ డే వరకు నాలుగు బాండ్ చిత్రాలలో నటించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)