ట్రంప్ ప్రమాణ స్వీకారానికి జిన్‌పింగ్‌ని పిలిచి మోదీని పిలవలేదా? అమెరికా అధ్యక్షుడి వ్యూహమేంటి

డోనల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, MANDEL NGAN/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, 2020 ఫిబ్రవరిలో డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి హోదాలో భారత్‌లో పర్యటించారు, దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ట్రంప్ - మోదీ కలుసుకున్న చిత్రం ఇది.
    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ హిందీ

అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి రెండోసారి ఆ పదవి చేపట్టారు.

2017 జనవరి 20న ఆయన తొలిసారి అధ్యక్షుడయ్యారు. తరువాత ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన నాలుగేళ్ల విరామం తరువాత ఇప్పుడు 2025లో మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

అమెరికాలో ఇలా, నాలుగేళ్లు అధికారానికి దూరమై తిరిగి అధ్యక్షుడైన రికార్డ్ గతంలో గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ పేరిట ఉండేది.

ఆయన 1885లో తొలిసారి అమెరికా అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత 1889 ఎన్నికల్లో ఓడిపోయి, తిరిగి 1893లో మళ్లీ గెలిచారు. ట్రంప్‌ కూడా ఇప్పుడాయన సరసన చేరారు.

ట్రంప్ స్వభావానికి తగ్గట్టుగానే ప్రమాణ స్వీకారాన్ని ''రాజు పునరాగమనం''లా అట్టహాసంగా జరిపేందుకు, కార్యక్రమానికి మరిన్ని రంగులద్దేందుకు టెక్ కంపెనీలు లక్షల డాలర్ల విరాళాలిచ్చాయి.

జాయింట్ కాంగ్రెసనల్ కమిటీ(జేసీసీఐసీ) నిర్వహించే ఈ ప్రమాణస్వీకార వేడుకల సంప్రదాయం 200 ఏళ్ల నాటిది. 1789లో న్యూయార్క్ నగరంలో జార్జ్ వాషింగ్టన్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇది కొనసాగుతోంది.

ట్రంప్ వేడుకకు హాజరైన వారి జాబితాలో ప్రపంచంలోని అతిపెద్ద నాయకులు, మిత్రులతో పాటు శత్రువులు - స్నేహితులు - బద్దవిరోధులుగా పేర్కొనే మిశ్రమ సమూహం ఉంది.

అధ్యక్ష కార్యాలయం అధికారికంగా అతిథుల జాబితాను విడుదల చేయకపోయినా, జాబితా గురించి చాలా ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రధాన మంత్రి మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీకి ఆహ్వానం ఉన్నట్లు ఎలాంటి ధ్రువీకరణ లేదు

కనిపించని మోదీ

ట్రంప్ గత పాలనలో బద్ద విరోధి అయిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ఆహ్వానించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది.

''మిత్రదేశాలైనా, ప్రత్యర్థులైనా, అన్ని దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలనే అధ్యక్షుడి ఆకాంక్షను ఇది ప్రతిబింబిస్తుంది'' అని ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లెవిట్ పేర్కొన్నారు.

అయితే, దానికి విరుద్ధంగా ట్రంప్ గతంలో 'క్లోజ్ ఫ్రెండ్' అని సంబోధించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేడుకలో కనిపించలేదు.

దీంతో ట్రంప్ తన ‘శత్రువు’ను పిలిచి, ‘స్నేహితుడి’ని ఎందుకు విస్మరించారు? అనే ప్రశ్న వినిపిస్తోంది.

దీనిపై ఇండియానా విశ్వవిద్యాలయానికి చెందిన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ సుమిత్ గంగూలీ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ.. ''ప్రత్యర్థులతో వ్యక్తిగత దౌత్యంపై ట్రంప్‌ విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తుంది'' అన్నారు.

''కాకపోతే గతంలో జరిగిన విషయాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా, ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్‌ విషయంలో ట్రంప్ ఆర్భాటంగా చేసిన కొన్ని ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు'' అన్నారు సుమిత్ గంగూలీ.

జిన్‌పింగ్, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జిన్‌‌పింగ్, ట్రంప్ (పాత ఫొటో)

చైనాకు ప్రాధాన్యం

జిన్‌పింగ్‌‌కు ఆహ్వానంపై మిషిగన్ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ ప్రొఫెసర్ జోయోజిత్ పాల్ మాట్లాడుతూ, ''భాగస్వామ్యపరంగా అమెరికాకు జిన్‌పింగ్ చాలా కీలకమైన నేత'' అన్నారు.

''ఎందుకంటే, చైనాతో వాణిజ్య సంబంధాలు పూర్తిగా వదులుకోవడం అమెరికాకు తీవ్రనష్టం కలిగిస్తుంది. అదే భారత్‌తో పూర్తిగా సంబంధాలు వదులుకోవాల్సి వస్తే, ప్రధానంగా జనరిక్ మందులు, వజ్రాల రంగంలో వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయి''

''ఈ రెండు రంగాల్లోనూ భారత్ తన విదేశీ మారక నిల్వల కోసం అమెరికా నుంచి వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది'' అని ఆయన వివరించారు.

అయితే, ట్రంప్ రెండోసారి పాలనలో ప్రధానంగా అంతర్జాతీయ సమస్యలపైనే ఫోకస్ ఉంటుందని చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే, ఇజ్రాయెల్ - హమాస్ వివాదం, యుక్రెయిన్ - రష్యా యుద్ధం, పెరుగుతున్న చైనా ప్రాభవాన్ని నిలువరించడం వంటివి.

రానున్న నాలుగేళ్లలో ఇజ్రాయెల్ - హమాస్ వివాదం, యుక్రెయిన్ - రష్యా యుద్ధం, చైనాను నిలువరించడం వంటివాటిపైనే ట్రంప్ ఎక్కువ శ్రద్ధ పెడతారని ప్రొఫెసర్ పాల్ భావిస్తున్నారు.

రాబోయే రోజుల్లో అమెరికా - చైనా సంబంధాలే ట్రంప్‌కి అతిపెద్ద సవాల్‌గా మారొచ్చని చాలామంది అమెరికన్ విశ్లేషకులు విశ్వసిస్తున్నారు.

జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ‌లో ఏషియన్ స్టడీస్ ప్రొఫెసర్ దేవేశ్ కపూర్ మాట్లాడుతూ, ''జిన్‌పింగ్‌ను ఆహ్వానించడానికి గల ప్రధాన కారణం చర్చలకు అవకాశముందన్న సంకేతాలు పంపడమే. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు చాలా సున్నితమైన అంశం. అదే సమయంలో భారత్‌తో పోలిస్తే, సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. అందువల్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం లేదు, ఇప్పటికైతే లేదు'' అన్నారు.

అమెరికా, భారత్

ఫొటో సోర్స్, Getty Images

అతిథుల జాబితా ఎలా రూపొందిస్తారు?

అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించాల్సిన అతిథుల జాబితాను రూపొందించే బాధ్యత జాయింట్ కాంగ్రెషనల్ కమిటీ, ట్రంప్ ట్రాన్సిషన్ టీమ్‌పై ఉంటుంది. వారు దౌత్య, వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది.

''అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించాల్సిన అతిథుల విషయంలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడి బృందం, నిర్వహణ బాధ్యతలు చూసుకునే జాయింట్ కాంగ్రెషనల్ కమిటీ చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో, విదేశీ అతిథుల మాదిరిగానే భారీ విరాళాలిచ్చిన దాతలు, అధ్యక్షుడి సహాయకులు, ఆయన బృందం కూడా కీలకం'' అని ప్రొఫెసర్ పాల్ చెప్పారు.

జాబితాలో మోదీ పేరు ఉందా, లేదా అనేది అంత కీలకం కాదని కొందరు విశ్లేషకులు వాదిస్తున్నారు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా అధికారికంగా ఎలాంటి అతిథుల జాబితానూ విడుదల చేయలేదు

ఈ విషయాన్ని అతిగా విశ్లేషించాల్సిన అవసరం లేదని దక్షిణాసియా వ్యవహారాల నిపుణులు మైకేల్ కుగల్‌మన్ అన్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న క్వాడ్ సమ్మిట్‌ సందర్భంగా మోదీ, ట్రంప్ భేటీ అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

''మోదీని ఆహ్వానించకపోవడాన్ని అంత పెద్దది చేసి చూడకూడదు. జిన్‌పింగ్ మినహా మరెవరినీ ప్రత్యేకంగా ఆహ్వానించలేదు. త్వరలోనే మోదీ, ట్రంప్ కలిసే అవకాశం ఉండొచ్చు. బహుశా, అది ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే క్వాడ్ సమ్మిట్ కావొచ్చు. కాబట్టి, ఆ కోణంలో చూస్తే మోదీని పిలవలేదనడం ఎలాంటి కారణం లేని హంగామా మాత్రమే.''

అయితే, తన మొదటి టర్మ్‌లో భారత్‌తో వాణిజ్య వివాదాలపై ట్రంప్ చిరాకుకు ఈ నిర్ణయం నిదర్శనమని కొందరు అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ వంటివి ఉన్నప్పటికీ, చైనా ప్రాభవాన్ని నిలువరించడంలో భారత్ వెనుకబడి ఉందని ట్రంప్ భావించవచ్చు.

అయితే, మోదీ కనిపించకపోవడంపై కొద్దిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు ప్రొఫెసర్ సుమిత్ గంగూలీ.

''ఇది ట్రంప్, మోదీ మధ్య సంబంధాలు అంత బాగులేవని సూచిస్తుంది'' అని ఆయన అంటున్నారు.

కానీ, ప్రొఫెసర్ జోయోజిత్ పాల్ మాత్రం, ''మొత్తమ్మీద చూస్తే, భారత్‌తో మంచి సంబంధాలే ఉన్నాయి, కాబట్టి ట్రంప్‌కు భారత్‌తో ఇప్పటికిప్పుడు పరిష్కారించాల్సిన సమస్యలు కానీ, గట్టిగా చర్చలు జరపాల్సిన అవసరం కానీ లేవు'' అని అంటున్నారు.

అయితే, గత సెప్టెంబర్‌లో అమెరికా పర్యటన సందర్భంగా భారత ప్రధాని మోదీ, డోనల్డ్ ట్రంప్‌ను కలిసేందుకు ప్రాధాన్యం ఇవ్వలేదని, వాళ్లిద్దరూ కలవలేదన్న చర్చ కూడా జరుగుతోంది.

మోదీ, బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

మోదీని ఆహ్వానించకపోవడానికి ఇతర కారణమేంటి?

''ట్రంప్ ఏ విషయం మర్చిపోరు, అది నిజమే. మోదీ క్వాడ్ సమ్మిట్ కోసం అమెరికాకు వచ్చినప్పుడు తనను విస్మరించారని ట్రంప్ భావించి ఉండొచ్చు, దానిని కాదనలేం. లోపల కక్ష పెంచుకుని ఉండొచ్చు'' అని కుగల్‌మన్ అన్నారు.

''కానీ, ఇది కేవలం ఊహాగానం మాత్రమే అని నేను భావిస్తున్నా. ప్రమాణ స్వీకారం విషయం మాత్రం భారత్ సహా ఇతర దేశాల కంటే, చైనాకి మాత్రమే సంబంధించిన అంశంగా కనిపిస్తోంది.''

''దీనిని మోదీ, ఇతర నాయకుల కోణంలో కాకుండా, చైనాకు మాత్రమే పంపిన సంకేతంగా చూడాలి.''

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

వ్యూహాత్మక మార్పు

అయితే, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్, చైనా ఉపాధ్యక్షులు హాన్ జెంగ్, ఇంకా చాలా దేశాల రాయబారులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ కోణంలో చూస్తే, జిన్‌పింగ్ కూడా ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించారు.

అలాగే, ఈ ఏడాది చివర్లో జరగనున్న క్వాడ్ సమ్మిట్‌ సందర్భంగా ట్రంప్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు మోదీకి తగినంత అవకాశం ఉంటుంది.

విదేశీ నేతలను, అందులోనూ ముఖ్యంగా రైట్ వింగ్ లీడర్స్‌‌గా ప్రజాదరణ పొందిన వారిని ఆహ్వానించడం ట్రంప్ దౌత్యవిధానంలో మార్పును సూచిస్తోందని నిపుణులందరిలో దాదాపుగా ఏకాభిప్రాయం ఉంది.

ట్రంప్‌కి దగ్గరి భావజాలమున్న నాయకులతో పొత్తుకి ఇది సంకేతం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)